ప్రాణవాయువు తగ్గితే ప్రమాదమే!

Wed,May 2, 2018 11:40 PM

మోతాదుకు మించి మేత,
ఎరువులు వాడకూడదు
ప్రతి ఒకటిన్నర, రెండు మాసాలకు చెరువులో నీటిని మార్చాలి
ప్రస్తుతం ఎండల కారణంగా
ఆక్సిజన్ తగ్గే అవకాశాలు ఎక్కువ
ఆక్సిజన్ కొరత రాకుండా
తగు జాగ్రత్తలు పాటించాలి

చేపల పెంపకం చేపడుతున్న చెరువుల్లో ప్రస్తుతం ఎండల కారణంగా నీటి పరిమాణం తగ్గిపోతున్నది. దీంతో ఆ నీటిలో ప్రాణవాయువు బాగా తగ్గిపోయి చేపలు చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి చెరువుల్లో ప్రాణవాయువును పెంచి చేపలకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చూడాలని నిపుణులు సూచిస్తున్నారు. చేపలు పెంచే చెరువుల్లో ప్రాణవాయువు పాత్రే కీలకమైనదంటున్నారు. అది తగ్గకుండా చూసుకునేందుకు అవలంబించవలసిన విధానాలను గురించి గడ్డిపల్లి కేవీకే శాస్త్రవేత్త
బూర్గు లవకుమార్ తెలిపారు. ఆ వివరాలు.....

raithubadi
సాధారణంగా చేపల చెరువులో అధిక మోతాదులో వేసిన మేతలు, ఎరువుల వల్ల పాస్పరస్ చెరువు మట్టిలో బందింపబడి నత్రజని వాతావరణంలో కలిసిపోయి ప్రధానమైన పోషకపదార్థాలు వృథా అవుతాయి. దీంతోపాటు వృక్ష ప్లవకాలు (పైటో ప్లాంక్టాన్) ఉధృతంగా పెరిగి నీరు ముదు రు ఆకుపచ్చరంగులోకి మారి సూర్యరశ్మి నీటి అడుగు బాగానికి ప్రసారం కాదు. దీంతో ఆక్సిజన్ కొరత ఏర్పడి చెరువుల్లో ఉత్పాదక శక్తి తగ్గుతుంది.

ఆక్సిజన్ కొరతకు కారణాలు

-విస్తృతంగా వృక్ష ప్లవకాలు వృద్ధి చెందిన నీటిలో ఆక్సిజన్ స్థాయి విపరీతంగా మార్పు చెంది రాత్రి,ఉదయం సమయాల్లో బాగా తగ్గిపోతుంది.
-ఆకాశంలో రెండు మూడు రోజులు వరుసగా మబ్బు లు పట్టినప్పుడు సైతం చెరువు నీటిలో పగటి సమయాల్లో కూడా ఆక్సిజన్ లభ్యత తగ్గుతుంది.
-వేసవి కాలంలో వాతావరణం వేడి హెచ్చుగా ఉన్నప్పు డు చెరువులలో నీటి లోతు తక్కువగా ఉన్నప్పుడు నీటి ఉష్ణోగ్రత పెరిగిన కొద్ది నీటి ప్రాణవాయువు విలువ తగ్గుతుంది.

చెరువు నీటిలో నిరంతరం 5-7 పి.పి.ఎం ప్రాణవాయు వు లభించాలి. ప్రాణవాయువు లభ్యత 3 పి.పి.ఎం కంటే తగ్గినప్పుడు ప్రాణవాయువు లభించక శ్వాసక్రియ మందగించి చేపలు మరణిస్తాయి. చేపల చెరువులో సాధారణంగా పగటి సమయాల్లో ఎక్కువ ప్రాణవాయు వు రాత్రి సమయాల్లో తక్కువ ప్రాణవాయువు లభ్యత ఉంటుంది. చెరువు నీటిలో ప్రాణవాయువు విలువ తగ్గిన కొద్ది చేపలు నీటి ఉపరితలం భాగంలో ఎక్కువగా కన్పి స్తూ నోటిని తెరిచి ఉంచుతాయి. సాధారణంగా ఇటువం టి పరిస్థితి ప్రస్తుతం చెరువుల్లో ఎక్కువగా కన్పిస్తుంది. కాబట్టి ఇలాంటి సమయాల్లో తక్షణమే నివారణ చర్యలు చేపట్టడం వల్ల చేపల మరణాలను అరికట్టవచ్చు.

నివారణోపాయాలు

చెరువులో నిరంతరం ప్రాణవాయువు లభ్యమవడానికి స్ప్రింక్లర్, కంప్రెసర్, సాడిల్ వీల్ లాంటి యాంత్రిక ఏరేటర్‌లను ఏర్పాటు చేసుకోవాలి. తద్వారా చెరువు నీటిలో జరుగు ప్రాణవాయువు స్థాయి మార్పులను నివారించి ఎరువులను సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు. సాడిల్ వీల్ ఉపయోగించడం ద్వారా నీటిలో కరిగిన ప్రాణవాయువులు నాలుగు గంటల్లో లీటర్‌కు నాలుగు మిల్లి గ్రాముల స్థాయికి పెంచి చేపలకు హానీ జరుగకుండా కాపాడవచ్చు. నీటిలో కరిగిన ప్రాణవాయువు స్థాయి అనుకూలంగా ఉన్నప్పుడు చేపల శరీరంలోనే జీవక్రియ లు ఉధృతమై ఆహార సేకరణ వినియోగం హెచ్చుగా ఉంటుంది. దీంతో చేపల పెరుగుదల బాగుంటుంది.
ప్రస్తుతం ఎండల కారణంగా వాతావరణంలో వేడి హెచ్చుగా ఉండి చెరువుల్లో నీటి లోతు తక్కువగా ఉంటుం ది. కాబట్టి ఎరువుల నెలసరి మోతాదును తగ్గించడం గానీ లేక ఎరువుల వాడకాన్ని తాత్కాలికంగా నిలిపి వేయడం కానీ చేయాలి. చెరవులో ఇంకి పోయిన, పైకి ఆవిరై పోయి తగ్గే నీటి పరిమాణాన్ని ప్రతి రోజు గమనించి కొత్త నీటితో నింపుతూ ఉండాలి. అదేవిధంగా చెరువుల్లో ప్రతి ఒకటిన్నర రెండు మాసాలకొకసారి చెరువులోని పాత నీటిని బయటకు వదిలి కొత్త నీటితో నింపాలి. మురుగు కాల్వ లు లేదా పరిశ్రమల నుంచి వెలువడిన కలుషిత నీటిని చెరువులలోనికి పంపుచేయరాదు. చెరువులలో తగిన మోతాదులో మాత్రమే చేపల మేతలను, ఎరువులను వాడాలి.

ఎరువుల, మందుల వాడకం తర్వాత చెరువు నీటిలో బాగా కదలికలు కలుగజేయాలి. సూర్యరశ్మి ఎక్కువ ఉన్న మధ్యహ్న సమయంలో ఎరువుల, మందుల వాడుక మంచిది. చెరువు నీటి ఉపరితలంపై చెత్త మొదలైనవి పడినప్పుడు వెంటనే తొలిగించాలి. నీటిలో అధికంగా పెరిగే నీటి మొక్కలను ప్లవకాల తెట్టును నిర్మూలిస్తుండాలి. నీరు మార్చడానికి వీలు లేకపోతే ఎకరానికి సుమారు నలభై కిలోల సున్నాన్ని చెరువంతా జల్లాలి. ఆయిల్ ఇంజన్ లేదా మోటార్ పంపుసెట్ల సహాయంతో చెరువులోనే నీటి ని మరలా అదే చెరువులోకి తోడటం (రీ సర్క్యులేషన్ ఆప్ వాటర్) వాసాలతో నీటిని అలజడి చేయడం వంటివి చేయాలి. పైన తెలిపిన జాగ్రత్తలు పాటించడం ద్వారా తగనంత తరిగిన ప్రాణవాయువు లభించడంతో పాటు ఆరోగ్యవంతమైన అధిక చేపల దిగుబడులు పొందవచ్చు.
- నట్టె కోటేశ్వర్‌రావు, గరిడేపల్లి
9989944945

raithubadi1

పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి

చేపల చెరువుల్లో మేత, ఎరువులను అధికంగా ఉపయోగిస్తే పోషక పదార్థాలు ఎక్కువగా లభించి వృక్ష ప్లవకాలు ఎక్కువగా పెరిగి చేపలకు ఆక్సిజన్ సరిగా అందక కొరత ఏర్పడి మరణించే అవకాశం ఉంటుంది. కాబట్టి చేపలు పెంచే చెరువును బాగా పరిశీలిస్తూ పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవాలి. ప్రస్తుత పరిస్థితిలో చెరువులో నీటి పరిమాణం తగ్గుతుంది. కాబట్టి ఆక్సిజన్ కొరత లేకుండా జాగ్రతలు తీసుకోవాలి. చెరువులో ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసేందుకు స్రింక్లర్, కంప్రెసర్, సాడిల్ వీల్‌లను ఉపయోగించాలి. వీటికి తోడుగా చెరువులోఎరువుల వాడకంను తగ్గిచడం, నిలిపివేయడం వంటివి చేపట్టాలి. చేపల పెంపకంలో తగు జాగ్రత్తలు పాటిసేన్తే చేపల దిగుబడులు బాగా వస్తాయి. మంచి లాభాలను పొందవచ్చు.
- బూర్గ లవకుమార్, కేవీకే శాస్త్రవేత్త, గడ్డిపల్లి. 9849063796

385
Tags

More News