ఎత్తిపోతల పరుగులు

కాళేశ్వరం లింక్-1, 2లలో నడుస్తున్న పంపులు
పెద్దపల్లి, జనవరి 18(నమస్తే తెలంగాణ)/ ధర్మారం/రామడుగు/ బోయినపల్లి/ తిమ్మాపూర్: కాళేశ్వరం ప్రాజెక్టులో ఆదివారం ప్రారంభమైన ఎత్తిపోతలు యథావిధిగా కొనసాగుతున్నాయి. రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో కాళేశ్వరం లింక్-1, 2లో ఇరిగేషన్ శాఖ ఎస్ఈ, రామగుండం ఎస్ఈ ఆధ్వర్యలో అధికారులు నీటి ఎత్తిపోతలను కొనసాగిస్తున్నారు. ఎల్లంపల్లికి 2 టీఎంసీలను, ఎల్ఎండీకి 8 టీఎంసీలను తరలించేందుకు పంపులను ఆన్చేసినట్లు రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు తెలిపారు. కాగా, లింక్-1లోని లక్ష్మీ పంప్‌హౌస్ నుంచి రెండు పంపుల ద్వారా 4200 క్యూసెక్కులు, సరస్వతీ పంప్‌హౌస్‌లోని రెండు పంపుల ద్వారా5,862 క్యూసెక్కులు, పార్వతీ పంప్‌హౌస్‌లోని రెండు పంపుల ద్వారా 2,610 క్యూసెక్కులను ఎత్తిపోస్తున్నారు. ఎల్లంపల్లికి చేరిన నీరు టన్నెళ్ల ద్వారా లింక్-2 పరిధిలోని ధర్మారం మండలం నందిమేడారంలోని నంది పంప్‌హౌస్‌కు చేరుతుండగా, అక్కడ ఒక మోటర్‌ను ఆన్‌చేసి 3,150 క్యూసెక్కుల నీటిని రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రీ పంప్‌హౌస్‌కు తరలిస్తున్నారు. అక్కడ ఐదో మోటర్‌ను ఆన్‌చేసి 3,150 క్యూసెక్కుల నీటిని మిడ్‌మానేరుకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి రెండు గేట్లు ఎత్తి 3వేల క్యూసెక్కుల నీటిని ఎల్ఎండీ జలాశయానికి, ఇక్కడి నుంచి కాకతీయ కాలువ ద్వారా 2500 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. తాగునీటి అవసరాలకు 227 క్యూసెక్కులు తరలిస్తున్నారు.