మామిడి కోతలో జాగ్రత్తలు

Wed,April 4, 2018 11:54 PM

మామిడి పంటలో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించడం ఒక ఎత్తైతే.. సరైన సమయంలో కోత కోసి మార్కెటింగ్ చేసుకోవ డం మరోఎత్తు. ఈ రెండూ సక్రమంగా చేసినప్పుడే మామిడి రైతు లు మంచి ఆదాయం పొందే అవకాశాలుంటాయి. మామిడి కోతలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఉద్యానశాఖ అధికారులు వివరించారు.
Habredmango

కోత దశలో..

మామిడి కాయ తెంపడం ఏప్రిల్ నెల నుంచి జూన్ వరకు కొనసాగుతుంది. మేలో ఎక్కువగా కోతకు వస్తాయి. మామిడి కోత సమయంలో తీసుకునే జాగ్రత్తలను బట్టే కాయ నాణ్యత, కాయ రుచి ఆధారపడి ఉంటుంది. సరైన పక్వ దశలో కాయలు కోయకపోవడంతో దాదాపు 30-40 శాతం కాయలు పాడవుతున్నాయి. ఒకసారి చెట్టు నుంచి కాయను కోసిన తరువాత చెట్టుపైన పొందే కాయ నాణ్యతను పెంపొందించడం కష్టం. కాయ పరిపక్వదశకు చేరకముందే కాయను కోస్తే పండుగా మారక ఎండిపోయే అవకాశం ఉన్నది. కాయ గాలికి కాకుండా మాములుగా రాలితే తెంపడానికి సిద్ధంగా ఉందని అనుకోవచ్చు. బంగిలిపల్లిలో పంచదార శాతం 9, దశేరి 8.5 వరకు పెరిగినప్పుడు తెంపితే పండు నాణ్యత దెబ్బతినదు. కాయలో వచ్చే కొన్ని మార్పులను బట్టి కాయ ముదిరింది, లేనిది తెలుసుకోవచ్చు. కొన్ని మామిడిరకాల్లో పండు పసుపు రంగుకు మారడం, మరికొన్ని రకాల్లో పక్వత తెలియజే స్తూ బూడిద లాంటి పొర ఏర్పడుతుంది. కాయ తొడిమకు దగ్గరగా రంగు మార్పు, కాయ తుంచితే వచ్చే సాన సాంద్రత తగ్గడం కాయ కోతకు సూచనలుగా భావించవచ్చు. కాయలు కోసేటప్పు డు, కాయలు కిందపడి దెబ్బతగలకుండా కొక్కెం వలె కట్టిన వెదురు కర్రతో కోయాలి.

మొదటి పరిపక్వ దశ:

కాయ నిండు ఆకారం చెట్టునపై పొంది లేత ఆకుపచ్చని రంగు కలిగి ఉంటుంది. తెల్లని మచ్చలు అంతగా స్పష్టంగా కనిపించవు. బూడిద పొడి కూడా అంత స్పష్టంగా కనిపించదు. ఈ దశలో కాయలు 95-100 రోజుల్లో 7-9శాతం పంచదార కలిగి ఉంటా యి. వీటి విలువ వ్యవధి 20-25 రోజులు ఈ దశలో కాయలను ఇతర దేశాలకు ఎగుమతి చేయవచ్చు.

రెండో పరిపక్వ దశ:

ఈ దశలో లేత ఆకుపచ్చ కంటే మరికొంత తెలుపుదనం కలిగి తెల్ల ని మచ్చలు స్పష్టంగా ఏర్పడుతాయి. కాయపైన బూడిద పొడి అద్దినట్లు కనిపిస్తుంది. ఈ దశ కాయలు 100-105రోజుల్లో 9-10శాతం పంచదార కలిగి ఉంటాయి. వీటి విలువ వ్యవధి 17-20 రోజులు ఈ దశలో అతి తక్కువ సమయంలో ఇతర దేశాలకు బంగినపల్లి, తోతాపురి లాంటి రకాలను విమానాల ద్వారా విదేశాలకు ఎగుమతి చేయవచ్చు.

మూడో పరిపక్వ దశ:

ఈ దశలో కాయ పూర్తిగా పక్వం పొంది 11-12 శాతం పంచదార కలిగి ఉంటాయి. ఈ కాయలు 108-110 రోజుల్లో కోయవచ్చు. వీటి నిల్వ వ్యవధి 10-12 రోజులు మాత్రమే కోసిన 1-2 రోజుల్లో పండుగా మారుతుంది. కొన్ని సందర్భాల్లో చెట్టుపైనే పండుగా మారుతుంది. ఈ దశలో కాయలను ఇతర రాష్ర్టాలకు ఎగుమతి కోసం ఉపయోగించవచ్చు. పూర్తిగా పక్వానికి వచ్చిన కాయలను స్థానిక మార్కెట్‌లో అమ్ముకోవాలి.

కాయ కోసే సమయంలో..

సాధారణంగా రైతులు మామిడి కోతకు కర్రకు చివర కొక్కెం లేదా చిక్కం కట్టి కోయడం చేస్తుంటారు. ఇందుకు బదులుగా దాపోలి పరికరాన్ని ఉపయోగించడం మంచిది. దీనికి నైలాన్ వల ఉండి, పైన పళ్లు కల ఇనుప చక్రం ఉంటుంది. ఇది ఉపయోగించి కాయలకు దెబ్బ తగులకుండా 5-7 సెం.మీ తొడిమెతో కోసినైట్లెతే కాయ నాణ్యత దెబ్బతినకుండా ఉంటుంది. కాయ కోతను నిర్ణయించడానికి పండ్లను పంపే మార్కెట్లు దూరాన్ని దృష్టిలో పెట్టుకొని కాయలను తెంపాలి. కాయ చివరి వరకు కోయకుండా, కాయలను 6-7 సెం.మీ పొడవు ఉంచి కోస్తే సోన కారే అవకాశం ఉండదు. కాయలను తెంపి కింద బలంగా పోస్తే, కాయకు దెబ్బ మనకు కనబడకపోయినప్పటికి పక్వ సమయంలో నాణ్యత దెబ్బతింటుంది. కోసిన కాయలను కాడలను తీసివేసి సొన కారిపోవడానికి బోర్లా వేయాలి. మామిడి కాయలను కార్బైడ్‌తో మాగబెట్టడం ఆరోగ్యానికి హానికరం. దాంతో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి మామిడి కాయలను ఇథలిన్ గ్యాస్‌తో పండిస్తే కాయలు 3-4 రోజుల్లో పండే అవకాశం ఉన్నది. దీనివల్ల కాయ లు అన్ని ఒకే సారి పక్వానికి వచ్చి మంచి రుచితో ఉండే అవకాశం ఉన్నది.
- గుండెల రాజు
మహబూబాబాద్ వ్యవసాయం
72889 85757


సరైన సమయంలో కోత

Surya
మామిడి పంటలో రైతులు సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలి. అలాగే సరైన సమయంలో కోత కోయాలి. వీటికితోడు మార్కెటింగ్ చేసుకోవడం కూడా ముఖ్యం. ఇలా సక్రమంగా రైతులు యాజమాన్య పద్ధతులు పాటిస్తేనే మంచి ఆదా యం పొందే అవకాశమున్నది. అలాగే మామిడి తోటలపై రైతులు ఇష్టారాజ్యంగా పురుగుల మందుల వాడకూడదు. బయో ఎరువులు, జీవ సేంద్రియ ఎరువులు వాడాలి.

రైతుబడికి ఆహ్వానం

రైతు పంట పొలాలే జీవితంగా వ్యవసాయంలో రేయింబవళ్లు పనిచేస్తాడు. తమవైన అనుభవాలు, గుణపాఠాలతో మెరుగైన, మేలైన పంటవిధానాలకు జీవం పోస్తాడు. ఇలాంటి అనుభవాలు పదిమందితో పంచుకుంటే రైతులకు మరింత మేలు జరుగుతుంది. కాబట్టి రైతుసోదరులు తమవైన అనుభవా లు, గుణపాఠాలతో పాటు, తమ సృజనాత్మక పనిలో భాగంగా కొత్తగా ఆవిష్కరించిన పనిముట్ల గురించి రైతుబడికి రాసి పంపించగలరు.
- కె. సూర్యనారాయణ
జిల్లా ఉద్యాన శాఖ అధికారి
మహబూబాబాద్. 83744 49066

604
Tags

More News