e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home pvnr100years భూమి పుత్రుడు

భూమి పుత్రుడు


ఉమ్మడి రాష్ట్రంలో పీవీ చేసిన సంస్కరణలు చిరస్మరణీయం. ఆ మహానుభావుడు అందించిన భూ సంస్కరణలు, ప్రత్యేకంగా తెలంగాణలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చాయి. ఇప్పుడు అందరూ ఆ ఫలాలు అనుభవిస్తున్నారు. మంథని శాసనసభ్యుడిగా పీవీ మానేరు నదిపై వారధిని నిర్మింపజేసి, ఆ ప్రాంతం వారికి ఎనలేని సౌకర్యం కల్పించారు. ఈ వారధి మంథని, కాళేశ్వరం, మహదేవపురం ప్రాంతంలో మరెన్నో అభివృద్ధి పనులకు కారణమైంది. ఈ శతజయంతి ఉత్సవాల సందర్భంగా, నేను పీవీతో కలిసిన సందర్భాలు గుర్తుకు వస్తున్నాయి. ఆయనలో చూసిన విశిష్ట వ్యక్తిత్వం, ఎంతటివారినైనా సమున్నతంగా ప్రేమానురాగాలతో గౌరవించటం ఎన్నటికీ మరిచిపోలేనిది. ఆయనతో గడిపిన స్మృతులను స్మరించుకోవడం నా జీవిత అదృష్టంగా భావిస్తున్నాను.

భూమి పుత్రుడు

నేను సింగరేణిలో డిప్యూటీ సూపరింటెండెంట్‌గా గోదావరిఖని ప్రాంతంలో పని చేశాను. సింగరేణిలో ఉద్యోగం రాకముందు 1982లో దాదాపు ఏడాది పాటు ఓ దినపత్రికకు విలేకరిగా పనిచేశాను. 1973లో మా కొలనూరు పక్క ఊరైన పెగడపెల్లిలో ఓ పెండ్లి వేడుకలో నేను మొదటిసారి పీవీని చూశాను. అప్పుడు ఆయన పార్లమెంటు సభ్యులు. ఆ సందర్భంగా ఆయనను కలవడానికి చుట్టుపక్కల గ్రామాలనుంచి చాలామంది వచ్చారు. ఈ సందర్భంగా పీవీ ఆయా గ్రామాల్లో ఉన్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. పీవీ మాటలు నాకిప్పటికీ గుర్తున్నాయి. ఊళ్లో ఏ సమస్య ఉన్నా అది మన సమస్య అనుకోవాలని, ఆ సమస్య పరిష్కారమయ్యేవరకు ఊరి ప్రజలు కలిసికట్టుగా పోరాడాలని సూచించారు. ఆ తర్వాత పీవీతో అందరం కలిసి బంతి భోజనాలు చేశాం. ఆయన అంత పెద్ద హోదాలో ఉండికూడా మాతో బంతిభోజనం చేయ డం ఇప్పటికీ నాకో తీపి గుర్తు. ఆ తర్వాత, కరీంనగర్‌లో బహుశా 1980లో కళాభారతిలో జరిగిన ఒక సమ్మేళనానికి పీవీ హాజరయ్యారు. ఆయనతో పాటు ప్రముఖ కవి సి.నారాయణ, వి.హన్మంతరావు హాజరయ్యారు. ఆ సభలో పీవీ ఇచ్చిన సాహిత్య ఉపన్యాసం నన్ను కట్టి పడేసింది.

మళ్లీ ఒకసారి కరీంనగర్‌లో ప్రస్తుతం ఉన్న కలెక్టర్‌ భవన సముదాయం శంఖుస్థాపన కార్యక్రమానికి పీవీ హాజరైనారు. ఆ సందర్భంగా పీవీ పలికిన మాటలు నా చెవుల్లో ఇప్పటికింకా గింగురుమంటున్నాయి. శంఖుస్థాపన కార్యక్రమం నుంచి మధ్యలో వరంగల్‌ కాకతీయ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి హాజరయ్యేందుకు వెళ్లిపోతూ, ఈ కార్యక్రమానికి వరంగల్‌ నుంచి కరీంనగర్‌ వచ్చానని వినమ్రంగా చెప్పిన తీరు అందరినీ కదిలించింది.

1982లో అప్పుడు జరిగిన శాసనసభ ఎన్నికల సందర్భంగా పీవీ పనుకంటి కిషన్‌రావుతో కలిసి మంథని నుంచి హైదరాబాద్‌ వెళ్తూ మధ్యలో పెద్దపల్లి విశ్రాంతి భవనంలో కొంచెం సేపు ఆగారు. నేను ఓ విలేకరిగా వెళ్లి పీవీతో చాలాసేపు గడిపాను. ఆయన నా యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానిగా పీవీని నేను ఢిల్లీలో రెండుసార్లు కలిశాను. నేను, నాతోపాటు ఇంకో నలుగురు బంధువులు ఆయనను కలవడానికి ఢిల్లీలోని వారి నివాసానికి వెళ్లాం. మేము వచ్చామని తెలిసి సాదరంగా ఆహ్వానించి అందరినీ పేర్లతో సహా పిలిచి ఆప్యాయంగా మాట్లాడారు. అందరినీ అన్నం తినమంటూ చెప్పి, పార్లమెంట్‌ సమావేశాలకు ఆలస్యమవుతుందంటూ వెళ్లిపోయారు. ప్రధాని హోదాలో ఉండికూడా సామాన్యులమైన మాకు ఆయన ఇచ్చిన గౌరవాన్ని ఎప్పటికీ మర్చిపోలేము. ‘ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే’ అనే సామెత పీవీకి సరిగ్గా సరిపోతుందని అనిపించింది. ఎం త ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే నిజమైన తెలంగాణ భూమి పుత్రు డు పీవీ. ఆయన మన దేశానికి ప్రధానిగా వ్యవహరించడం మనందరికీ గర్వకారణం. వారి జీవితం భావితరాలకు ఆదర్శం.

దండంరాజు
రాంచందర్‌ రావు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
భూమి పుత్రుడు

ట్రెండింగ్‌

Advertisement