సేంద్రియ పద్ధతిలో పెరటితోట పెంచుదామిలా

Thu,March 29, 2018 12:36 AM

-ఏడాది పొడవునా కూరగాయల సాగుకు అనుకూలం
-నాణ్యమైన దిగుబడులకు సరియైన విధానం
ఇంటి ఆవరణలో అందుబాటులో ఉన్న ఏ రకమైన ఖాళీ స్థలాన్ని అయిన సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ చిన్న,చిన్న సూత్రాలు పాటించి సమీకృత పోషక పదార్థాలను అందజేసే ఐదు రకాల కూరగాయలను సంవత్సరం పొడవునా పండించుకోవచ్చు. ఈ అనువైన సమర్థ విధానమే బయో ఇన్‌టెన్సివ్ గార్డెనింగ్. పూర్తిగా సేంద్రియ పదార్థాలను ఉపయోగిస్తూ పెరటి తోటలను సాగు చేయవచ్చు. ఈ విధానం గురించి గడ్డిపల్లి కేవీకే ఉద్యానవన శాస్త్రవేత్త ఎం.రంగారెడ్డి వివరించారు. దీనికి సంబంధించిన అదనపు సమాచారం కోసం 9849860803 నెంబర్‌ను సంప్రదించవచ్చని తెలిపారు. పెరటి తోటల సాగు గురించి వారు తెలిపిన వివరాలు...
organic-method
సమీకృత పోషక పదార్థాల యాజమాన్యం, సమీకృత చీడ, పీడల నివారణ పద్ధతులను ఏకకాలంలో అవలంబిస్తూ చీడ, పీడలు వచ్చిన తర్వాత అరికట్టడం అనే ఆలోచన కంటే అది రాకుండా చూసుకోవడమే మేలు. ఈ సూత్రం ఆధారంగా ఆ విధానంలో కూరగాయలను పండించుకుంటారు.

మడి తయారీ: దీనికోసం 100 చదరపు మీటర్ల స్థలం 20 మీటర్లు పొడవు, 5 మీటర్ల వెడల్పు ఉండే విధంగా దీర్ఘ చతురస్ర్తాకారంలో మడిని ఎంచుకోవాలి. ఈ మడి లో 2 అడుగుల లోతు వరకు రాళ్ళు లేకుండా చేయాలి. దీంట్లో 6 తట్టల పశువుల గెత్తం (బాగా మాగిన పశువు ల ఎరువు), 4 కిలోల వర్మికంపోస్ట్, 4 కిలోల వేప పిండి, 2 కిలోల కోడి గుడ్లు లేదా నత్తగుల్లలు, పావు కిలో కొయ్యబూడిద, 2 కిలోల సుబాబుల్ రొట్ట, 2 కిలోల వేప రొట్ట సమానంగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ పదార్థాలు భూమిలో పోషక పదార్థాలను అందించడంతో పాటు భూమి గుల్లగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. వర్మికంపోస్ట్ పోషక పదార్థాలతో పాటు హార్మోన్‌లను మిత్ర సూక్ష్మజీవులను కూడా అందిస్తుంది. గుల్లలు మడిని గుల్లగా ఉంచడంలోనూ బూడి ద పోషక పదార్థాలు (పొటాష్, జింక్ మొదలైనవి) అందించడంతో పాటు మడిలో క్రిమి,కీటకాదులను పారదోలడంలో కూడా ప్రముఖపాత్ర వహిస్తాయి.

కూరగాయల పెంపకం:

ఈ రకంగా మడిని నాలుగు సమ భాగాలుగా తయారు చేసుకోవాలి. ఒక్కొక్క భాగం 25 చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగి ఉంటాయి. మొదటి మడిలో ఆకుకూరలు (తోటకూర, మెంతికూర, చుక్క, పాలకూరలు మొదలైనవి) రెండో మడిలో దుంపజాతి(ముల్లంగి, కేరట్ మొదలైనవి), మూడో మడిలో కాయజాతి (వంకాయ, బెండ, టమాట మొదలైనవి), నాల్గొమడిలో చిక్కుడు జాతి(గోకర, బరబటి మొదలైనవి) నాటుకోవాలి. మడికి ఉత్తరం లేదా దక్షిణ దిశలో తీగజాతి (బీర, అనప, కాకర మొదలైనవి) విత్తనాలు రెండు కుదుళ్ళలో నాటుకుని అధే దిశలలో పందిళ్ళు వేసుకోవాలి. పందిరిని తూర్పు, పడమర దిశలలో నాటుకోరాదు. దీనివల్ల కింది మడిలో పెరుగుతున్న మొక్కలపై ఉదయం, సాయంత్ర వేళలో నీడపడుతుం ది. దీనివల్ల ఆ మొక్కలు పూర్తి ఆరోగ్యంగా ఉండక చీడ, పీడలకు గురి అవుతాయి. ఈ రకంగా పెంచుకునే ఐదు రకాలు కూరగాయాలను ఆయా కాలాలకు అనువైన రకాలను మాత్రమే పెంచుకోవాలి. లేకపోతే వాటి పెరుగుదల సరిగా ఉండక అనేక రకాలైన చీడ,పీడలకు గురై సరైన దిగుబడులు రాక నష్టపోతారు.

organic-method6
మంచి ఆరోగ్యం: ఐదు రకాల కూరగాయాలను పండించి తినడం వల్ల శరీర పెరుగుదలకు అవసరమైన విటమిన్లు, ప్రోటీన్లు, పిండి పదార్థాలు, కొవ్వుపదార్థాలు, పీచుపదార్థాలు, నీరు నిర్దిష్ట ప్రమాణాల్లో అంది సమీకృత పోషక పదార్థాలు పొందడంలో దోహదపడతాయి.

పంటమార్పిడి: ఒక మడిలో ఒక రకమైన కూరలు పండించిన తర్వాత తిరిగి అదే మడిలో రెండోసారి అదే రకమైన పంటలు పండించకూడదు. ఉదాహరణకు ఆకుజాతి పంటను తీసివేసిన మడిలో తిరిగి మరోసారి ఆకుజాతిని కాకుండా ఇతర జాతులను నాటుకోవాలి. ఇలా అన్ని పంటలను మార్పిడి చేసుకోవాలి. ఈ విధం గా పంటల మార్పిడి పద్ధతిని అవలంబిచడం వల్ల రెండోసారి పండించే మొక్కలకు పోషక పదార్థాలు సమృద్ధిగా అంది అవి ఆరోగ్యంగా పెరుగుతాయి. దీనివల్ల ఆయా మొక్కలు చీడ, పీడలను తట్టుకునే శక్తి సమృద్ధిగా కలిగి ఉంటాయి. తీగజాతి కూరగాయల కుదుళ్ళను కూడా మడి ఉత్తర, దక్షిణ దిశలలోనే మార్చి పెట్టుకోవాలి. ప్రతి 25 చదరపు మీటర్ల స్థలం నుంచి ఒక రకమైన కూరగాయ పంటను వేసి రెండో రకం నాటుకునే ముందు ఇదివరలో చెప్పుకున్నే సేంద్రియ ఎరువులు, రొట్టలలో నాలుగో వంతు తీసుకుని ఆ భాగంలో కలుపుకోవాలి. వంద చదరపు మీటర్ల స్థలం లో ఉన్న ఐదు రకాల కూరగాయల మొక్కల చుట్టూ బంతి లేదా తులసి మొక్కలను నాటుకుంటే మొక్కలను ఆశించే పురుగులను పారదోలడంలో సహాయపడు తాయి.

సస్యరక్షణ: ఇక ఆయా మొక్కలను ఆశించే పురుగులను, తెగుళ్ళను పారదోలడానికి వివిధ రకాలైన వృక్ష సంబం ధ నూనెలు, కషాయాలు, బూడిద మొదలగు పదార్థాలను తగిన రీతిలో ఉపయోగించి మంచి ఫలితాలను పొందవచ్చు.
1) వేపనూనె, 2) కానుగునూనె, 3) జట్రోపా గింజల నూనె, 4) పొగాకు కాడల కషాయం, 5) బంతికాడల కషాయం, 6) కొయ్య బూడిద మొదలైనవి. ఈ పదార్థాలను నిర్దేశించబడిన పరిమాణంలో మంచి నీటి లో కలుపుకుని జల్లుకోవాలి. బూడిదను ఉదయం పూట ఆకులకు అంటుకునే విధంగా పల్చుని గుడ్డలో కట్టుకుని జల్లుకోవాలి. వేప, కానుగు నూనెలను జల్లుకునేటప్పుడు ముందుగా కొద్దిగా నీటిలో కుంకుడుకాయల రసం తీసుకుని వంద గ్రాముల రసంలో మూడు మి.లీల నూనెను బాగా కలిపి తర్వాత తొమ్మిది వందల గ్రాముల మంచి నీటిని తిప్పుతూ కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఆకుల అడుగున, పైన తడిసే విధంగా జల్లుకోవాలి. కషాయాలను తయారు చేసుకునేటప్పుడు పావు కిలో బరువు ఉండే ఎండిన బంతి లేదా పొగాకు కాడలను రెండు లీటర్ల నీటిలో బాగా మరిగించి కషాయంగా తయారు చేసుకోవాలి. ఈ కషాయాన్ని వడగట్టుకుని వంద, రెండు వందల మి.లీల ద్రావణాన్ని ఎనిమిది, తొమ్మిది వందల మి.లీల నీటిని కలిపి బాగా కలుపుకుని ద్రావణాన్ని తయారు చేసుకుని మొక్కలపై జల్లుకోవాలి. దీని కొరకు బాటిల్ స్ప్రేయర్‌ను ఉపయోగించుకోవచ్చు.

పెరుగుతున్న మొక్కలపై ప్రతి 20 రోజులకు ఒకసారి కషాయం లేదా నూనె ద్రావణాన్ని మార్చి, మార్చి జల్లుకుంటూ ఉండాలి. ఇవి క్రిమికీటకాలను నివారించడంలో తోడ్పడుతాయి. అంతేకాకుండా ఈ పదార్థాలన్ని మొక్కలకు కావాల్సిన అమైనో ఆమ్లాలను అందజేసి, మొక్క ఆరోగ్యంగా పెరుగడంలో ప్రముఖపాత్ర వహిస్తాయి. ఏ రెండుసార్లు ఒకే రకమైన ద్రావణాన్ని వాడకూడదు. ఈ రకమైన పిచికారీలు తెగుళ్ళు లేదా కీటకాలు వచ్చిన తర్వాత నివారించడం కాకుండా ఇవి రాకుండా చూసుకోవడడం అనే ప్రాతిపదికలో కూరగాయలను పం డించుకోవాలి. ఈ రకమైన వృక్షసంబంధమైన పదార్థాలను చీడ, పీడల నివారణలో ఉపయోగించడం వల్ల ఏ రకమైన కాలుష్యాలు ఏర్పడవు. వీటి అవశేషాలు కూరగాయల మీద ఉండవు. అందువల్ల వీటిని కోసిన తర్వాత కాయకూరలు కోసి వాడుకోవడానికి ఎక్కువ కాలం నిరీక్షించాల్సిన అవసరం ఉండదు. ఈ రకంగా అందుబాటులో ఉండే పెరటి స్థలంలోనే మన వద్ద లభిం చే వివిధ సేంద్రియ (జీవ) పదార్థాలను సమర్థవంతంగా వినియోగించుకుంటూ ఏ విధమైన కాలుష్యాన్ని కలుగజేయని, హానికర అవశేషాలను లేని ఆరోగ్యమైన రుచికరమైన వివిధ పోషక పదార్థాలను అందజేసే వివిధ రకాలైన కూరగాయలను ఏడాది పొడవునా పండించుకోవచ్చు.

-నట్టె కోటేశ్వర్‌రావు, గరిడేపల్లి
9989944945

448
Tags

More News