నికర ఆదాయం పట్టు పురుగుల పెంపకం

Wed,May 23, 2018 10:30 PM

Silk-worms
వ్యవసాయ అనుబంధ పంట మల్బరీ సాగు పట్టుపురుగుల పెంపకం. ఇది ఈరోజుల్లో లాభసాటిగా మారింది. ఇతర పంటలైన పత్తి, పసుపు, మిరప, మక్కజొన్న మొదలగు పంటలతో పొలిస్తే మల్బరీ సాగు చాలా లాభసాటిగా ఉన్నది. దీంతో రైతులు మొగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా పత్తి, పసుపు, మిర ప, పంటలకు చాలా పెట్టుబడి అవుతున్నది. అంతేగాక పురుగు మందులు, రసాయన ఎరువులు అధికంగా వాడవాల్సి వస్తున్నది. పెటుబడి పెట్టలేని రైతులు యాజమాన్య పద్ధతులు పాటించకపోతే పంట పూర్తిగా పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అయితే పట్టుపురుగుల పెంపకం చేపట్టే రైతులు ఒక ఎకరం మల్బరీ తోట నాటితే 5వేల మొక్కలు సరిపోతాయి. ఇందుకు రూ.10వేలు మాత్రమే ఖర్చు అవుతుంది. ఈ తోట సుమారు 15-20 ఏండ్లు ఉంటుంది. నాటిన మూడు నెలలకు పంట వస్తుంది. సంవత్సరంలో ఎకరానికి 10టన్నులు పశువుల ఎరువు వేస్తే సరిపోతుంది. పురుగు మందులు రసాయన ఎరువులు వాడాల్సిన అవసరం ఉండదు. ఒక పంట చేతికి వచ్చిన తరువాత 45 రోజులకు మళ్లీ మల్బరీ తోట పంటకు వస్తుం ది. ఇంతగా రైతుకు ఆదాయం చేకూర్చే మల్బరీ సాగు పై దృష్టి పెట్టాలి. చిన్న,సన్నకారు రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోవడమే కాకుండా మంచి ఆదాయాన్ని పొందటానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి.

పట్టుపురుగు జీవిత చరిత్ర

గుడ్డుదశ: పట్టు చిలక సుమారుగా 450-500వరకు గుడ్డు పెట్టే అవకాశం ఉంటుంది. 10-11రోజులకు గుడ్లు పగిలి పిల్లపురుగులు బయటకు వస్తాయి.
లార్వా దశ: 1,2 దశలు (లార్వాలను) పట్టుపురుగులను చాకి దశ పట్టుపురుగులు అంటారు. వీటిని చాకి కేంద్రాలలో పెంచుతారు. ప్రైవేటు, ప్రభుత్వ చాకి కేంద్రాలు ఉంటారు. ఈ దశ పట్టుపురుగులు చాలా సున్నితంగాను ఉంటాయి. కాబట్టి వీటికి రోగాలు రాకుండా తగిన జాగ్రత్తలు చాకి కేంద్రాలలో తీసుకుంటారు. చాకి కేంద్రాల్లో ప్రత్యేకమైన మల్బరీ వంగడా లు అయిన జీ2, వీ1 వంగడాలను నాటి పశువుల ఎరువులు అధికంగా వాడి ఆకు నాణ్యతతో పెంచి పట్టుపురుగులకు మోతగా వేస్తారు. కాబట్టి ఈ దశల పురుగులు రోగనిరోధకత పెంచుకుని మంచి నాణ్యతమైన పట్టుగూళ్లు అల్లుకోవడానికి, రోగాలు రాకుండా ఉంటాయి. చాకి కేంద్రాలలో గదిలో ఉష్ణోగ్రత, తేమ శాతం నియంత్రించడానికి డిజిటల్ హైగ్రోమిటరు సహాయంతో హ్యుమిడి పైర్ అనే సాధనంతో గాలిలో తేమ శాతం 80 ఉండేటట్లు జాగ్రత్త పడాలి. చలికాలంలో గదిలో వేడిని 20డిగ్రీలు సెంటిగ్రేడ్ ఉండేటట్లుగా రూమ్‌హిటర్స్ వాడాలి. చాకి కేంద్రాలు పరిశుభ్రంగా ఉండటానికి బ్లీచింగ్ అస్ర్తా మందుల ద్రావణంతో శుభ్రపరుస్తారు. మంచి పట్టు గూళ్లు అధిక దిగుబడి వచ్చేటట్లు చాకి కేంద్రాలు పట్టు రైతులకు ఎంతో ఉపయోగంగా ఉంటాయి.

చాకి కేంద్రం నిర్వహకులు పట్టు పురుగులు రెండవ దశలో జ్వరం ఉన్నప్పుడు ఉదయం, సాయత్రం వేళలో రైతులకు సరఫరా చేస్తా రు. ప్రౌఢదశ: 3,4,5 దశల పట్టుపురుగులను ప్రౌఢ దశ పట్టుపురుగులు అంటారు. ఈ దశలో పట్టుపురుగులు మల్బరీ కొమ్మలను మెతగా వేస్తారు. అంటే మల్బరీ తోట నుంచి కొమ్మతో సహ కట్‌చేసి పట్టుపరుగుల పెంచే గదుల్లో కొమ్మలను పట్టుపురుగులపై వేస్తారు. ఇలా రోజుకు రెండుసార్లు మేత వేసినైట్లెయితే 15-16రోజుల్లో పట్టుపురుగులు పక్వానికి వచ్చి పట్టు గుళ్లూ అల్లుతాయి. ఇందుకు గాను వీటిపై నేత్రికలు (ప్లాస్టిక్) పెట్టినైట్లెయితే వాటిలో పట్టుగూళ్లు అల్లుకుంటాయి. ఈ సమయంలో వీటిని కదిలించకూడదు. తర్వాత మళ్లీ మూడునాలుగు రోజులకు నేత్రికల నుంచి పట్టుగూళ్లు తీయాలి. పట్టుగూళ్లు తీయకుంటే జల్లుగూళ్లు, మూత్రముగూళ్లు, డబుల్‌గూళ్లు, ఎలుకలు, కొరికిన గూళ్లు వేరుగా తీయాలి. కట్టుగూళ్లకు మార్కెట్‌కు వెళ్లినప్పుడు గూళ్లకు గాలి తగిలే విధం గా ఉల్లిగడ్డ సంచుల్లో పోసి నలిగిపోకుండా తీసుకువేళ్లాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటించినైట్లెయితే మంచి ధర వస్తుంది.

ఏడాది పొడవునా ఉపాధి

ఈ పంట సాగు ద్వారా మహబూబాబాద్ జిల్లాలో చాలా రైతుల కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నాయి. అలాంటి రైతుల్లో కరివేదుల రవీందర్ రెడ్డి కేసముద్రం మండలం నారాయణ పురానికి చెందిన రైతు. 2015-16 సంవత్సరాలలోని తనకున్న 2ఎకరాల పట్టా భూమిలో పట్టుపురుగుల పెంపకం కోసం వీ1 వంగడం మల్బరీ మొక్కలను నాటారు. ఇందుకు పట్టు పరిశ్రమ శాఖ నుండి రూ.7వేల మల్బరీ మొక్కలకు పట్టుపురుగుల పెంపకం, గది నిర్మాణం కోసం రూ.86వేలు రాయితీ, పట్టుపురుగులను పెంచుటకు స్టాండు నిర్మాణం కోసం రూ.10,200 రాయితీగా పట్టుపరిశ్రమ శాఖ నుంచి అందజేశారు. అలాగే (300నేత్రికలు) పట్టుపురుగులు గూళ్లు అల్లుకోవడానికి ఉపయోగపడ్డాయి. 10ప్లాస్టిక్ ట్రేలు కూడా రాయితీపై అందజేసినట్లు వివరించారు. అంతేగాక 50శాతం రాయితీపై ఈ యూనిట్‌కు రూ.2,500 విలువగల రోగనిరోధకలు అనగా విజేత, సున్నం అస్ర్తా, బ్లీచింగ్ పౌడర్ అందజేసినట్లు చెప్పారు. 2017-18 సంవత్సరంలో 8పంటలు తీసి 2,175 పట్టుగూళ్లను పెంచి 1,095 కిలోల పట్టుగూళ్లను ఉత్పత్తిని చేసినట్లు తెలిపారు. ఇందుకు 8పంటలకు గాను రూ.4,89,157 రాగా ప్రభుత్వ ప్రోత్సహం కిలో రూ.75 చొప్పున రూ.82,125లు, కలిపి మొత్తం రూ.5,71,282లు ఆదాయం వచ్చింది. ఇందుకు ఖర్చులు రూ.85వేలు అయ్యాయి. ఖర్చులు పోగా రూ.4,86,282 నికరా ఆదాయం పొందినట్లు ఆయన తెలిపారు.
-గుండెల రాజు
మహబూబాబాద్ వ్యవసాయం
72889 85757

సాగు వ్యయం కూడా తక్కువే..

సాధారణ పంటల సాగు ద్వారా నష్టాలు ఎదుర్కొనే వారికి పట్టు పరిశ్రమ మంచి ప్రత్యామ్నాయం. మల్బరీ మొక్కలు నాటిన నుంచి నాలుగు నెలలో కోతకు వస్తుంది. మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే నాలుగింతలకు పైగా లాభాలు ఉంటాయి. ప్రభుత్వం రైతులకు పలు ప్రోత్సాహాకాలు కూడా అందజేస్తుంది.
- కె. సూర్యనారాయణ, జిల్లా ఉద్యాన శాఖ అధికారి, మహబూబాబాద్
సెల్: 83744 49066 టోల్ ఫ్రీ నెంబరు: 18004250519

589
Tags

More News