బుధవారం 27 జనవరి 2021
Peddapalli - Jan 14, 2021 , 01:20:28

బాధ్యులను కఠినంగా శిక్షించాలి

బాధ్యులను కఠినంగా శిక్షించాలి

కాల్వశ్రీరాంపూర్‌, జనవరి13: తన కూతురు మరణానికి కారణమైన బాధ్యులను కఠినంగా శిక్షించాలని మహిళా కమిషన్‌ సభ్యురాలు కటారి రేవతిరావుకు మూల మానస తల్లి మంజుల విన్నవించారు. పెగడపల్లికి చెందిన మానస యైటింక్లయి న్‌కాలనీలో ఈ నెల 8వ తేదీన అత్తవారింట్లో ఉరేసుకొని మృతి చెందగా, పెగడ పల్లిలో దహన సంస్కారాలు నిర్వహించారు. మానసను భర్త, అత్తమామ, ఆడబిడ్డ ఉరివేసి చంపారంటూ మంజుల ఇటీవల మహిళా కమిషన్‌కు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కమిషన్‌ సభ్యురాలు రేవతిరావు పెగడపల్లికి బుధవారం వచ్చి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. మానసకు ఏడాది వయసు ఉన్న కొడుకు ఉన్నాడని, తల్లి కోసం రోజూ ఏడుస్తున్నాడని, తమకు న్యాయం చేయాలని మానస తల్లి రోదిస్తూ రేవతిరావు దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం రేవతిరావు మాట్లాడుతూ, మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై 181/ 99493 31939 నంబర్లకు కాల్‌ చేయాలని సూచించారు. మహిళా కమిషన్‌ ఏర్పాటైన తర్వాత ఈ కేసు విచారణకు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ నూనేటి సంపత్‌, జడ్పీటీసీ వంగళ తిరుపతిరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు గొడుగు రాజ్‌కుమార్‌, ఎంపీటీసీ సుముఖం నిర్మల, నాయకులు మల్లారెడ్డి, కూకట్ల నవీన్‌, కుమార్‌, సువర్ణ బిట్టు తదితరులున్నారు. 


logo