మార్కెట్ డిమాండ్ నాణ్యతే ప్రామాణికం

Thu,May 17, 2018 12:01 AM

RAITHUBADI
చేపల పెంపకాన్ని చేపట్టే రైతులు సరైన సమయంలో చేపలను పట్టి మార్కెట్‌లో అమ్ముకుంటేనే మంచి లాభాలు వస్తాయి. అయితే వాటిని పట్టేటప్పుడు, పట్టి న తర్వాత రవాణా చేసేందుకు అనువైన పద్ధతులను అవలంబించాలి. అప్పుడే చేపలు ఏమాత్రం చెడిపోకుండా మార్కెట్‌లో మంచి ధర పలుకుతాయి. చేపల పట్టడం, రవాణా సమయంలో రైతులు అనుసరించాల్సిన పద్ధతులను గురించి గడ్డిపల్లి కేవీకే శాస్త్రవేత్త బూర్గు లవకుమార్ వివరించారు. ఆ వివరాలు... చేపలు అమ్మదగిన సైజుకు పెరిగిన తర్వాత రైతు తన చెరువులో ఉన్న చేపలకు మార్కెట్ ధరను గమనిస్తూ పెరిగే అవకాశాలు ఉన్నట్లయితే అమ్మకాన్ని తాత్కాలికంగా పొడిగించాలి. పట్టే సమయంలో తూకం చెరువు ల వద్దనే జరిపి చేపల వెలను వెంటనే చెల్లించే వ్యాపారులను ఎంచుకోవాలి. పట్టే వారం ముందుగా చెరువు అడుగు భాగం నీటిని తోడి వేసి మంచినీటితో నింపా లి. తద్వారా చేపలలో మట్టి వాసన పోయి పట్టుబడి సమయానికి నాణ్యంగా తయారవుతాయి. అంతేగాకుండా పట్టే ముందురోజే మేతను నిలిపివేయాలి. దీనివల్ల చేపలు ఆరోగ్యం బాగుంటుంది. చెరువు సైజు, చేపల సంఖ్యను బట్టీ చేపలు పట్టే వారిని కుదుర్చుకుని ఏర్పాట్లు చేసుకోవాలి. చేపల బరువును అంచనా వేసి వాటి బరువుకి రెట్టింపు మోతాదులో ఐస్‌ను నిర్ణీత సమయానికి చెరువు వద్దకు అందేలా ఏర్పాటు చేసుకోవాలి.

తీసుకోవాల్సిన చర్యలు:

చేపలు పట్టే సమయంలో వాతావరణం చల్లగా ఉంటే చేపల నాణ్యత బాగుంటుంది. కాబట్టి ఉదయం 9 గంటల్లోపు చేపలు పట్టాలి. చేపలు పట్టే ముందుగానీ, పట్టేటప్పుడు గానీ ఎటువంటి రసాయనాలను క్రిమిసంహారక మందులను వాడకూడదు. చెరువు సైజును బట్టి తెల్లవారే సమయానికి చెరువు నీటి మట్టం మూడు వంతులు తగ్గేలా ఎంత సమయం పడుతుం దో అంచనా వేయాలి. తదనుగుణంగా తూముకు వల ను కట్టి నీటిని చెరువు బయటకు తోడివేయాలి. చెరువు నీటి మట్టం మూడోంతులు తగ్గిన తర్వాత లాగుడు వల సహాయంతో చెరువు లోతు భాగం నుంచి వెలుపలి భాగం వైపునకు లాగుతూ చేపలను పట్టాలి. పట్టే సమయంలో చేపలు ఎక్కువ ఒత్తిడికి గురై నలుగకుం డా జాగ్రత్తలు తీసుకోవాలి. పట్టిన వెంటనే చేపలను శుభ్రమైన చట్టని నీటితో కడిగి ఎదురుబుట్టలో గానీ, ప్లాస్టిక్ పెట్టెలో గానీ వేసి చేపలు నలుగకుండా త్వరగా తూకం వేసే ప్రదేశానికి తీసుకువెళ్ళాలి. లాగుడు వలను రెండు మూడు సార్లు లాగినప్పుడు చెరువు నీరు బురదగా మారి చివరగా పట్టుబడి చేసే చేపలలో బురద చేరి నాణ్యత తగ్గే అవకాశం ఉన్నది. కాబట్టి చివరగా పట్టే చేపలను రెండుమూడుసార్లు మంచినీటితో కడుగాలి.
FISH

పట్టిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

తూకం, ప్యాకింగ్ చేసే ప్రదేశం చేపల చెరువుకు వీలైనంత దగ్గరగా ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. తూకం వేసే ప్రదేశంలో నీడ ఉండేలా జాగ్రత్త పడితే చేపల నాణ్యత దెబ్బతినకుండా ఉంటుంది. పట్టిన చేపలను తూకానికి ప్యాకింగ్‌కు ముందు నేలపై పోయాల్సి వస్తే ప్లాస్టిక్ పట్టాను ముందుగా నేలపై పర్చి దానిపై చేపలను పోయడం వల్ల బురద, మట్టి అంటకుండా ఉండి చేపలు తాజాగా ఉంటాయి. తూకం, ప్యాకింగ్ రవాణా ప్రదేశం ఒకేచోట ఉండటం ద్వారా చేపలు బయట ఉష్ణోగ్రతలో ఎక్కువ సమయం ఉండవు. కాబట్టి నాణ్యత దెబ్బతినే అవకాశం ఉండదు. చేపలను తూకం వేసిన వెంటనే సన్న ముక్కలుగా తరిగిన ఐస్‌తో కలిపి ప్లాస్టిక్ పెట్టెలో ప్యాకింగ్ చేయాలి. మొద ట ప్లాస్టిక్ పెట్టె అడుగు భాగంలో ఐస్‌ను పరిచిన తర్వాతనే ఒక వరుస చేపలను పరిచి మరలా ఒక పొర ఐస్‌తో చేపలను కప్పాలి ఈ విధంగా ఐస్, చేపలను వరుసలుగా పరుస్తూ చివరగా ఐస్‌తో కప్పడం ద్వారా ప్యాకింగ్ చేసిన చేపలన్నింటికి ఐస్ చల్లధనం పూర్తి స్థాయిలో తగిలి రవాణా సమయంలో చేపల తాజాధనం తగ్గకుండా ఉంటుంది. చేపలు, ఐస్ నిష్పత్తి 1ః1గా ఉంటే మంచిది.

రవాణా సమయంలో ఐస్ క్రమేణా కరుగుతూ నీరు అవుతుంది. కాబట్టి కరిగిన ఐస్ నీరు బయటకు పోయే లా అడుగు భాగంలో రంధ్రాలున్న పెట్టెలను ఎంపిక చేసుకోవాలి. ఈ విధానంలో ప్యాకింగ్ చేసిన చేపలను రెండు రోజుల వరకు పాడవకుండా రవాణా చేయవచ్చు. మరీ దూర ప్రాంతాలకు చేపలను రవాణా చేయవలసి వచ్చినప్పుడు దూరాన్ని బట్టి రెండుమూడు సార్లు తాజా ఐస్‌తో మళ్లీ ప్యాక్ చేసి శీతలీకరణ వ్యాన్‌లో రవాణా చేయడం ద్వారా ఒక వారం రోజుల పాటు చేపలు పాడవకుండా చూడవచ్చు. పైన తెలిపిన విధంగా చేపలను పట్టి చేసి రవాణా చేయ డం ద్వారా చెరువుల్లో పెంచే కార్పు చేపల్లో నాణ్యత పెరిగి మార్కెట్‌లో మంచి గిట్టుబాటు ధర లభిస్తుంది.
-నట్టె కోటేశ్వర్‌రావు, గరిడేపల్లి , సూర్యాపేట జిల్లా ; 9989944945

సరైన పద్ధతులు పాటించాలి

మార్కెట్‌లో ధరను బట్టి చేపలు పట్టాలి. మంచి ధర ఉన్నప్పుడు అమ్ముకుంటే లాభాలు ఎక్కువగా వస్తాయి. ఒక వేళ మార్కెట్‌లో రేటు పెరిగేలా ఉంటే రైతులు చేపలు పట్టడాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలి. మార్కెట్‌లో రేటు అనుకూలంగా ఉన్నప్పుడు చెరువులో నీటిని మూడొంతులు బయటకు తీసి వలల సహాయంతో చేపలు పట్టించిన తర్వాత మంచినీటితో వాటిని కడిగి తూకాలు వేయించాలి. చేపలను ఇతర ప్రదేశాలకు రవాణా చేయాల్సినప్పుడు సక్రమమైన పద్ధతులలో ప్యాకింగ్ చేస్తేనే చేపల నాణ్యత బాగుటుంది.
- బూర్గు లవకుమార్, కేవీకే శాస్త్రవేత్త, గడ్డిపల్లి
9849063796

415
Tags

More News