ఎండకాలంలో కూరగాయల సాగు పద్ధతులు

Wed,April 18, 2018 11:21 PM

ఎండకాలంలో అధిక ఉష్ణోగ్రత, వాతావరణంలో తక్కువ తేమ కూరగాయల సాగుకు ప్రతిబంధకమవుతుంది. ఇటువంటి సమయంలో రైతులు కూరగాయలను సాగుచేసి అధిక లాభాలు పొం దాలంటే అనువైన కూరగాయలను, వాటిలో వేడిని తట్టుకొని దిగుబడులను అధికంగా ఇచ్చే రకాలను ఎంచుకోవాలి. ఎండకాలం లో కూరగాయల సాగులో అవలంబించవలసిన ప్రత్యేక పద్ధతుల గురించి గడ్డిపల్లి కేవీకే శాస్త్రవేత్త ముదిరెడ్డి రంగారెడ్డి వివరణ..
(మరిన్ని వివరాల కోసం 9849860803)

vegetables-summer
వేసవిలో నారు నీడలో పెంచాలి. తప్పనిసరిగా రసం పీల్చే పురుగుల నివారణకు ఇమిడాక్లోప్రిడ్ (5 గ్రాములు/కిలో విత్తనానికి)తో విత్తనశుద్ధి చేయాలి. నారుమళ్ళపై నైలాన్ వలను ఏర్పాటు చేసుకుంటే రసం పీల్చే పురుగులు, వైరస్ తెగుళ్ళ బాధను తగ్గించుకోవ చ్చు. పొలంలో మొక్కలకు నీడనిచ్చే విధంగా ఆముదం, మక్కజొన్న వంటి పంటలను ఉత్తర, దక్షిణ దిశలలో నాటుకోవాలి. వీలైతే రైతులు 35 శాతం షేడ్‌నెట్‌లను ఏర్పాటు చేసుకుంటే ఎండ తీవ్రత తగ్గి మంచి దిగుబడులు పొందవచ్చు.
కొత్తగా నాటిన మామిడి, జామ, కొబ్బరిలాంటి తోటలలో ఎండకాలంలో మొదటి 3-4 ఏండ్లు అంతర పంటలుగా సొర, బీర, గుమ్మడి, దోస, ఫ్రెంచి చిక్కుడు, గోరుచిక్కు డు వంటి కూరగాయ పంటలను సాగుచేసి రైతులు అదనంగా ఆదాయం పొందవచ్చు.
నేలలోని తేమను సంరక్షించే చర్యలు చేపట్టాలి. వీలైనంత ఎక్కువ మోతాదులో సేం ద్రియ ఎరువులు, వాటితో పాటు జీవన ఎరువులు వాడితే మంచి ఫలితాలు పొందవచ్చు. సేంద్రియ ఎరువులు ఎక్కువ వాడటం వల్ల నేల గుల్లబారి తేమ ఎక్కువ రోజులు మొక్కకు అందుబాటులో ఉండేటట్లు చేస్తుంది.
అందుబాటులో ఉన్న కొద్దిపాటి నీటిని బిందు (డ్రిప్) లేదా తుంపర్ల ( స్ప్రింక్లర్) పద్ధతుల్లో ఇవ్వడం వల్ల కొద్దిపాటి నీటితో ఎక్కువ విస్తీర్ణంలో కూరగాయలను పడించవచ్చు.
ఒక ఎకరానికి సరిపడా నీటితో డ్రిప్ ద్వారా 2 1/2 ఎకరాల్లో, తుంపర్ల ద్వారా 1 1/2- 2 ఎకరాల్లో సాగు చేయవచ్చు. అంతేగాక నీరు సక్రమంగా ఇవ్వడం వల్ల, తుంపర్ల వల్ల ఎండ వేడిమి తగ్గి మంచి దిగుబడులు పొందవచ్చు. సాధారణ పద్ధతిలో నీరందించే పంటలలో ఎండ తీవ్రతను తగ్గించడానికి అప్పుడప్పుడు సాయంత్రం వేళలో నీటిని పిచికారీ చేయాలి. టమాటా, పుచ్చలలో నీటి యాజమాన్యం సరిగా లేకపోతే కాయ పగుళ్ళు కనబడుతాయి. కావున నీటి యాజమాన్యం సక్రమంగా ఉండేలా చూసుకోవాలి. ఆ తర్వాత కాయపగుళ్ళ నివారణకు బోరాక్స్ 3 గ్రాములను లీటర్ నీటిలో కలిపి వారంలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
తీగజాతి కూరగాయలలో అధిక ఉష్ణోగ్రతకు మగపూలు ఎక్కువగా వస్తాయి. దీని నివారణకు పూతదశలో సైకోసిల్ (సిసిసి) 2.5 గ్రాములు లేదా 0.5 గ్రాములు, మాలిక్ హైడ్రజైడ్ 10 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. లేదా గింజ విత్తిన 15 రోజులకు, 2-4 ఆకు దశలలో 3-4 గ్రాముల బోరాక్స్ లీటర్ నీటిలో, లేదా ఇథరిల్ 2.5 మి.లీలు 10 లీటర్‌ల నీటిలో కలిపి వారంలో రెండుసార్లు పిచికారీ చేస్తే తర్వాత దశలో ఆడపూల సంఖ్య పెరిగి అధిక దిగుబడులు వస్తాయి.
ఆకు కూరల పంటల్లో ఆకు దిగుబడి పెంచడానికి 2 శాతం యూరియా (20 గ్రాములు/ లీటర్ నీటికి) + 50 పి.పి.యం జిబ్బరిల్లిక్ యాసిడ్ (50 మి.గ్రా, బి.ఎ 3/లీ నీటికి) ద్రావణాన్ని పంటపై పిచికారీ చేయాలి. పిష్ ఎమినోయాసిడ్ 2 మి.లీ.లు లీటర్ నీటిలో కలిపి మొక్క ఎదుగుదల దశలో పిచికారీ చేయాలి. పొటాష్‌ను సరైన మోతాదులో వాడితే నీటి ఎద్దడిని, చీడపీడలను తట్టుకునే గుణం మొక్కల్లో పెరుగుతుంది. అందువల్ల ప్రతి కిలో యూరియాకు అరకిలో పొటాష్‌ను తప్పనిసరిగా వాడాలి.
యూరియా ఎండవేడికి త్వరగా ఆవిరికాకుండా మొక్కకు ఎక్కువరోజులు అందుబాటులో ఉండేలా 9 కిలోల యూరియాకు ఒక కిలో వేపపిండి కలిపివేయాలి. లేదా ప్రతి 25 కిలోల యూరియాకు కిలో వేప నూనె కలిపి అరగంట ఆరబెట్టి పంటలకు పిచికారీ చేయాలి. పూత, పిందె రాలకుండా, పిందె బాగా పట్టడానికి.. టమాటా, వంగ లాంటి పంటకు ఒక మి.లీ ఫ్లానోపిక్స్ (ఎన్‌ఎఎ) 4.5 లీటర్ల నీటిలో కలిపి పూతదశలో వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. మిరపకు పూతదశలో ట్రైకాంటినాల్ 2.0 మి.గ్రా లేదా 2.5 మి.లీ ప్లానోపిక్స్ 10 లీటర్ల నీటిలో కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేస్తే పిందె నిలిచి కాత బాగా ఉంటుంది. కాయగూరలను, ఆకుకూరలను, చల్లటి పూట కోసి, తడి గోనెసంచి కప్పి మార్కెట్‌కు తరలించాలి. ఇలా చేస్తే కూరగాయలు, ఆకు కూరలు తాజాగా ఉంటాయి.

- నట్టె కోటేశ్వర్‌రావు
గరిడేపల్లి, 9989944945

405
Tags

More News