వినూత్న ఆలోచనలే అతని విజయాలు

Wed,May 23, 2018 10:32 PM

-గొర్రెలు, మేకల పెంపకంలో తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న రైతు పూర్ణచంద్రారెడ్డి
-డ్రైఫాడర్, స్టాల్ ఫీడింగ్ విధానాలతో లాభసాటిగా గొర్రెల పెంపకం
-తాను నేర్చుకున్న అంశాలు పదిమందికి పంచేందుకు ఉచిత శిక్షణ తరగతులు
-భవిష్యత్తు వ్యవసాయం వైపు భరోసాగా అడుగులు
sheeps
ఏదైనా వినూత్నంగా ఆలోచించాలి. అప్పుడే విజయం సొంతమవుతుంది.ఇది రైతు పూర్ణచంద్రారెడ్డి అనుసరిస్తున్న సూత్రం. వ్యవసాయం అంటే ఎంతో మక్కువ ఉన్నా..ప్రస్తుత పరిస్థితుల్లో అందరిలా వ్యవసాయంవైపు కాకుండా వ్యవసాయ అనుబంధ రంగమైన గొర్రెలు, మేకల పెంపకంపై దృష్టి పెట్టారు. గొర్రెల ఫాం పెట్టినా మూస పద్ధతిలో కాకుండా కొత్తగా, రైతుకు మరింత లాభసాటిగా ఈ గొర్రెలు, మేకల పెంపకాన్ని మార్చాలనుకున్నాడు. అందుకు తానే స్వయంగా ఒక ఫాం పెట్టాడు. తొలి రెండేండ్లలో వచ్చిన నష్టాలు, అపజయాలను పాఠాలుగా నేర్చుకున్నాడు. కర్ణాటకతోపాటు ఇతర రాష్ర్టాల్లో విజయవంతంగా అమలుచేస్తున్న విధానాలతోపాటు తనకున్న ఆసక్తితో వాటికి మరిన్ని అంశాలను జోడించి స్టాల్ ఫీడింగ్ విధానం, డ్రైఫాడర్‌తో జీవాల పెంపకంలో మంచి అనుభవం సంపాదించారు. తాను పొందుతున్న లాభాలను ఇతర రైతులకు పంచాలన్న సదుద్దేశంతో స్టాల్‌ఫీడింగ్ విధానంలో గొర్రెలు, మేకల పెంపకంపై ఇతర రైతులకు ఉచిత శిక్షణ ఇస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.

గొర్రెలు, మేకల పెపకంలో వినూత్న పద్ధతులను అనుసరిస్తూ పలువురికి ఆదర్శంగా నిలస్తున్నందుకు ఆయను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 2016లో ఖమ్మం జిల్లాలో ఉత్తమ రైతు పురస్కారంతోనూ సత్కరించింది. వ్యవసాయం, డెయిరీ, పౌల్ట్రీ మాదిరిగా గొర్రెల, మేకల పెంపకాన్ని కూడా అత్యంత లాభసాటి విధానాల్లో ఒక కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లాలన్నదే తన లక్ష్యం అంటున్నాడు పూర్ణచంద్రారెడ్డి. కొత్తగా గొర్రెలు, మేకల ఫాం పెట్టాలనుకునే వారికి సలహాలు సూచనలు ఇస్తున్నాడు. సాధారణ రైతుల నుంచి వ్యవసాయంపై ఆసక్తి ఉన్న ఎంతో మంది విద్యావంతులు, ఉన్నతాధికారులు సైతం శిక్షణ శిబిరాలకు వస్తున్నారు. స్టాల్ ఫీండింగ్ నుంచి రైతులకు ఉచిత శిక్షణ శిబిరాల ఏర్పాటు వరకు పూర్ణచంద్రారెడ్డి రైతుబడికి చెప్పిన అనుభవాలు ఆయన మాటల్లోనే..

sheeps4

గొర్రెల, మేకల పెంపకంపై ఆసక్తి:

నా పేరు పూర్ణచంద్రారెడ్డి. నేను ఇంటర్మీడియెట్ చదివాను. తొలుత ఆటోమొబైల్ బిజినెస్ పెట్టాను. కానీ నాకు వ్యవసాయం అంటే ఆసక్తి. అందరిలా వ్యవసాయం కాకుండా వినూత్నంగా చేయాలని ఆలోచించా. వ్యవసాయానికి అనుబంధంగా ఉండే గొర్రెలు, మేకల పెంపకాన్ని ఎంచుకున్నా. తొలుత 2007లో ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం, భీమవరం గ్రామంలో ఫాం పెట్టాను. అందరు అనుసరించే పద్ధతుల్లోనే గొర్రెలు, మేకల పెంపకం చేపట్టడంతో మొదటి రెండేండ్లు బాగా నష్టం వచ్చింది. తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది. అంతే ఇతర రాష్ర్టాల్లో గొర్రెలు, మేకల పెంపకం ఎలా ఉందన్నదానిపై దృష్టి పెట్టిన. మహారాష్ట్ర, కర్ణాటక వెళ్లి అక్కడి ఫాంలను చూసి, అక్కడి వాళ్లతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకున్నాం. నాకు అప్పుడే తెలిసింది స్టాల్ ఫీడింగ్ విధానం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా గొర్రెలు, మేకల పెంపకం ఈ విధానంలో సులువుగా చేసుకోవచ్చు. గొర్రెల ఎదుగుదల బాగుంటుంది. రోగాలు తక్కువగా వస్తాయి. అందుకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా నేనే స్టాల్‌ఫీడింగ్ విధానంలో గొర్రెల పెంచడం ప్రారంభించా.

స్టాల్ ఫీడింగ్ విధానం అంటే..?

సాధారణంగా గొర్రెలు, మేకలను బయటికి తీసుకెళ్లి గట్లవెంట, పొలాల వెంట మేతకు తీసుకెళ్లి, సాయంత్రానికి దొడ్లో తోలుతాం. కానీ స్టాల్ ఫీడింగ్ విధానంలో జీవాలు బయటికి వెళ్లే పని ఉండదు. ఫాంలోనే వాటికి కావాల్సిన బలవర్థకమైన ఆహారాన్ని అందిస్తాం. ఒక్కమాటలో చెప్పాలంటే కోళ్లకు దాణా వేసినట్టే, మేకలకు, గొర్రెలకు దాణా పెట్టడం. అయితే ఈ విధానానికి జీవాలు అలవాటు పడేందుకు బయటతిరిగిన జీవాలకు కనీసం రెండు నెలల టైం పడుతుంది. మెల్లమెల్లగా వాటికి దాణా ఇస్తూ అలవాటు చేసుకోవాలి. ఒక్కసారి దారిలోకి వస్తే మంచి ఎదుగుదల ఉంటుంది. ముందుగా మందులు, టీకాల షెడ్యూల్ పూర్తి చేసుకోవాలి. తర్వాత నుంచి డ్రైఫాడర్‌ను ఒక్కో జీవానికి ఇస్తూ పెంచుతాం.

sheeps2

డ్రై ఫాడర్ అంటే..దాన్ని ఎలా తయారు చేస్తారు...?

స్టాల్ ఫీడింగ్ కోసం కోఫై గడ్డి, హెడ్జ్‌లోసన్, శైలేజ్, టీఎంఆర్(టోటల్ మిక్స్‌డ్ రేషియో)ను ఆహారంగా ఇస్తాం. మొత్తాన్ని కలిపి డ్రై ఫాడర్‌గా పిలువచ్చు. వ్యవసాయ వ్యర్థాల నుంచి దీన్ని తయారు చేసుకుంటాం. మక్కజొన్న, జొన్న, వేరుశెనగ, మంచిశెనగ కట్టెను ఎండాకాలంలోనే అన్ని జిల్లాల నుంచి సేకరించుకుంటాం. దాన్ని విడివిడిగా గడ్డివాములా పేర్చుకుని పెట్టుకుంటాం. మన ఫాంలో ఉన్న జీవాల సంఖ్యకు తగ్గట్టుగా అన్ని వ్యర్థాలను తీసుకుని వాటిని ఫల్వలైజర్ మిషన్‌లో వేసి పొడి చేసుకుంటాం. తర్వాత దానికి తగిన మోతాదులో మొక్కజొన్న పిండి, తౌడు, సోయాచెక్క, ఉప్పు, మిక్స్‌డ్ మినరల్స్ కలిపి మిక్సింగ్ మిషన్‌లో వేస్తే మనకు మేతపొడి(డ్రై ఫాడర్) తయారవుతుంది. దాన్ని ఒక గదిలో పెట్టుకుని కావాల్సినంత తీసుకుని వాడుకోవచ్చు. డ్రై ఫాడర్ ఎంత వేయాలన్నదానికి లెక్కలు ఉన్నాయి ఎన్‌ఆర్‌సీ మీట్ లెక్క ప్రకారం గొర్రె, లేదా మేక బరువులో నాలుగు శాతం దానికి ఒకరోజు ఆహారంగా ఇవ్వాలి. ఉదాహరణకి ఒక గొర్రె బరువు 400 కిలోలు ఉంటే కేజీ 600 గ్రాములు దానికి రోజుమొత్తం కలిపి మేత పెడతాం. ఒకసారి జోకి పెట్టుకున్న మేతను రోజులో మూడు విడతలుగా ఇస్తే సరిపోతుంది. ఈ విధానంలో ఒక కేజీ మేత తయారు చేసుకోవడానికి రూ.10 ఖర్చవుతుంది. ఫల్వలైజర్ మిషన్, మిక్సింగ్ మిషన్లకు రూ.2 లక్షల వరకు ఖర్చవుతుంది.

డ్రైఫాడర్ ఇచ్చే విధానం.. లాభసాటిగా ఉంటుంది..

రానున్న కాలంలో పచ్చిమేత దొరుకడం అంటే ఎంతో కష్టంతో కూడుకున్న పని అవుతుంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతులకు మేలు చేసేలా వ్యవసాయరంగంలో ఎంతో అభివృద్ధి చూస్తు న్నాం. ప్రభుత్వం తీసుకువచ్చిన మిషన్ కాకతీయతో పూడుకపోయిన ఎన్నో చెరువులు మళ్లీ నీళ్లతో కళకళగా కనిపిస్తున్నాయి. ప్రాజెక్టుల నిర్మాణం భారీఎత్తున చేస్తున్నారు. ఒకప్పుడు బీడుగా ఉన్న భూములన్నీ పచ్చనిపైర్లతో కళకళగా కనిపిస్తున్నాయి. ఇది ఎంతో సంతోషించే విషయం. ఇట్లా ఎన్నో మార్పులతోటి గొర్రెలు, మేకలకు పచ్చిమేత సమకూర్చాలంటే ఎంతో కష్టమే. జీవాల పెంపకంలో ఉన్నవాళ్లకు భవిష్యత్తులో ఇది పెద్ద సమస్య అవుతుంది. అందుకే నేను డ్రైఫాడర్‌పైన దృష్టి పెడుతున్నా. ఇది ఎంతో మేలైన పద్ధతి. గొర్రె, మేకలు తొందరగా పెరుగుతాయి. సాధారణంగా పచ్చిగడ్డి తినే మేక లేదా గొర్రె ఒక నెలలో 2 కిలోలు బరువు పెరిగితే, డ్రై ఫాడర్‌తో ఒక నెలలో 4 నుంచి 5 కిలోల బరువు పెరుగుతాయి. బయటి వాతావరణంలో తిరగవు కనుక ఫాంలో ఒకే రకమైన పరిస్థితుల్లో ఉండటంతో జబ్బులు తక్కువగా వస్తాయి. ఎక్కువ స్థలం లేనివాళ్లు, పొలంలేని వాళ్లు సైతం గొర్రెల, మేకల ఫాంలు పెట్టుకోవచ్చు. అన్నింటికంటే ప్రధానంగా లేబర్ ఖర్చు తగ్గుతుంది. గతంలో వెయ్యి జీవాలు ఉన్న ఫాంను చూసుకోవాలంటే పది మంది వరకు అవసరం. కానీ ఇప్పుడు నలుగురితో మొత్తం చూసుకోవచ్చు.

ప్రతి నెల తొలి ఆదివారం ఉచిత శిక్షణ:

కొన్నేండ్లుగా మాకున్న అనుభవాన్ని ఈ రంగంలోకి వచ్చే కొత్తవాళ్లకు అందించేందుకు ప్రతి నెలా తొలి ఆదివారం ఉచిత శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నా. తొలుత ఖమ్మంలో ఉన్న ఫాంలో ఈ శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసేవాణ్ణి. ఇప్పుడు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుండటంతో హైదరాబాద్ దగ్గర్లో ఫాం ఉంటే ఎక్కువ మందికి మన విధానంలో శిక్షణ ఇవ్వొచ్చన్న ఆలోచనతోటి ఆరు నెలల కింద 400 మేకలు, 200 గొర్రెలు కలిపి మొత్తం 600 జీవాలతో తోలుకట్ట గ్రామం, మొయినాబాద్ మండలం రంగారెడ్డి జిల్లాలో ఫాం మొదలుపెట్టాను. దీనిలో ఒక ప్రత్యేక శిక్షణ శిబిరం ఏర్పాటు చేయిం చా. ఉచిత శిక్షణ శిబిరంలో నా అనుభవాలతోపాటు ఎన్‌ఆర్‌సీమీట్ శాస్త్రవేత్తలు, పశుసంవర్థకశాఖ అధికారులు, వైద్యులు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. దీనివల్ల రైతులకు అవగాహన పెరుగతుంది.

ఉచిత శిక్షణ శిబిరాలకు పశుసంవర్థకశాఖ నల్లగొండ జిల్లా జేడీ రమేశ్, ఎన్‌ఆర్‌సీ మీట్ శాస్త్రవేత్త బస్వారెడ్డి సార్ అంతా తమవంతుగా సహకారం అందిస్తున్నారు. శిక్షణకు వచ్చే వాళ్లకు భోజనం, టిఫిన్ సదుపాయం కోసం మాత్రం రూ.500 చెల్లించాలి. శిక్షణ ఉచితంగా ఇస్తాం. ఫాం ఎట్లా పెట్టుకోవాలి. ఎంత జాగాలో ఎన్ని జీవా లు పెట్టుకోవాలి. ఉన్న వసతులు ఎట్లా వినియోగించుకోవాలి, డ్రైఫాడర్ ఎట్లా తయారు చేసుకోవాలి. మార్కెట్ సదుపాయాలు ఎక్కడ ఎక్కువ ఉన్నాయి..ఇట్లా అన్ని విషయాలపైనా వాళ్లకు అవకాహన కల్పిస్తున్నాం. శిక్షణకు హాజరుకావాలనుకే వాళ్లు నన్ను 9949332343 నంబర్‌లో సంప్రదింవచ్చు. ఒక నెలలో ఫోన్ చేసి సంప్రదించిన వారందరికీ కలిపి దాని తర్వాత వచ్చే నెలలో మొదటి ఆదివారం ఉచిత శిక్షణకు పిలుస్తున్నాం. ప్రతి బ్యాచ్‌లో 300 మంది వరకు శిక్షణ ఇస్తున్నాం. ఇప్పటికే దాదాపు నాలుగు వేల మంది రైతులు మా దగ్గర శిక్షణ తీసుకున్నారు. వీరిలో పదిశాతం మంది ఫాంలు పెట్టుకున్నారు.
-నాగోజు సత్యనారాయణ,9182777254

సాటి రైతుకు అండగా ఉండాలన్నదే నా ఆలోచన

గొర్రెలు, మేకల పెంపకం అనేది ప్రత్యక్షంగా, పరోక్షంగా వందల మందికి ఉపాధి కల్పించేది. అందుకే నేను తెలుసుకున్న విషయాలను నలుగురు రైతులతో పంచుకుంటే వాళ్లకు కొంత మేలు జరుగుతుందన్నదే నా ఆలోచన. ఒకరికి ఒకరు అండగా ఉంటే ఇంకా బాగా ముందుకు పోవచ్చు. అందుకే ఈ రంగంలో ఇప్పటికే ఉన్నవాళ్లందరి ఒక్కతాటిపైకి తెచ్చి యునైటెడ్ షీప్ అండ్ గోట్ ఫార్మర్స్ అసోసియేషన్ స్థాపించాను. నేను అధ్యక్షుడిగా ఉన్నా. తెలంగాణ, ఏపీ నుంచి కలిపి మొత్తం 400 మంది వరకు రైతులు సభ్యులుగా ఉన్నారు. మేకలు, గొర్రెల పెంపకంలోని రైతుల ఇబ్బందులకు పరిష్కారం కనుగొనేలా సంఘం తరఫున చర్చిస్తుంటాం.

sheeps3

ప్రభుత్వం ప్రోత్సహిస్తే

రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం తీసుకువస్తున్న పథకాలతో మా రైతులంతా ఎంతో సంతోషంగా ఉన్నాం. సీఎం కేసీఆర్ సార్, దూరదృష్టితో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేయిస్తున్నారు. భవిష్యత్తులో మన రాష్ట్రం మరింత పచ్చని మాగాణం అయితది అందులో మాకెవరీకీ సందేహం లేదు. గొర్రెల పెంపకంలో కమ్యునిటీ వాళ్లకు ఎంతో గొప్పగా సహకారం అందిస్తున్నారు. మాలాంటి గొర్రెలు, మేకలు పెంచుకునే రైతులకు కూడా ప్రభుత్వం నుంచి కొంత సహకారం అందితే ఎంతో మేలు అవుతుంది. ఎంతో మంది నిరుద్యోగ యువతకు ఇది మంచి ఉపాధి మార్గంగా మారుతుంది. భవిష్యత్తులో మన రాష్ట్రం ఇతర రాష్ర్టాలకు మాంసం ఎగుమతి చేయాలన్న ప్రభుత్వం లక్ష్యానికి మేం తోడ్పడినవాళ్లం అవుతాం. గొర్రెల మేతకు, మౌలిక వసతులను ఏర్పాటు సహకారం, గొర్రెలు, మేకల పెంపకానికి వ్యవసాయ హోదా వచ్చేలా మన గవర్నమెంట్ చూడాలని మా రైతుల తరఫున కోరుకుంటున్నాం.
-పూర్ణచంద్రారెడ్డి, సెల్ నంబర్: 9949332343

543
Tags

More News