బుధవారం 24 ఫిబ్రవరి 2021
Peddapalli - Jan 27, 2021 , 03:25:00

అన్నింటా మనమే స్ఫూర్తి

అన్నింటా మనమే స్ఫూర్తి

  • స్వచ్ఛత, సంక్షేమం, అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచాం 
  • కొత్త జిల్లాగా ఏర్పాటుతో అద్భుత ఫలితాలు
  • అందరి సహకారం, కృషితోనే సాధ్యం 
  • పెద్దపల్లి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

జిల్లా అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అమలు, స్వచ్ఛతలో దేశానికే స్ఫూర్తిగా నిలుస్తున్నది. అందరి సహకారంతోనే ఇది సాధ్యపడుతున్నది. రైతులు, సబ్బండవర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నది. 

- కుమార్‌ దీపక్‌, పెద్దపల్లి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌

పెద్దపల్లి, జనవరి 26(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలతో పాలన చేరువైందని, అభివృద్ధి, సంక్షేమం, స్వచ్ఛతతోపాటు పథకాల అమలులో పెద్దపల్లి ఇతర జిల్లాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నదని పెద్దపల్లి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయం, ప్రజల సంపూర్ణ సహకారంతోనే జిల్లా అన్నింటా ముందు వరుసలో నిలుస్తున్నదని చెప్పారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పోలీస్‌ పరేడ్‌ మైదానంలో మంగళవారం జరిగిన గణతంత్ర వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి మాట్లాడారు. కరోనాతో యావత్తు ప్రపంచం ఎంతో నష్టపోయిందని, జిల్లాలో 5,756 మందికి చికిత్స అందించామని చెప్పారు. మాతా శిశు మరణాల నిష్పత్తిని గణనీయంగా తగ్గించడానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 3,145మందికి కేసీఆర్‌ కిట్లు పంపిణీ చేశామన్నారు. మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ శుద్ధ జలం అందిస్తున్నామని చెప్పారు. కరోనా కష్టకాలంలోనూ రైతుబంధు కింద యాసంగి పంటకు గాను 1,28,865 మంది రైతులకు 132.73కోట్లను అందించామన్నారు. రైతు బీమా పథకం కింద 779 మంది రైతు కుటుంబాలకు 5లక్షల చొప్పున 38.95 కోట్లు చెల్లించినట్లు వివరించారు. పల్లె ప్రగతిలో భాగంగా జిల్లాలోని 266 గ్రామ పంచాయతీల్లో సామాజిక మరుగుదొడ్లు, డంపింగ్‌ యార్డులు, 103 వైకుంఠధామాలు, 257 కంపోస్ట్‌ షెడ్లు నిర్మించామని, మిగతా గ్రామాల్లో నిర్మాణ పనులు కొనసాగుతున్నట్లు చెప్పారు. జిల్లాలో జరుగుతున్న స్వచ్ఛత కార్యక్రమాలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక అవార్డులను అందించిందని, ఇటీవల స్వచ్ఛభారత్‌ మిషన్‌ గ్రామీణ్‌లో భాగంగా మరో జాతీయ పురస్కారాన్ని ఇచ్చినట్లు చెప్పారు. టీఎస్‌ ఐపాస్‌ కింద 13,648కోట్ల పెట్టుబడులతో 4,200 మందికి ఉపాధి కల్పించేందుకు 365యూనిట్లకు అనుమతి వచ్చిందని, వీటిలో 10,841కోట్ల పెట్టుబడితో 290 చిన్న పరిశ్రమలు ఉత్పత్తిని ప్రారంభించి 3,300 మందికి ఉపాధి కల్పిస్తున్నాయన్నారు. అనంతరం కొవిడ్‌ సమయంలో ఉత్తమ సేవలందించిన 74మంది ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు ప్రశంసా పత్రాలు అందజేశారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కిషన్‌జీ తల్లి మధురమ్మను సన్మానించారు. కార్యక్రమంలో రామగుండం కమిషనర్‌ ఉదయ్‌కుమార్‌, జిల్లా ఇన్‌చార్జి డీఆర్‌వో కే నరసింహమూర్తి, డీసీపీ పులిగిళ్ల రవీందర్‌, జడ్పీ సీఈవో మచ్చ గీత, డీఆర్‌డీవో వినోద్‌, డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్‌, జిల్లా ప్రభుత్వ దవాఖాన వైద్యాధికారి మందల వాసుదేవరెడ్డి, జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి కృపాబాయి, పెద్దపల్లి ఆర్డీవో శంకర్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 


VIDEOS

logo