జిల్లాను బాలకార్మిక రహితంగా తీర్చిదిద్దాలి

అదనపు కలెక్టర్ వీ లక్ష్మీనారాయణ
పెద్దపల్లి జంక్షన్, జనవరి 18: పెద్దపల్లి జిల్లాను బాల కార్మిక రహితంగా తీర్చిదిద్దేందుకు అన్నిశాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని అదనపు కలెక్టర్ వీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. బాలల పరిరక్షణ-ఆపరేషన్ స్మైల్ 7వ సమన్వయ సమీక్షా సమావేశం మంగళవారం కలెక్టరేట్లోని సమావేశం మం దిరంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బాలల హక్కుల సంరక్షణ ద్వారానే సంపూర్ణ మానవాభివృద్ధి సాధ్యమవుతుందని, ఆ దిశగా అధికారులు పక్కా ప్రణాళిక రూపొందించుకోవాలని ముందుకెళ్లాలని సూచించారు. బాల కార్మికుల నివారణ, బాలల పరిరక్షణ వంటి చట్టాలపై ప్రజలకు సంపూర్ణ అవగాహన కల్పించాలని ఆదేశించారు. నిరాశ్రయులైన పిల్లలు, బాల కార్మికుల వివరాలు తెలిస్తే టోల్ ఫ్రీ నంబర్ 1098కు కాల్ చేయాలని కోరారు. బాల కార్మికుల నివారణకు ప్రభుత్వం ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని వివరించారు. ఈ యేడాది ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ ద్వారా 5,35 మంది పిల్లలను రక్షించామని అధికారులు వివరించారు. అనంతరం బాలల హక్కుల సంరక్షణకు తమ వంతు కృషి చేస్తామని అధికారులు, చైల్డ్ కమిటీ సభ్యులతో అదనపు కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. సమావేశంలో ఇన్చార్జి డీఆర్వో కే నర్సింహమూర్తి, డీసీపీ రవీందర్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్‌కుమార్, డీఈవో జగన్మోహన్రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి సుగుణ, చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్ కొమురయ్య, జిల్లా బాలల పరిరక్షణ అధికారి జితేందర్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.