e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, July 27, 2021

నిండిన జల వనరులు

జిల్లావ్యాప్తంగా వర్షాలు
మత్తడి దుంకిన చెరువులు, కుంటలు
ఉధృతంగా ప్రవహిస్తున్న హుస్సేన్‌మియా వాగు l గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

పెద్దపల్లి రూరల్‌, జూలై 22: జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. పలు చెరువులు, కుంటలు మత్తడి దుంకాయి. పెద్దపల్లి మండలంలో 16.2 మి.మీ వర్షపాతం నమోదైంది. వర్షాలతో పెద్దపల్లి మండలం దస్తగిరిపల్లి-కొత్తపల్లి మధ్య రోడ్‌ డ్యాంపై నుంచి, రాఘవాపూర్‌ రోడ్‌ డ్యాంపై నుంచి వరద నీటి ప్రవాహంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పెద్దపల్లి- మారేడుగొండ మధ్య జగన్నాథపురం వద్ద రోడ్‌ డ్యాంపై నుంచి వరద నీరు ప్రవాహంతో పెద్దపల్లి- కాల్వశ్రీరాంపూర్‌ మధ్య రాకపోకలు కొద్ది సమయం నిలిచిపోయాయి. వర్షాల పరిస్థితిని తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఎంపీడీవో రాజు, సంబంధిత శాఖల అధికారులు సమీక్షించారు. సబ్బితంలోని గట్టు సింగారం శివారులోని గౌరీగుండాల జలపాతం సందర్శనను కరోనా నేపథ్యంలో నిషేధించారు. అయినా సందర్శకులు వస్తున్న విషయాన్ని స్థానికులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో డీపీవో చంద్రమౌళి, ఎంపీడీవో రాజు, ఎంపీవో సుదర్శన్‌ వెళ్లి పరిశీలించారు. వెంటనే చర్యలు చేపట్టాలని బసంత్‌నగర్‌ ఎస్‌ఐ దృష్టికి తీసుకెళ్లామని ఎంపీడీవో తెలిపారు.
జ్యోతినగర్‌(రామగుండం), జూలై 22: ఎన్టీపీసీ మూడో డివిజన్‌ న్యూపోట్‌పల్లిలో దయ లింగమ్మ అనే వృద్ధురాలి ఇంట్లోకి వరద నీరు రావడంతో నిత్యావసరాలు తడిసిపోయాయి, డివిజన్‌లోని జంగాలపల్లిలో రోడ్లమీదకు వరద నీరు చేరడంతో కాలనీవాసులు ఇంటి నుంచి బయటికి రాలేదు. అలాగే రెండో డివిజన్‌ ఇందిరమ్మకాలనీలో ఇండ్ల చుట్టు చేరిన వర్షం నీటితో ప్రజలు ఇబ్బందిపడ్డారు.
ముత్తారం,జూలై 22: ఖమ్మంపల్లి, ఓడేడు, పారుపల్లి, ముత్తారం శివారులోని మానేరు నది నిండుగా ప్రవహిస్తున్నది. గ్రామాల్లోని కుంటలు, చెరువులు, చెక్‌ డ్యాంలు నిండాయి.
మంథని టౌన్‌/మంథని రూరల్‌, జూలై 22: నల్లటి మబ్బులు కమ్ముకొని, ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తుండడంతో ప్రతి ఒక్కరూ ఇండ్లకే పరిమితమయ్యారు. మంథని పట్టణంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో చెరువులు, కుంటలు జలకళ సంతరించుకోగా, పొలాల్లోకి నీరు చేరుతున్నది. బుధవారం ఉదయం 8:30 గంటల నుంచి గురువారం ఉదయం 8:30 గంటల వరకు మంథని డివిజన్‌లో 16.1 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కమాన్‌పూర్‌లో 5.57 సెంటీమీటర్ల వర్షం కురువగా, అత్యల్పంగా మంథనిలో 2.36 సెంటీమీటర్ల వర్షం పడింది. ముత్తారంలో 3.72 సె.మీ, రామగిరిలో 4.45 సె.మీ వర్షం కురిసినట్లు అధికారులు వెల్లడించారు.
ఓదెల, జూలై 22: మండలంలోని చిన్న చిన్న చెరువులు, కుంటలు మత్తడులు పడుతున్నాయి. వాననీటితో పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. ప్రస్తుతం వరినాట్ల సీజన్‌ కావడంతో రైతులు వర్షంలోనే పనులు సాగిస్తున్నారు. గొడుగులు, పాలిథిన్‌ కవర్లను కట్టుకొని బయటికి వెళ్తున్నారు. వర్షానికి తోడు చలి గాలులు వీస్తుండడంతో వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు.
కోల్‌సిటీ, జూలై 22: మూడు రోజులుగా కురుస్తున్న వర్షంతో గోదావరిఖని నగరంలోని పలు డివిజన్లు జలమయంగా మారాయి. పలు దిగువ ప్రాంతాల్లో వర్షం నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. విరామం లేకుండా కురుస్తున్న వర్షంతో జనం కూడా బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. ఫైవింక్లయిన్‌, విఠల్‌నగర్‌, 7బీ కాలనీ, తిలక్‌నగర్‌ డౌన్‌, ద్వారకానగర్‌, సంజయ్‌నగర్‌, సీతానగర్‌, సప్తగిరి కాలనీ, అడ్డగుంటపల్లితోపాటు పలు ప్రాంతాల్లోని ఇండ్లలోకి వర్షం నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులకు గురయ్యారు. సీతానగర్‌ సమీపంలోని 2ఏ బ్రిడ్జి వద్ద వర్షం నీరు ప్రవహించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కళ్యాణ్‌నగర్‌ బజార్‌ రోడ్లపై వర్షం నీళ్లు మోకాళ్ల లోతులో ప్రవహించాయి.
ఎలిగేడు, జూలై 22: మండలంలోని చెరువులు, కుంటలు నిండుతున్నాయి. వరినాట్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రైతులు పొలాలకు వెళ్తున్నప్పుడు, ప్రజలు ఆటోలు, ద్విచక్ర వాహనాలతో వాగులు దాటుతున్నప్పుడు జాగ్రత్తలు పాటించాలని జూలపల్లి ఎస్‌ఐ షేక్‌ జానీపాషా సూచించారు. శిథిలావస్థకు చేరిన ఇండ్లలో నివాసముండే వారికి సర్పంచులు సూచనలు ఇచ్చారు. ఎలిగేడు సర్పంచ్‌ బూర్ల సింధూజ గ్రామంలో ఇండ్లను పరిశీలించాలని తమ సిబ్బందిని ఆదేశించారు. గతంలో కురిసిన వానలకు ఎలిగేడు, సుల్తాన్‌పూర్‌, బురహన్‌మియాపేట, శివపల్లి, నర్సాపూర్‌ తదితర గ్రామాల్లో పాత ఇండ్లు కూలిన విషయం తెలిసిందే.
ధర్మారం, జూలై 22: వర్షానికి తోడు చల్లటి వాతావరణం ఉండడంతో ఇండ్ల నుంచి జనం బయటికి రావడం లేదు. నర్సింహులపల్లి, కానంపల్లిలో వొర్రెలు, చెక్‌డ్యామ్‌ల మీదుగా వరద నీరు పారుతున్నది. కొత్తూరు శీతల వారి కుంట, మద్దుల కుంట, ఆవ కుంట, తూము కుంట, మాటు కుంటలు నీటితో నిండి మత్తళ్ల నుంచి దూకుతున్నట్లు సర్పంచ్‌ తాళ్ల మల్లేశం తెలిపారు. మండల వ్యాప్తంగా గ్రామాల్లో ఉన్న చెరువులు, కుంటల్లోకి వరద నీరు వచ్చి చేరుతున్నది. బుధవారం 18 మి.మీ వర్షం కురువగా, గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు 58 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని మండల సహాయ గణాంక అధికారి స్వప్న తెలిపారు.
కాల్వశ్రీరాంపూర్‌, జూలై 22 : చిన్నరాత్‌పల్లి-పెద్దరాత్‌పల్లి మధ్య హుస్సేన్‌మియా వాగు నిండుగా పారుతున్నది. కూనారం పెద్దచెరువు మత్తడి దూకుతున్నది. జాఫర్‌ఖాన్‌పేటలో శ్రీరామపాద సరోవర్‌ ప్రాజెక్టు, ఊరచెరువు పూర్తిగా నిండి మత్తడి పడడంతో జాఫర్‌ఖాన్‌పేట-మంగపేట మధ్యన మద్దులవాగుపై ఉన్న కల్వర్టు మీది నుంచి వరద నీరు భారీగా ప్రవహిస్తున్నది. మొట్లపల్లి దొమ్మటి కుంట, వెన్నంపల్లి పెద్ద చెరువు, నల్లచెరువు మత్తడి పడుతుండగా, కుంటలు సగం వరకు నిండడంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హుస్సేన్‌మియా ఉధృతి కారణంగా పరీవాహక ప్రాంతం వెంట ఉన్న రైతులు అప్రమత్తమయ్యారు. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్‌ సునీత, ఎస్‌ఐ వెంకటేశ్వర్‌ సూచించారు. వ్యవసాయ మోటర్లు, విద్యుత్‌ స్తంభాలు తాకవద్దని ట్రాన్స్‌కో అధికారులు కోరారు.
జూలపల్లి, జూలై 22: వర్షం కారణంగా మండలంలోని లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లలోకి వరద నీరు ప్రవేశించి ప్రజలు ఇబ్బంది పడ్డారు. వడ్కాపూర్‌- ధూళికట్ట మధ్య హుస్సేన్‌మియా వాగు పై వంతెన వరద నీటి ప్రవాహంతో మునిగి పోవడంతో ఆ మార్గంలో రాకపోకలకు స్తంభించిపోయాయి. కుంటలు, చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పెద్దాపూర్‌లో ఓ ఇల్లు కూలిపోయింది. 18.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు డీటీ శ్రీకాంత్‌ తెలిపారు.
నిలిచిన బొగ్గు ఉత్పత్తి
రామగిరి, జూలై 22 : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఆర్జీ -3 డివిజన్‌లోని ఓసీపీ -1,2లో బొగ్గు ఉత్పత్తి నిలిచి పోయింది. ప్రాజెక్ట్‌ క్వారీల్లో నీళ్లు చేరడంతో యంత్రాలు నిలిచిపోయి ఉత్పత్తికి ఆటంకం ఏర్పడిందని అధికారులు తెలిపారు. ఓసీపీల్లో రోజూ 20 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లుతున్నట్లు వివరించారు.
యైటింక్లయిన్‌ కాలనీ, జూలై 22: ఆర్జీ-2 పరిధిలోని ఓసీపీ-1లో రోజూ 50వేల క్యూబిక్‌ మీటర్ల ఓబీతోపాటు 12వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి, ఓసీపీ-3లో 1.65లక్షల క్యూబిక్‌ మీటర్ల ఓబీతోపాటు 23టన్నులు బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది.
గోదావరినది పరిశీలన
మంథని టౌన్‌, జూలై 22: మంథని గోదావరి నదిని మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు. వర్షాలతో గోదావరిలో నీటి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో తీరం వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన స్నానాల గదులు, విగ్రహాలను సిబ్బందితో తీయించారు. గోదావరి సమీపంలో నివసిస్తున్న కుటుంబాన్ని అక్కడి నుంచి వెళ్లి పోవాలని సూచించారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement