మక్కలో జంటసాళ్ల పద్ధతి

Thu,April 12, 2018 01:40 AM

సంప్రదాయ పద్ధతికి భిన్నంగా సాగు చేస్తే అధిక దిగుబడులు సాధంచవచ్చు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మేడేపల్లి గ్రామంలో ఇది జరిగింది. వృత్తిరీత్యా పోతునూక భాస్కర్‌రావు వ్యవసాయ శాఖ అనుబంధ సంస్థ అయిన ఆత్మ (అగ్రికల్చర్ మేనేజ్‌మెంట్ ట్రైనింగ్ ఏజెన్సీ) లో బ్లాక్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్ (బీటీఎం) పనిచేస్తున్న ఆయన గతం లో ఎమ్మెస్సీ అగ్రికల్చర్, సీడ్ టెక్నాలజీ కోర్సు పూర్తి చేశారు. చదువు పూర్తైన అనంతరం భాస్కర్‌రావు తన స్వగృహంలో సొంత భూమిలో సాగు చేశారు. ఆంధ్రప్రదేశ్ సీడ్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో విత్తనోత్పత్తి చేపట్టి అధికారుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. భాస్కర్‌రావు స్ఫూర్తితో మేడేపల్లి గ్రామ రైతులు కూడా ఆధునిక సాగు చేపట్టి అధిక దిగుబడులను పొందుతున్నారు. దాదాపు 15 ఏండ్లుగా వివిధ పంటల ను ఆధునిక పద్దతిలో సాగు చేస్తూ తనకు తానే సాటిగా నిలుస్తూ తోటి రైతులకు ఆదర్శప్రాయంగా నిలిచారు.
BTM
సాగులో తీసుకొస్తున్న నూతన ఒరవడిని పరిశీలించిన సీడ్స్ కార్పొరేషన్ అధికారులు ఆ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా నియమించారు. అనంతరం కొద్దిరోజులకు ఆత్మ సంస్థలో బీటీఎంగా విధులు నిర్వహిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వ ఉద్యో గం చేస్తూనే మరోవైపు సాగును సైతం కొనసాగిస్తున్నారు. వరి, కూరగాయలు, పత్తి తదితర పంటలను ఆధునిక పద్ధతిలో సాగు చేసి అధిక దిగుబడులను సాధించిన భాస్కర్‌రావు మక్కజొన్న సాగులోనూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. వానకాలం సీజన్‌లో తన సొంత భూమిలో మొక్కజొన్న సాగులో జంట సాళ్ల పద్ధతిని అవలంబించిన రైతు భాస్కర్‌రావు రైతులకు ఆదర్శప్రాయంగా నిలిచారు. సూక్ష్మనీటి పథకం ద్వారా డ్రిప్‌ను ప్రవేశపెట్టి, గాలి, వెలుతురు పంటకు అందే విధంగా చూడటం తో మక్కలో మంచి ఫలితాలు వచ్చాయి. ప్రస్తుతం కోత దశకు వచ్చిన మక్క పంటను పరిశీలించేందుకు ఇప్పటికే వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో పాటు శాస్త్రవేత్తలు, రైతులు పంట పొలాన్ని సందర్శించారు. ఒక్కొక్క కంకికి 20 వరుసలు, వరుసకు 50 గింజల చొప్పున ఒక్కో కంకికి వెయ్యి గింజలు ఉండే విధంగా దిగుబడి సాధించారు. మరికొద్ది రోజుల్లోనే పంట కోతకు రానున్న నేపథ్యంలో దిగుబడి ఫలితాన్ని ప్రమాణికంగా తీసుకునేందుకు గాను శాస్త్రవేత్తలు ప్రణాళికను రూపొందించారు.

సాధారణ పద్ధతిలో దిగుబడి ఇలా..

ప్రధానంగా మక్కజొన్న సాగు 60 సెంటీ మీటర్లు సాలుకు సాలు దూరం ఉంచి 20-25 సెంటీ మీటర్ మొక్కకు మొక్కకు మధ్య దూరం పాటి స్తూ దేశవాళీ నాగలితో విత్తుకోవటం జరుగుతుంది. ఈ పద్ధతిలో 8-10 కిలోల విత్తనం ఒక ఎకరాకు వాడుకొని సరాసరి 25-30 క్వింటాళ్ల దిగుబడి ఎకరాల ఒక్కంటికి సాధించవచ్చు. వర్షాకాలం వరి పంట కోత అయిన తర్వాత సారవంతమైన నేల వున్న ప్రాంతాల్లో (చౌడు, నీరు ఇంకని భూమి కాకుండా) దుక్కి దున్నకుండా నేరుగా విత్తనం తాడుతో సాళ్లుపట్టి కూలీలతో డిబ్లింగ్ పద్ధతి ద్వారా విత్తుకుని (60x20-25 సెం.మీ) విత్తిన వెంటనే కలుపు నివారణ మందును పిచికారీ చేసుకుని తక్కువ తడులతో తక్కువ పెట్టుబడితో 25-30 క్వింటాళ్ల దిగుబడి ఎకరాకు దిగుబడి పొందే అవకాశం ఉన్నది. నీటి విషయంలో సైతం సాంప్రదాయపద్ధతిలో పెట్టడం వల్ల అధిక నీరు అవసరమయ్యే అవకాశం ఉన్నది. డ్రిప్ పద్దతి ఉపయోగించకపోవడం వల్ల నీటి సమస్య తలెత్తే అవకాశం లేకపోలేదు.

సాగు పద్ధతి ఇలా...

నీరు తక్కువగా ఉన్న ప్రాంతాలు, బిందు సేద్యం అమరిక ఉన్న రైతు క్షేత్రంలో జంట సాళ్ల పద్ధతిలో మక్కజొన్న సాగు చేపట్టారు. దీనిద్వారా అధిక దిగుబడిని సాధించవచ్చని ప్రయోగాత్మకంగా నిరూపించారు. భాస్కరరావు భూమిలో క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. ఈ పద్ధతిలో జంటకు జంటకు మధ్య 70 సెం.మీ సాలుకు సాలుకు మధ్య 30 సెం.మీ మొక్కకు మొక్క మధ్య 20-25 సెం.మీ ఉండునట్లు కట్టలు తొలి (బోదెలు) కూలీలతో డిబ్లింగ్ పద్ధతిలో విత్తారు. దీనికి గాను కావేరీ బంపర్, సింజెంటా-6668 రకాలను ఎంచుకుని ఎకరా ఒక్కంటికి 7 కిలోల విత్తనం వాడారు. డిప్పు ద్వారా నీటి తడిచి ఇచ్చిన మరుసటి రోజు కలుపు నివారణ మందు పిచికారీ చేసి, పంట సుమారు 25 రోజు ల దశలో టోప్రోమైజిన్ కలుపు నాషిని పూర్తి పైరు భూమి కమ్మినప్పుడు పిచికారీ చేశారు. పంటకు ఎట్టి నష్టం జరుగకుండా అన్ని రకాల కలుపు మొక్కలు నివారించబడినాయి.

అంతరకృషి, కూలీలతో కలుపు తీయ డం వంటి ఖర్చులను తగ్గించుకోవటం జరిగింది. ఎరువుల యాజమాన్యంలో భాగంగా దుక్కిలో ఒక ఎకరాకు 50 కేజీల గ్రోమోర్ 28-28-0 వేసి, పైరు వయస్సు 20 రోజుల నుంచి వారానికొకసారి ఎకరా ఒక్కంటికి 10 కేజీల యూరియా చొప్పున డ్రిప్పు ద్వారా 7 వారాల పాటు (70 కేజీలు) ఫర్టిగేషన్ చేయటం జరిగింది. సస్యరక్షణలో భాగం గా జింకు దాతులోపం గమనించి ఎకరా ఒక్కంటికి 200 గ్రా. చలామన్ జింకు పిచికారీ చేసి, కాండం తొలిచే పురుగును గమనించి ఎకరా ఒక్కంటికి 60 మి. గ్రా కొరాజన్ పిచికారీ చేశారు. ఈ పద్ధతి అవలం బించడం వల్ల గాలి, సూర్యరశ్మి, నీరు, భూమిలోని వేరు వ్యవస్థకు గాలి నింపటం వంటివి అన్ని మొక్కలకు సమానంగా అందుబాటులో ఉంటా యి. దీనివల్ల అన్ని మొక్కలు ఏపుగా ఎదిగి మంచి దిగుబడిని ఇచ్చాయి. దిగుబడి సుమారు ఎకరా ఒక్కంటికీ 50 క్వింటాళ్ల రావచ్చని వ్యవసాయశాఖ శాస్త్రవేత్తలు అంచనా. పెట్టుబడి ఖర్చులు పోగా నికర ఆదాయం రూ. 53,500 రావచ్చు అంచనా వేస్తున్నారు. తక్కువ పెట్టుబడి, తక్కు వ నీటి వనరులతో అధిక దిగుబడులు సాధించాలనేది తన ఉద్దేశమని రైతు అన్నారు. అందుకే ఈ జంటసాళ్ల సాగు పద్ధతిని చేపట్టానని భాస్కర్ రావు వివరించారు. మరిన్ని వివరాల కోసం వారిని ఈ నంబర్ ద్వారా 94903 72543 సంప్రదించవచ్చు.
-మద్దెల లక్ష్మణ్,ఖమ్మం వ్యవసాయం
9010723131


ఆదర్శంగా నిలిచిన రైతు

సాంకేతిక పద్ధతిని ఎక్కువమంది రైతులకు తెలియజేయడానికి గాను క్షేత్ర సందర్శనం కృషి విజ్ఞాన కేంద్రం, వైరా ఆత్మ, ఖమ్మం ద్వారా చుట్టుపక్కల 10 గ్రామాల రైతులను ఆ క్షేత్రానికి ఆహ్వానించారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, వ్యవసాయ పరిశోధన స్థానం మధిర శాస్త్రవేత్తలు, పథక, సంచాలకులు ఆత్మ, జిల్లా ఉద్యానవన, పట్టుపరిశ్రమ అధికారి, తదితరులతో సమావేశం నిర్వహించి రైతులకు అవగాహన కల్పించారు. తక్కువ పెట్టుబడి తక్కువ నీటి వనరులతో అధిక దిగుబడి దిశగా దూసుకపోతున్న భాస్కర్‌రావు సాగు పట్ల సమీప ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 10 ఏండ్ల నుంచి ఆయన సాగులో సరికొత్త ఒరవడి తీసుకు వస్తున్నారు. ఈ విధానాల పట్ల వారు ఆకర్షితులైవుతున్నారు.
Laxman
ఒకవైపు రైతులకు శిక్షణ ఇస్తూనే స్వయంగా సాగు చేస్తున్న ఆత్మ ఉద్యోగి తీరు ఖమ్మం జిల్లా రైతాంగానికి, వ్యవసాయశాఖ అధికారుల, శాస్త్రవేత్తల ప్రశంసలు అందుకుంటున్నారు. మరో 10 రోజుల్లో పంట కోతకు రానున్న నేపథ్యంలో పంట పొలంలో ఒక భాగాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు దిగుబడిని అంచనా వేసేందుకు ప్రణాళికను రూపొందించారు. తద్వారా ఈ పద్ధతిని ఇతర జిల్లా రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వ్యవసాయ శాఖ అధికారులు ప్రయత్నాలను చేస్తున్నారు.

ఆధునిక పద్ధతులతో ఆశించిన ఫలితాలు

ఆధునిక పద్ధతిలో పంటల సాగు చేపడితే ఆశించిన ఫలితాలు పొందవచ్చని భాస్కర్‌రావు నిరూపించారు. కాబట్టి రైతులు నూతన వ్యవసాయ పద్ధతలను అనుకరించాలి. ప్రస్తుత పరిస్థితులలో మక్కజొన్న పంటకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్నది. అయితే సాంప్రదాయ పద్ధతిలో సాగు చేయకుండా భిన్నంగా ఆలోచించాలి. అవసరమైతే అధికారుల, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు తీసుకోవాలి.
-అత్తోట ఝాన్సీలక్ష్మీకుమారి ఖమ్మం వ్యవసాయశాఖ అధికారి

987
Tags

More News