e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home pvnr100years తాతే మా మార్గదర్శి..

తాతే మా మార్గదర్శి..

‘రాజకీయ జీవితంలో ఎంత బిజీగా ఉన్నా కుటుంబ విలువలకు, అనుబంధాలకు, ఆప్యాయతలకు పెద్దపీట వేసేవారు. పిల్లలకు ప్రతి విషయాన్ని గురించి విడమరచి చెప్పేవారు. ఆటలు ఆడేవారు. పుస్తకాలను చదవమని ప్రోత్సహించేవారు. ప్రతి ఒక్కరి యోగక్షేమాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండేవారు. ఒక్కమాటలో చెప్పాలంటే తాతనే మా జీవిత మార్గదర్శి’ అని అంటున్నారు పీవీ నరసింహారావు మనవరాలు, ఎమ్మెల్సీ వాణీదేవి కూతురు రజిత. పీవీ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని తాతతో తనకున్న జ్ఞాపకాలను ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్నారు.

తాతే మా మార్గదర్శి..

బోలెడన్ని జ్ఞాపకాలు
తాత పీవీతో గడిపిన ప్రతి క్షణమూ ఒక మధుర జ్ఞాపకమే. వేసవి సెలవులు వచ్చాయంటే నేనే కాదు, మా కజిన్స్‌ అందరం ఢిల్లీలో తాత వద్దకు చేరేవాళ్లం. ముఖ్యంగా తాత నన్ను రింగ్‌ లీడర్‌ అని పిలిచేవారు. రాజకీయాల్లో తాత ఎంత బిజీగా ఉన్నప్పటికీ మాతో బ్యాడ్మింటన్‌ ఆడేవారు. ఓపికగా, ఎవరినీ చిన్నబుచ్చకుండా ప్రతి ఒక్కరికీ తనతో ఆడే అవకాశం ఇచ్చేవారు. ఆటలో మెలకువలను నేర్చించేవారు. వేసవి సెలవు ముగింపులో మనవలు, మనవరాళ్ల అందరిచేత ఆ పర్యటన విశేషాలను ప్రత్యేకంగా వ్యాసాలను రాయించేవారు. వాటన్నిటినీ క్షుణ్ణంగా చదివి అందులో తప్పులను సరిదిద్దేవారు. వ్యాకరణ దోషాలను వివరించేవారు. అప్పుడు ఏమో అనుకునేవాళ్లం కానీ, ఆనాడు తాత ద్వారా నేర్చుకున్న ప్రతి అంశమూ నిత్యజీవితంలో ఇప్పుడు ఎంతో ఉపయోగపడుతున్నది.

అది మరచిపోలేని మధురానుభూతి
తాత ప్రధాని అయ్యాక ఆయనతో విదేశీ పర్యటనలకు వెళ్లాలని అందరం పోటీపడేవాళ్లం. కానీ, ఆయన మాత్రం ప్రభుత్వ సౌకర్యాలను వ్యక్తిగత ప్రయోజనాలకు వినియోగించుకోవాలని ఎప్పుడూ చూసేవారు కాదు. నిబంధనల పరిధిలోనే ప్రతి విదేశీ పర్యటనకు తనకు తోడుగా ఇద్దరిని మాత్రమే తీసుకెళ్లేవారు. అమ్మ వాణీదేవి మమ్మల్నందరినీ కో ఆర్డినేట్‌ చేస్తుండేవారు. స్కూల్‌ ఎగ్జామ్స్‌, ఇతర ముఖ్యమైన కార్యక్రమాలు ఏవీ మిస్‌ కాకుండా చూసి తాత వెంట ఎవరు వెళ్లాలనేది నిర్ణయించేవారు. అలా నేను తాతతో కలిసి జపాన్‌, నేపాల్‌, వియత్నాం వెళ్లాను. ఆ పర్యటనలు నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని జ్ఞాపకాలు. నేను తాతతో కలిసి మొదటగా జపాన్‌ పర్యటనకు వెళ్లాను. అక్కడ బొన్సాయ్‌ గార్డెన్‌లో పర్యటించాను. అదే విధంగా ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ కంపెనీని సందర్శించాం. ఆ విశేషాలను స్వయంగా నాకు వివరించారు. జపాన్‌ సంప్రదాయ దుస్తులైన కిమోనోను నేను ధరించగా అది చూసి తాత చాలా ముచ్చటపడ్డారు. విమానంలో తిరిగివచ్చేప్పుడు జపాన్‌ పర్యటనలో ఏం చూశాం? ఆ విశేషాలను రాసి పెట్టుకోమని చెప్పారు. నేనూ రాసి పెట్టాను. తాత చనిపోయిన తర్వాత ఆయన గదిని శుభ్రం చేస్తుండగా అక్కడి పేపర్లలో నా జపాన్‌ పర్యటన జర్నల్‌ను చూసి ఆశ్చర్యపోయాం. అప్పుడు తెలిసింది. మేమే కాదు, మాతో గడిపిన ప్రతి విషయాన్నీ తాత కూడా చాలా విలువైనదిగా భావించేవారని.

కుటుంబ విలువలకే ప్రాధాన్యం..
తాత ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా బంధువులే కాదు మానవ సంబంధాలకే విలువనిచ్చేవారు. పేద- ధనిక, తక్కువ- ఎక్కువ అనేది చూపేవారు కాదు. అందరినీ ఆప్యాయంగా పలకరించేవారు. ఎలాంటి రాజకీయ కార్యక్రమాలు లేకుంటే వివాహాది శుభకార్యాలన్నిటికీ హాజరయ్యేవారు. సామాన్యుల్లో సామాన్యుడిగా కలిసిపోయేవారు. కుటుంబసభ్యులనే కాదు తన సన్నిహితులు, స్నేహితులు అందరినీ పేరుపేరునా పలుకరించి యోగక్షేమాలను అడిగి తెలుసుకునేవారు. తాతను చూసి ‘పెద్దలతో ఎలా మాట్లాడాలి? ఎలా నడుచుకోవాలి? స్నేహితులతో ఎలా మెదలాలి? పిల్లలతో ఎలా ప్రవర్తించాలి?’ ఇలా అన్ని విషయాలనూ నేర్చుకున్నాం. మా జీవిత మార్గదర్శి తాతనే. అది మాకెంతో గర్వకారణం అనిపిస్తుంది.

తాతే మా మార్గదర్శి..

తాత చేతుల మీదుగానే నా పెళ్లి..
తాత ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్న మొదటి మనవరాలిని నేనే కావడం గర్వంగా ఉంది. వివాహ అనంతరం నేను, నా భర్త రాజేశ్‌ చికాగోలో స్థిరపడ్డాం. 1995లో తాత శస్త్రచికిత్స కోసం అమెరికా పర్యటనకు విచ్చేసినప్పుడు ఆయనకు తోడుగా ఉన్నాం. వైద్యచికిత్స అనంతరం చికాగోలోని మా ఇంటికి రావాలని ఆహ్వానించగా తాత సంతోషంగా ఒప్పుకొన్నారు. ఇంటికి వచ్చి నా పిల్లలు అర్ణవ్‌, ఆర్కేను చూసి ఆశీర్వదించారు. అది మాకు వ్యక్తిగతంగా ఎంతో ఆనందాన్నిచ్చిన సందర్భం.

కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు
తాత పీవీ దేశానికి చేసిన సేవలను ఇక్కడ అమెరికాలో చాలామంది వ్యాపారస్థులు, వృత్తి నిపుణులు ఎందరో చాలా గొప్పగా చెప్తుంటారు. ఇప్పటికీ ప్రధానిగా తాత తీసుకున్న నిర్ణయాలను గుర్తుచేసుకుంటుంటారు. కానీ మన దేశంలో చాలామంది తాతను మరచిపోయారు. అది మాకెంతో బాధను కలిగిస్తుండేది. కానీ, తాత పీవీ శతజయంతి ఉత్సవాలను ఏడాదిగా తెలంగాణలోనే కాకుండా వివిధ రాష్ర్టాల్లో, విదేశాల్లోనూ నిర్వహిస్తుండటం ఎంతో ఆనందంగా ఉంది. దేశానికి పీవీ చేసిన సేవలను భావితరాలకు తెలియజేసేలా కృషిచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నా ప్రత్యేక ధన్యవాదాలు.

ఇంటర్వ్యూ: మ్యాకం రవికుమార్‌
94929 10065

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
తాతే మా మార్గదర్శి..

ట్రెండింగ్‌

Advertisement