పెట్టుబడికి ఆసరా!

Thu,May 10, 2018 01:21 AM

రైతులకు పంటల సాగు లాభసాటిగా ఉండాలంటే పెట్టుబడి ఖర్చులు తగ్గాలి. లేదా తాను ఉత్పత్తి చేసిన దిగుబడులకు మేలైన ధరలు రావాలి. అయితే పంటలకు కావాల్సిన ఉత్పత్తి కారకాలు ఎరువులు, విత్తనాలు, పురుగు, తెగుళ్ల మందులపై ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దానికి అనుగుణంగా దిగుబడులు పెరుగడం లేదు. కేంద్రం కూడా పెరుగుతున్న ఇన్‌పుట్ ధరలను పరిగణనలోకి తీసుకుని కనీస మద్దతు ధరలు నిర్ణయించడం లేదు. కాబట్టి రైతులు సాగులో పెట్టిన పెట్టుబడి ఖర్చులైనా కనీసం తిరిగి రాబట్టుకోవడం లేదు. అందుకే ఈ రోజు సాగు సంక్షోభంలో ఉంది. రైతు సాగులో నిలదొక్కుకోవడం లేదు. చిన్న, సన్నకారు రైతుల సాగు కాబట్టి ఒక పంట నష్టపోయినా రైతు అప్పుల పాలు అవుతున్నాడు. ఈ విపత్కర పరిస్థి తుల నుంచి రైతును గట్టెక్కించడమే ప్రధాన ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలు ఉన్నాయి. వాటిలో వినూత్న పథకం రైతుబంధు.

చిన్న, సన్నకారు రైతులకు సంజీవని

రాష్ట్రంలో 85 శాతానికి పైగా సన్నకారు రైతులు ఉన్నారు. 97 శాతానికి పైగా కమతాలు 10 ఎకరాల కంటే తక్కువే. ఈ రైతులకు పెట్టుబడి సామర్థ్యం తక్కువ. పంట సాగు ద్వారా వస్తున్న ఆదాయం అంతంత మాత్రమే. కానీ ఒక్క పంట కోల్పోయినా అప్పుల పాలు అవుతున్నారు. ఆ తర్వాత పంట వేసుకోవడానికి చేతిలో చిల్లి గవ్వ ఉండదు. కాబట్టి చిన్న, సన్నకారు రైతులకు మళ్లీ సాగు కొనసాగించడానికి పెట్టుబడి సాయం ఎంతో ఆసరా అవుతుంది.

పెరుగనున్న పంట ఉత్పాదకత

పంటల దిగుబడులు పెరుగాలంటే సకాలంలో చేనులో విత్తనాలు పడాలి. వానాకాలంలో చాలా పంటలకు జూన్, యాసంగిలో పంటలకు అక్టోబర్‌లో విత్తులు పడాలి. ముఖ్యంగా వానాకాలంలో వర్షం రాకతో దుక్కులు దున్ని విత్తనాలు వేయడానికి సిద్ధమవుతారు. ఆ తర్వాత ఎక్కువ రోజులు విత్తనం వేయకపోతే దిగుబడులు తగ్గుతాయి. ఇప్పటి వరకు ఇదే జరుగుతుంది. రైతుకు పెట్టుబడి చేతిలో ఉండకపోవడం వల్ల అప్పుల కోసం తిరిగి వచ్చిన తర్వాత సాగుకు సిద్ధమవ్వాలి. ఆలోపు అదను పోతుంది. దాంతో పంటల దిగుబడి తగ్గుతుంది. ఉత్పాదకత పెరిగి రాష్ట్ర స్థూల ఆదాయం పెరుగనున్నది.

అన్ని పంటలకు మద్దతు

కేంద్రం కేవలం 23 పంటలకు మాత్రమే మద్దతు ధరలు ప్రకటిస్తున్నది. అందులో కూడా అన్ని రాష్ర్టాల ఉత్పత్తి ఖర్చులు సరాసరి చేసి దేశవ్యాప్తంగా ఒకే ధరను నిర్ణయిస్తున్నది. దీంతో చాలా రాష్ర్టాలకు సాగు నీటి లభ్యత ఉండటం, కూలీ ఖర్చలు కూడా తక్కువగా ఉండటంతో వారికి మద్దతు ధరలు లాభమే. కానీ తెలంగాణలో బావుల మీదనే ఆధారపడి సాగు చేస్తున్నారు. ఉత్పత్తి ఖర్చులు ఎక్కువ. దీంతో ఈ ఖర్చులను తగ్గించడంతో పాటు రైతుల ఆదాయాన్ని పెంచడానికి కల్పించే భరోసానే రైతుబంధు పథకం ద్వారా అందిస్తున్నది. అయితే ఇందులో కేంద్రం ఇస్తున్న 23 పంటలకే పరిమితం కాకుండా అన్ని పంటలకు మద్దతు ఇవ్వడం రైతులకు మరింత ఊరట కలించే అంశం.
pradasradi

589
Tags

More News