పెద్దపల్లి, నవంబర్ 22(నమస్తే తెలంగాణ): బంజేరుపల్లిలో దాదాపు 60మంది రైతులు 40ఎకరాల్లో బీర, చిక్కుడు పండిస్తున్నారు. బీర విత్తనాలను విత్తిన పది రోజులకు చిక్కుడు విత్తనాలను వేస్తారు. బీర మొలవగానే వాటికి పబ్బులను నాటుతారు. నెలన్నరకు కాత మొదలై మరో నెలన్నర వరకు పూర్తిగా కాత కాస్తుంది. ఈ చెట్లు ఉడిగిపోయే లోపే తీగ చిక్కుడు కాత మొదలవుతుంది. దీంతో ఉడిగిపోతున్న బీర తీగలను తొలగించి చిక్కుడు సమృద్ధిగా పబ్బులకు పారేలా చేస్తారు. చిక్కుడు ప్రధాన పంటగా 3నెలల వరకు కాస్తుంది. వారానికి ఒక ఎకరంలో నాలుగు క్వింటాళ్ల వరకూ కాత చేతికి వస్తున్నది. నిన్నమొన్నటి వరకు ఇక్కడి నుంచి మార్కెట్లకు పెద్ద ఎత్తున బీర కాయలు దిగుమతి కాగా, ప్రస్తుతం చిక్కుడు కాయ మార్కెట్లను ముంచెత్తుతున్నది. ప్రతిరోజూ 10 క్వింటాళ్ల వరకు చిక్కుడు కాయలను స్థానికంగా వచ్చే వ్యాపారులకు విక్రయిస్తుండగా, మరో 10క్వింటాళ్ల వరకు కరీంనగర్, చొప్పదండి, జగిత్యాల, ధర్మపురి పెద్దపల్లి, ధర్మారం, మంచిర్యాల, లక్షెట్టిపేట మార్కెట్లకు తరలిస్తున్నారు. కూరగాయలకు ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో రైతులు లాభాల బాటలో పయనిస్తున్నారు.
ఎకరం చిక్కుడు ఆరెకరాల వరితో సమానం
ఎకరం చిక్కుడు పంట ఆరెకరాల వరితో సమానమైన లాభాలను ఇస్తుంది. ఒక ఎకరం వరి పంటకు విత్తనాలు, ఎరువులు, సాగుకు 17వేలు ఖర్చవుతుంది. పంట కాలం 120-160రోజులు. దిగుబడి ఎకరాకు అత్యధికంగా 32క్వింటాళ్లు, అత్యల్పంగా 24క్వింటాళ్లు వస్తుంది. సరాసరిగా 28క్వింటాళ్లుగా భావిస్తే రైతుకు 54, 880ఆదాయం వస్తుంది. ఖర్చులు పోను రైతన్నకు 37, 000లు మాత్రమే మిగులుతుంది. కానీ ఒక ఎకురంలో బీర, చిక్కుడులు అంతర పంటగా వేస్తే ఖర్చులు అన్నీ పోను బీరతో సరాసరి 75వేల నుంచి 1,25,000 వరకు, చిక్కుడుతో రూ. 80వేల నుంచి 1,30,000 వరకు వస్తుంది. మొత్తంగా బీర, చిక్కుడుతో 2లక్షల నుంచి 2లక్షల 10వేల వరకు ఆదాయం లభిస్తుంది. వరి ఆరెకరాలు పండిస్తే వచ్చే 2లక్షల 22వేలతో సమానంగా ఉంటుంది.
రైతుల వద్దకే వచ్చి కొనుగోలు
బీర, చిక్కుడును కొనేందుకు వ్యాపారులు నేరుగా గ్రామానికే వస్తున్నారు. కాంటాలు, ఆటోలను తీసుకొని వచ్చి కొనుగోలు చేస్తున్నారు. మంచి కాత ఉంటే ఆ రైతుల వద్ద పోటీపడి కొనుగోలు చేస్తున్నారు. సరైన ధర రాలేదని భావించిన రైతులు నేరుగా కరీంనగర్ మార్కెట్‌కు తరలించి అక్కడ హోల్ సేల్‌గా విక్రయిస్తున్నారు.
ఖర్చులు ఎల్లిపోతై..
మేం వరి వేస్తం. కానీ కూరగాయలు కూడా పండిస్తం. బీర, చిక్కుడు పెట్టినం. బీర కాత అయిపోంగనే చిక్కుడు కాతకు వస్తది. మంచి లాభమే ఉన్నది. మళ్ల ధర తగ్గుతున్నది. నేను, నా కోడలు బీర, చిక్కుడు తెంపుతం. నా కొడుకు మార్కెట్‌కు పోయి అమ్ముకస్తడు. అట్లా మా కుటుంబ ఖర్చులన్నీ ఈ పంటతోటే ఎల్లిపోతున్నయ్. చిక్కుడు సాగు చేస్తే రోజు చేతిల పైసలు కనిపిస్తయ్. వరి పండిస్తే ఒక్క సారే పైసలు కనిపిస్తయ్. రోజో దిక్కు చిక్కుడు కోసి అమ్ముతం. నేను చిక్కుడు ఎకరంల వేసిన. అన్ని ఖర్చులు పోను వరికంటే నాలుగింతలు ఎక్కువనే పైసలు వత్తున్నయ్. రైతులు గిసొంటి పంటలేత్తెనె లాభం.