శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Peddapalli - Feb 23, 2021 , 03:14:31

లంబాడీతండా మురిసింది

లంబాడీతండా మురిసింది

  • నాడు కనీస వసతుల్లేక ఆగమైన తండా
  • స్వరాష్ట్రంలో కొత్త పంచాయతీతో జీవం
  • ప్రగతితో ఒక్కసారిగా మారిన రూపురేఖలు
  • ఏడాదిన్నరలోనే దశాబ్దాలనాటి దారిద్య్రం దూరం
  • నెలనెలా నిధులతో అనేక అభివృద్ధి పనులు
  • ఆదర్శంగా నిలుస్తున్న గ్రామం

లంబాడీతండా దారిద్య్రం తీరింది. ఏండ్లనాటి రోడ్డు వ్యథ దూరమైంది. ఒకప్పుడు వానకాలం వచ్చిందంటేనే ఊరు బిక్కుబిక్కుమనేది. ఎత్తయిన ప్రాంతంలో ఉండడంతో వర్షపు నీరు ఊరు చుట్టూ చేరి చుట్టు పక్కల గ్రామాలతో సంబంధాలు తెగిపోయి చీకట్లో మగ్గేది. బయటకు వెళ్లేదారిలేక నరకం చూసేది. కానీ, స్వరాష్ట్రం వచ్చాక గోస తీరింది. ఊరు నుంచి నాంసానిపల్లి వయా ఓదెల మండల కేంద్రానికి రోడ్డు వేయగా, కొంత స్వాంతన కలిగింది. ఇటీవల పల్లె ప్రగతిలో భాగంగా తండా నుంచి కొలనూర్‌ దాకా 1.64కోట్ల వ్యయంతో మూడు కిలోమీటర్ల మేర తారు రోడ్డు వేయడంతో రవాణా సౌకర్యం పెరిగింది. ఇంటి ముందటికే భగీరథ జలాలు రావడంతో మైళ్లకు మైళ్లు పోయి బావుల నుంచి నీళ్లు తెచ్చుకునే గోస పోయింది. ఇంకా అనేక పనులతో గ్రామం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుండగా, స్థానిక ప్రజానీకం సంబురపడుతున్నది.

లంబాడీ తండా. ఓదెల మండలంలో అతి చిన్న గ్రామం. 500 జనాభా.. 62 నివాస గృహాలు.. 240 మంది ఓటర్లతో ఉంటుంది. ఇది గతంలో నాంసానిపల్లిలో విలీన గ్రామంగా పంచాయతీకి మూడు కిలోమీటర్ల దూరంలో ఉండేది. సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురైంది. నీటి వసతి లేక అల్లాడేది. బిందెలు పట్టుకొని కిలోమీటర్ల కొద్దీ నడిచి వ్యవసాయ బావుల్లోని నీటితో దప్పిక తీర్చుకునేది. ఇంకా గ్రామంలో అనేక సమస్యలతో సతమతమయ్యేది. కానీ స్వరాష్ట్రంలో, పరిస్థితి పూర్తిగా మారింది. మూడేళ్ల కింద కొత్త గ్రామ పంచాయతీగా ఆవిర్భవించి, గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు వేసింది. కొత్త జీపీగా ఏర్పడిన తర్వాత గ్రామస్తులంతా పంచాయతీ పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇంటింటికీ మరుగుదొడ్డితోపాటు గ్రామంలో సామూహిక మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. మురుగు నీటికి చెక్‌పెట్టి భూగర్భజలాల పెంపునకు ఇంటింటికీ ఇంకుడుగుంతలే కాదు, ఐదు కమ్యూనిటీ ఇంకుడుగుంతలు నిర్మించుకున్నారు. దాంతో వంద శాతం ఓడీఎఫ్‌ గ్రామంగా నిలిచింది. హరితహారం కింద 7,200 మొక్కలను పెంచుతుండగా, అవి ఏపుగా పెరిగి నీడనిస్తున్నాయి. ఇంకా మంకీ ఫుడ్‌ కోర్టు ఏర్పాటు చేసుకుని పండ్ల మొక్కలు కూడా పెంచుతున్నారు. ప్రతి ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారు. నాడు నీటి కోసం గోసపడ్డ తండా జనం ఇవ్వాళ ఇంటింటికీ చేరుతున్న శుద్ధమైన మిషన్‌ భగీరథ జలాలను చూసి మురిసిపోతున్నది. ఇంత మేలు చేసిన సీఎం కేసీఆర్‌ను వేనోళ్లలా కీర్తిస్తున్నది. 

నీటి కోసం మస్తు గోసపడ్డం.. 

మాది లంబాడీ తండా. గతంల మాకు నీళ్ల సౌలతి లేకపోయేది. బిందెలు, డబ్బాలు పట్టుకొని చానా దూరం పోయి బాయిలల్ల నీళ్లు తెచ్చుకొని తాగేది. ఇట్ల ఏండ్లపడంత్రం ఇబ్బందులవడ్డం. కానీ తెలంగాణ అచ్చినంక మా బతుకులు బాగుపడ్డయి. మా తండాను పంచాయతీ చేసిండ్రు. రోడ్లు ఏసిండ్రు, ఇంటింటికీ భగీరథ మంచి నీళ్లు ఇత్తుండ్రు. మా చిన్నప్పటి బాధలు యాదికి అత్తే ఏడుపు అత్తది. ఇప్పుడు కేసీఆర్‌ సార్‌ మా తండాల అన్ని సౌలతులు చేసినందుకు సంతోషంగా ఉంది. వారం కింద మా తండా నుంచి కొలనూర్‌ పోయేందుకు కొత్తగా డాంబర్‌ రోడ్డు ఏసిర్రు. అక్కడి నుంచి ఏటైనా పోవచ్చు. ఇగ మాకు ఏ బాధలు లేవు. 

 ప్రగతిలో పరుగులు.. 

పల్లె ప్రగతితో ఆ పల్లె ముఖ చిత్రమే పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు పారిశుధ్య లోపంతో మగ్గిన తండాలో ఇప్పుడు నిత్య పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రోడ్లు, ఇండ్ల బయట చెత్త వేయకుండా పంచాయతీ ఆధ్వర్యంలో కట్టడి చేసుకున్నారు. ఇంటింటికీ చెత్త బుట్టలు పంపిణీ చేశారు. గ్రామంలో డంప్‌ యార్డు, వైకుంఠధామం నిర్మాణ పనులు చివరిదశకు వచ్చాయి. గ్రామంలో సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టంను చేశారు. కొలనూర్‌ ప్రధాన రహదారి నుంచి లంబాడీతండాకు 1.64 కోట్లతో మూడు కిలోమీటర్ల తారురోడ్డు నిర్మాణం చేపట్టగా, వారం క్రితమే పూర్తయింది. 

 ‘పల్లె ప్రగతి’తోనే అన్ని సౌలతులు 

గతంలో మాపై సవతి తల్లి ప్రేమే ఉండేది. ఏ పనికైనా నాంసానిపల్లికి పోవడానికి మాకు చాన బాధ అయ్యేది. రోడ్ల మీద లైట్లు ఉండేవి కాదు, మురుగుకాల్వలు తీసేటోళ్లు కాదు. కానీ, మా తండా పంచాయతీగా మారిన తర్వాత అభివృద్ధి బాట పట్టింది. పల్లె ప్రగతి తేవడంతో మా గ్రామం మారిపోయింది. ఇప్పుడు మా ఊరు బాగు కోసం మా గ్రామస్తులందరం కలిసి పని చేసుకుంటున్నం. మా ఊరిని అన్ని విధాలా అభివృద్ధి చేసుకుంటున్నం.

VIDEOS

logo