e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, January 18, 2022
Home pvnr100years ల్యాండ్‌ సీలింగ్‌ లేకుంటే...రక్తపాతం

ల్యాండ్‌ సీలింగ్‌ లేకుంటే…రక్తపాతం

భూ సంస్కరణల విషయంలో పీవీ నరసింహారావు మొదటినుంచీ పట్టుదలగా ఉండేవారని రాజ్యసభ సభ్యుడు, పీవీ కుటుంబ సన్నిహితుడు ఒడితల (కెప్టెన్‌) లక్ష్మీకాంతారావు చెప్పారు. తాను చిన్నవాడిగా ఉన్నప్పుడే ఒకసారి ఈ విషయాన్ని తనతో అన్నారని, ల్యాండ్‌ సీలింగ్‌ పెట్టకపోతే ఊర్లలో రక్తపాతం వస్తుందని ఆందోళన చెందారని తెలిపారు. పీవీ అనేక ఉద్యమాల్లో, అజ్ఞాతంలోనూ ఉండి పోరాటాలు చేశారని చెప్పారు. అన్ని వర్గాలవారి అభ్యున్నతి లక్ష్యంగా పనిచేయాలని చెప్పేవారని పీవీ నరసింహారావుతో తన జ్ఞాపకాలను నమస్తే తెలంగాణ ప్రతినిధితో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

అంతా ముందే చెప్పారు..

పీవీ నరసింహారావుది గొప్ప వ్యక్తిత్వం. అన్ని అంశాలను దూరదృష్టితో చెప్పేవారు. స్వతహాగా వ్యవసాయం చేసే ఆయనకు భూముల విషయంలో పూర్తి అవగాహన ఉంది. 1972లో అనుకుంట. లోక్‌సభ ఎన్నికలు వచ్చినయి. పీవీ వంగరలో ఉన్నప్పుడు నేను రోజు పొద్దున్నే అక్కడికి పోయెటోడిని. అప్పుడు ఫోన్‌ సరిగా కలవకపోయేది. పీవీ పొద్దున బయటికిపోతూ కాయితం మీద కొన్ని ఫోన్‌ నంబర్లు రాసి ఇచ్చేవారు. ఆ నంబర్లకు ఫోన్‌ చేసి ఆయన చెప్పిన విషయాలను వాళ్లకు వివరించేది. అవతలివాళ్లు చెప్పిన వివరాలను సాయంత్రం పీవీ వచ్చాక చెప్పి మా ఊరు సింగాపూర్‌కు వచ్చేటోడిని. ఆయన బయట నుంచి వచ్చినంక ఒక కాలుతో మరో కాలును కొద్దిసేపు బాగా రాసి కడిగేవారు. అట్లా ఒకరోజు కాళ్లు కడుక్కుంటున్నప్పుడు నేను పక్కనే నిలబడ్డా. సాధారణంగా పీవీ ఏమీ మాట్లాడరు. ఆ రోజు మాత్రం ఆయనే స్వయంగా భూసంస్కరణలపై తన మనోగతం వెల్లడించారు. ‘ల్యాండ్‌ సీలింగ్‌ పెట్టకపోతే బ్లడ్‌ బాత్‌ అయితది. అప్పుడు ఆపుడు ఎవరి తరం కాదు’ అని వ్యాఖ్యానించారు. పీవీకి భూ సంస్కరణలపై ఎప్పటినుంచో విజన్‌ ఉంది. తర్వాత ఆయన చెప్పినట్లే జరిగింది కదా? మనం చూసినం కదా? చానా ఊళ్లలో భూస్వాములను చంపిండ్లు. భూముల విషయంలో ఏం జరుగుతుందో పీవీ ముందే ఆలోచించిన తీరు ఆ తర్వాత అర్థమయింది.  అలాంటి తీవ్ర పరిస్థితి రాకూడదనే పీవీ భూసంస్కరణల చట్టం తెచ్చారు. 

- Advertisement -

అజ్ఞాత ఉద్యమాల్లోనూ పీవీ.. 

పీవీ నరసింహారావు అంటే చాలామందికి వందేమాతర ఉద్యమం గురించే ఎక్కువగా తెలుసు. రాజకీయ విషయాలే కాదు అజ్ఞాత ఉద్యమాలు నాకు గుర్తున్నయి. రోజుల తరబడి రాకుండా అండర్‌గ్రౌండ్‌లో  ఉండేవారు. నేను హన్మకొండ సుబేదారి స్కూల్‌లో చదివేటోడిని. పీవీ అలా క్యాంపులకు బోయినప్పుడు, వచ్చినంక ఏవో సామాన్లు తెచ్చి బాకుల వంటివి తయారుచేయించెటోళ్లు. పీవీ మాకు బాగా దగ్గరి బంధువేమీకాదు. మేనమామల వైపు నుంచి బంధుత్వం. మేనమామలు వేముగంటి మనోహర్‌రావు, జస్టిస్‌ వేముగంటి మాధవరావుతో పీవీ సన్నిహితంగా ఉండేది. ఎక్కువగా మనోహర్‌రావు ఇంట్లో ఉండేవారు. వాళ్లు రహస్యంగా ఆ ఇంట్లోని ఓ అర్రలో ఆలిండియా రేడియో ఇనేటోళ్లు. నేను కావలుండేది. 

ఇందిర ఆదేశాలతో రాంటెక్‌కు..

రాజకీయాల్లో పీవీ పూర్తిగా కాంగ్రెస్‌ విధేయుడిగా ఉన్నారు. ఇందిరాగాంధీ ఆయనను బాగా విశ్వసించారు. తన క్యాబినెట్‌లో పీవీ కచ్చితంగా ఉండాలని భావించారు. వరంగల్‌ రాజకీయాలపై ఆమెకు సమాచారం ఉండటంతో పీవీని రాంటెక్‌లోనూ పోటీచేయాలని చెప్పారు. పీవీ మరాఠీ బాగా మాట్లాడతారు. ఆ భాషలో రచనలు  చేశారు. రాంటెక్‌ కాంగ్రెస్‌ పార్టీకి బలమైన స్థానం. వరంగల్‌లో కాంగ్రెస్‌లోని కొందరు పీవీకి ఇబ్బంది కలిగించేలా చేశారు. ఆ రాజకీయాలతో ఇక్కడ బీజేపీ గెలిచింది. పీవీ రాంటెక్‌లో గెలిచి కేంద్రంలో మంత్రి అయ్యారు. 

కేసీఆర్‌ సంకల్పం గొప్పది..

పీవీ శతజయంతి ఉత్సవాలకు సీఎం కేసీఆర్‌ సంకల్పించడం గొప్ప నిర్ణయం. భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేశారు. 2014లో జూన్‌లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినంక అదే నెల 28న హైదరాబాద్‌లో పీవీ జయంతి నిర్వహించారు. కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు వరంగల్‌లో పీవీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ఆరోజు చెప్పారు. పీవీ సొంత పార్టీ వాళ్లు ఎందుకోగాని ఆయన విషయంలో సరిగా వ్యవహరించలేదు. మేము హన్మకొండ బస్టాండ్‌ సర్కిల్‌లో పీవీ విగ్రహం ఏర్పాటుచేసినం. 1984 నాటి ఎన్నికలలో పీవీపై గెలిచిన చందుపట్ల జంగారెడ్డి ముఖ్యఅతిథిగా వచ్చిండు. పీవీ తెలివిలో తాను గోటికి సరిపోనని అన్నరు. పీవీ గొప్పదనం గురించి చెప్పారు. ప్రతి ఏటా జయంతి కార్యక్రమానికి జంగారెడ్డిని ముఖ్య అతిథిగా పిలుస్తున్న.

– పిన్నింటి గోపాల్‌ , నమస్తే తెలంగాణ, వరంగల్‌ ప్రతినిధి

బీసీ వర్గాలపై అనురాగం..

పీవీ నన్ను లచ్చన్న అని ఆప్యాయంగా పిలిచేవారు. నేను చిన్నాన్న అనేది. హన్మకొండ సుబేదారి ప్రైమరీ స్కూళ్లో చదివేటోడిని. ఐదో తరగతిలో ఉన్నప్పుడు నాకు డబుల్‌ టైఫాయిడ్‌ వచ్చింది. 13 రోజులు సోయిల లేను. మాధవరావు మామ, పీవీ రోజు రాత్రి నా దగ్గర ఉండేటోళ్లు. టీఆర్‌ఎస్‌ తరుపున 2004లో గెలిచిన తర్వాత మంత్రి అయిన. బీసీ సంక్షేమ శాఖ ఇచ్చిండ్లు. అప్పుడు పీవీని కలిసిన. మంచి శాఖ నీది.. బాగా పనిచేయాలని చెప్పారు. సమాజంలో వస్తున్న మార్పులతో బీసీ వర్గాల్లోని చేతివృత్తులవారికి ఉపాధి పోతున్నదని, వారికోసం ఏదైనా చేయాలని అన్నరు. గ్రామాల్లోని పరిస్థితులపై సమగ్ర అధ్యయనంతో ఏదైనా చేయాలని చెప్పిండ్లు. 

వ్యవసాయం ఎంతో ఇష్టం..

పీవీకి వ్యవసాయం అంటే ఇష్టం. ఎంత బిజీగా ఉన్న వంగరకు వచ్చినప్పుడు వ్యవసాయం గురించి తెలుసుకునేవారు. పీవీ హుజూరాబాద్‌ కాంగ్రెస్‌ ఆఫీసు, హైదరాబాద్‌, ఎక్కడెక్కడో బాగా బిజీగా ఉండేటోళ్లు. పీవీ భార్య సత్తమ్మ వ్యవసాయం, ఇల్లు చూసుకుంట పిల్లలను సవరించేది. సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత పీవీ వంగరకు వచ్చి చాన రోజులు అక్కడే ఉన్నరు. వ్యవసాయంపై దృష్టి పెట్టారు. మా ఊరిలో నేను బాగా చేసేది. మొక్కజొన్న, సజ్జ విత్తనాల పంటలు పండించేది. అక్కడికి వచ్చి చూశారు. తర్వాత వంగరలో పత్తి విత్తనాలను సాగు చేయించారు. యాష్‌ ట్రేలను వాడి పుప్పొడి ప్రక్రియను పూర్తిచేయించారు. అలా వ్యవసాయంలో కొత్త ప్రయోగాలు చేస్తున్న రోజుల్లోనే ఢిల్లీలో రాజకీయాలు మారాయి. పీవీ వంగర నుంచి వెళ్లారు. రాజకీయాల్లో బిజీ అయి వ్యవసాయాన్ని వదిలారు. 

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement