నువ్వుల పంటలో చీడపీడల నివారణ

Wed,March 28, 2018 11:10 PM

nuvvulu
రాష్ట్రంలో ఎండాకాలంలో సాగు చేయడానికి అనుకూలమైన నూనె గింజల పంట నువ్వులు. ఈ సాగు తక్కువ పెట్టుబడి, స్వల్ప కాలపరిమితి ఉంటుంది. ఎగుమతి ప్రాధాన్యం, రెండవ పంట గా ఎండాకాలంలో సాగుకు వెసులుబాటు ఉంటుంది. తక్కువ నీటి వనరు, అన్నిరకాల నేలల్లో సాగుకు అనుకూలం. మార్కెట్లో మంచి ధర లభిస్తుంది. అధిక నికర ఆదాయం వల్ల క్రమంగా నువ్వు సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉన్నది. వానకాలం, యాసంగిలో పండించిన పంట కన్నా వేసవి ఆరుతడి పంటగా సాగు చేసినప్పుడు చీడపీడల బెడద తక్కువగా ఉంటుంది. నాణ్యమైన విత్తనం, అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉన్నది. వానకాలంలో సాగు చేసిన పసుపు, పత్తి పంటలను డిసెంబరు మాసంలో కోసిన అనంతరం రెండవ పంటగా జనవరి రెండవ పక్షంలో విత్తుకొని అతి తక్కువ సమయంలో తక్కువ నీటి వనరు తో అధిక నికర లాభాన్ని పొందేందుకు నువ్వు పంట ఉపకరిస్తుంది. నువ్వుల పంట సాగులో చీడపీడల యాజమాన్యంపై రైతులకు సరైన అవగాహన లేకపోవడం వల్ల క్షేత్రస్థాయిలో దిగుబడులకు తక్కువ గా నమోదవుతుందని పొలాస పరిశోధనా స్థానం సహ సంచాలకులు డాక్టర్ ఉమారెడ్డి పేర్కొన్నారు. వేసవిలో నువ్వు పంట లో సోకే చీడపీడలు వాటి నివారణ పద్ధతులను కింది విధంగా సూచించారు.

ఆకు ముడత, కాయ తొలుచు పురుగు: పైరు లేత దశలో, చిన్న గొంగళి పురుగులు 2, 3 ఆకులను దగ్గరకు చేర్చి గూడు కట్టుకొని పచ్చని పదార్థం గోకి తినడం వల్ల ఆకులు ఎడిపోయి, కాలినట్లు కన్పిస్తాయి. ఈ పురుగు మొగ్గ ఏర్పడే దశలో పూమొగ్గలను, పూతను, కాయల్లోని గింజలను తింటూ పంటకు నష్టం కలుగజేస్తాయి. దీని నివారణకు 2.5 మిల్లీలీటర్ల క్లోరోఫైరిపాస్, 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోపాస్, 1.5 గ్రాములు ఎసిఫేట్ ఒక లీటరు నీటికి కలుపుకొని పిచికారీ చేయాలి.

రసం పీల్చే పురుగు (తామర పురుగులు, పేను బంక, తెల్లనల్లి): తామర పురుగులు, పచ్చదోమ విత్తిన 10 రోజుల నుంచి పంటను ఆశిస్తాయి. ఈ పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చ డం వల్ల ఆకులన్నీ పాలిపోయి తర్వాత ఎండిపోతాయి. వీటి నివారణకు 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్, ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు, ఎసిఫేట్ 1.5 గ్రాములు ఒక లీటరు నీటికి ఏదై నా ఒక మందును కలుపుకొని పిచికారీ చేయా లి. తెల్లనల్లి నివారణకు 5 మిల్లీలీటర్లు డైకోఫాల్, 2 మిల్లీలీటర్లు డైమిథోయేట్ ఏదైన ఒక మందు ను ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పిండి పురుగు పిల్ల, తల్లి పురుగులు కొమ్మలు, కాండం, మొగ్గల నుంచి రసాన్ని పీల్చడం వల్ల మొక్కలు వాడి ఎండిపోతాయి. వీటి నివారణకు ఒక లీటరు నీటికి 2 మిల్లీలీటర్ల ప్రొఫినోఫాస్ లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్ ఏదైన ఒక మందు ను జిగురు 1 మిల్లీలీటరు ఒక లీటరు నీటితో పిచికారీ చేయాలి.

nuvvulu2

తెగుళ్ళు:

ఆల్టేనేరియా ఆకుమచ్చ తెగులు : పైరు విత్తిన 30 రోజుల నుంచి ఆఖరి దశ వరకు ఆశిస్తుంది. ముదురు గోధుమ రంగులో గల వలయాకారపు మచ్చలు మొక్క కింద ఆకుల మీద ఏర్పడి తర్వా త మచ్చలు ఒకదానితో ఒకటి కలిసిపోయి ఆకు లు అంతటగా వ్యాపించడం వల్ల ఆకులు ఎండిపోతాయి. మచ్చలు కాండం, కాయల మీద కూడా వ్యాపించడం వల్ల గింజ నాణ్యత, దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది.

సెర్కెస్పోరా ఆకుమచ్చ తెగులు: ఆకులపై చిన్న చిన్న బూడిద రంగు మచ్చలు ఏర్ప డి తర్వాత గోధుమ రంగుకు మారి ఆకుల అంతటా వ్యాపించి ఆకులు రాలిపోతా యి. ఈ మచ్చలు కాండం, కాయల మీద కూడా ఏర్పడి పంటను నష్టపరుస్తాయి. ఆకుమచ్చ తెగుళ్ళ నివారణకు ఒక కిలో విత్తనానికి 3 గ్రాముల మాంకోజెబ్ లేదా కాప్టాన్ కలిపి విత్తనశుద్ధి చేయాలి. తెగుళ్లను తొలి దశలోనే గుర్తించి ఒక లీటరు నీటికి 2.5 గ్రాముల కార్బండాజిమ్, మాంకోజెబ్ కలిపి ఉన్న మందును లేదా 1 మిల్లీలీటరు ప్రొపికోనజోల్ ఏదైనా ఒక మందును 7-10 రోజుల వ్యవధి రెండుసార్లు మందు మార్చి పిచికారీ చేయాలి.

బూడిద తెగులు: తొలిదశలో ముదురు ఆకుల మీద బూడిద రంగు లాంటి పదార్థం ఏర్పడి తర్వాత లేత ఆకులకు వ్యాపిస్తుంది. ఆకుల్లో కిరణజన్యసంయోగ క్రియకు ఆటంకం ఏర్పడి, ఆకులు పండుబారి రాలిపోతాయి. దీని నివారణకు నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేదా మైక్లోబ్యుటానిల్ 1 గ్రాము ఏదైన ఒక మందును పిచికారీ చేయాలి.

వేరు, కాండం కుళ్ళు తెగులు: తెగులు సోకిన మొక్క ల ఆకులు పసుపు వర్ణానికి మారి తర్వాత దశల లో ఆకులు ముడుచుకొని రాలిపోతాయి. తెగు లు సోకిన మొక్కల వేర్లు పూర్తిగా లేదా పాక్షికం గా కుళ్లిపోతాయి. ఆశించిన మొక్కల కాండం కుళ్ళిపోయి, గులాబీ రంగు శిలీంధ్రపు పెరుగుదలను కాండం మీద గమనించవచ్చు. నివారణకు విత్తనశుద్ధి చేయాలి. తెగులును తొలి దశలోనే గుర్తించి 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా మాంకోజెబ్ ఒక లీటరు నీటటిలో కలుపుకొని భూమి తడిచేటట్లు మొక్కల మొదళ్ళను తడుపాలని సూచించారు.

-భానుక శ్రీనివాస్, జగిత్యాల టౌన్
9490530001

294
Tags

More News