e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, October 17, 2021
Home pvnr100years పంచాయతీల కు ప్రాణదాత

పంచాయతీల కు ప్రాణదాత

నేడు దేశవ్యాప్తంగా పంచాయతీలకు ఐదేళ్లకోసారి ఎన్నికలు జరుగుతున్నాయి. సర్పంచులు, వార్డు మెంబర్లు ప్రజాప్రతినిధులుగా గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేసే అవకాశం లభిస్తోంది. గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం లేకుండా రాజ్యాంగబద్ధంగా నిధులు పంచాయతీలకు అందుతున్నాయి. కానీ.. 30ఏళ్లకు పూర్వం పరిస్థితి ఇందుకు భిన్నం. నిర్దిష్ట కాలపరిమితిలో ఎన్నికలు కూడా జరిగేవి కావు. గ్రామాల్లో భూస్వామ్య వ్యవస్థనే ఇంకా కొనసాగుతోందా అనే రీతిలో సామాజిక, రాజకీయ వాతావరణం నెలకొని ఉండేది. రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీ ఎన్నికల్ని తోచినప్పుడు నిర్వహించేవారు. పల్లెల్లో అస్తవ్యస్త పాలన రాజ్యమేలేది. కానీ నేడు పల్లెలు అభివృద్ధికి నోచుకుంటున్నాయంటే పూర్వ ప్రధాని పీవీ నరసింహారావు చూపిన మార్గమే కారణం.

దేశ సమగ్రాభివృద్ధికి పూర్వ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు బాటలు వేశారు. ఓ వైపు పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టిస్తూనే… పల్లెల స్థితిగతుల్ని సమూలంగా మార్చాలని నిర్ణయించారు. ఇందుకు బైపాస్‌ మోడల్‌ తీసుకొచ్చారు. ఆర్థిక వనరుల్ని రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం లేకుండా గ్రామాలకు నేరుగా మళ్లించి… అభివృద్ధిని వికసింప చేయాలని నిర్ణయించారు. ఆ ఆలోచనల ఫలితంగానే పంచాయతీరాజ్‌ చట్టాల్లోనూ సంస్కరణలు చేశారు. పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లు -1991( 72వ రాజ్యాంగ సవరణ బిల్లు) 1992 డిసెంబర్‌ లో పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందింది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత 1993 ఏప్రిల్‌ 20 నుంచి చట్టం అమల్లోకి వచ్చింది. గ్రామ పంచాయతీలకు అధికారాల్ని బదలాయించేందుకు ఉద్దేశించిన 73వ రాజ్యాంగ సవరణ చట్టం కూడా 1993 ఏప్రిల్‌ 24 నుంచి అమల్లోకి వచ్చింది.

- Advertisement -

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 40 ప్రకారం గ్రామ పంచాయతీలు స్థానిక ప్రభుత్వాలుగా కీలకంగా వ్యవహరించాలి. కానీ… ఐదు దశాబ్దాల పాటు పాలకులు ఆ అధికారాల్ని ఆచరణలోకి తీసుకురాలేకపోయారు. గ్రామీణ భారతంలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయకుండా… దేశంలో ప్రజాస్వామ్యం బలోపేతం కాదని పీవీ విశ్వసించారు. అధికారాల వికేంద్రీకరణతోనే సమగ్ర అభివృద్ధి సాధించేలా విస్తృత స్థాయి సంప్రదింపులు జరిపారు. దేశ నిర్మాణంలో గ్రామాల్ని భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతోనే పంచాయతీరాజ్‌ సవరణ చట్టాలు తీసుకొస్తున్నామని.. రాష్ట్ర ప్రభుత్వాల అధికారాల్లోకి చొరబడటం లేదని ముఖ్యమంత్రులందరినీ ఒప్పించారు. సమాఖ్య స్ఫూర్తి తో, సర్వసమ్మతితో చట్టాల్ని అమల్లోకి తీసుకొచ్చారు.

రాజ్యాంగ సవరణల ద్వారా పీవీ హయాంలో గ్రామాలకు అధికారాలు, ఆర్థిక వనరుల్ని బదలాయించారు. దేశ నిర్మాణంలో గ్రామాల్ని భాగస్వామ్యం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు అమల్లోకి తీసుకొచ్చారు. నిర్దిష్ట కాలపరిమితితో క్రమం తప్పకుండా ఎన్నికలు నిర్వహించేలా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలకు సముచిత భాగస్వామ్యం కల్పించేలా నిబంధనలు పెట్టారు. అధికారంలో భాగస్వాములు కావడం ద్వారా ఆయా వర్గాలు పురోగతి చెందుతాయని పీవీ విశ్వసించారు. పంచాయతీరాజ్‌ సంస్థలకు రాజ్యాంగబద్ధత కల్పించారు.

పంచాయతీరాజ్‌ చట్ట సవరణ ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల తప్పనిసరి రాజ్యాంగ నిబంధనగా అమలులోకి వచ్చింది. గ్రామ పంచాయతీల స్థితిగతుల్ని కేంద్రానికి నివేదించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సంఘాల్ని ఏర్పాటు చేసుకోవాలని 1993 జులై 3న జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో పీవీ దిశానిర్దేశం చేశారు. పంచాయతీలకు క్రమం తప్పకుండా ఎన్నికలు జరగాలని, అప్పుడే వ్యవస్థలపై ప్రజలకు విశ్వాసం పెరుగుతుందని చెప్పారు. ఇందుకోసం స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతను నిర్వర్తించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

పంచాయతీరాజ్‌ చట్ట సవరణ వంటి విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా పీవీ చాలా నిరాడంబరంగా వ్యవహరించారు. అధికారాల బదలాయింపు అనేది మా గొప్పదనమేమీ కాదు, ప్రజాస్వామిక వ్యవస్థలో, రాజ్యాంగ స్ఫూర్తితోప్రజల అధికారాల్ని ప్రజలకు తిరిగి కట్టబెడుతున్నాం అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పంచాయతీరాజ్‌ సవరణ చట్టంలో రాష్ట్ర ప్రభుత్వాలు తమకు అనుగుణమైన మార్పులు చేసుకొని, చట్టాలుగా రూపొందించుకునే వెసులుబాటు కల్పించారు. కానీ కచ్చితంగా అమలు చేయాల్సిన నిబంధనలు మాత్రం యథాతథంగా ఉండాలని స్పష్టంచేశారు. నూతన చట్టం ద్వారా కొత్తగా రాజకీయాలతో పరిచయం లేని వ్యక్తులు పాలన వ్యవస్థలోకి అడుగుపెట్టారు. బల హీన వర్గాల నుంచి ఎంతోమందికి ప్రాతినిధ్యం లభించింది.

చట్టాలు రూపొందించిన తర్వాత తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనని, లేదంటే ప్రజలకు ప్రభుత్వాలపై విశ్వాసం పోతుందని, ఇది ప్రమాదకర పరిణామమని పంచాయతీరాజ్‌ సవరణ చట్టం అమలు సందర్భంగా పదేపదే చెప్పారు. గ్రామస్థాయిలో ఎవరు గెల్చినా… ఎవరు ఓడినా అందరూ కలిసి అభివృద్ధి బాటలో పయనించాలని పిలుపునిచ్చారు. నేడు గ్రామ పంచాయతీల స్వరూప స్వభావాలు, స్వయం పాలన విధానాలు, ఆదర్శ గ్రామాలుగా దాటుతున్న మైలురాళ్లు… వాటన్నింటికీ మార్గం వేసింది…. పీవీ తీసుకొచ్చిన పంచాయతీరాజ్‌ సవరణ చట్టమే. దేశానికి పల్లెలే పట్టుకొమ్మలు అని మహాత్మాగాంధీ అంటే… బాపూజీ కలలు కన్న గ్రామస్వరాజ్య స్థాపనకు బాటలు వేసిన ఘనత పీవీ నరసింహారావుకే దక్కుతుంది.

పీవీ ప్రభాకర్‌ రావు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement