సమస్యలు లేకుండా చూడాలి

- రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
- విద్యుత్ శాఖ డీఈతో సమావేశం
గోదావరిఖని: నియోజకవర్గ ప్రజలకు విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూడాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సూచించారు. గోదావరిఖని తిలక్‌నగర్‌లోని ఆయన నివాసంలో శనివారం టీఎస్ఎన్పీడీసీఎల్ డీఈతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పల్లె నిద్రలో భాగంగా గ్రామాల్లో పర్యటించిన సందర్భంలో అక్కడి ప్రజల నుంచి విద్యుత్ పరంగా ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకవచ్చారని గుర్తు చేశారు. ఆకెనపల్లిలో సబ్‌స్టేషన్ ఉండడంతో గ్రామాల్లో విద్యుత్ లో వోల్టేజీ సమస్య ఏర్పడుతున్నదని వివరించారు. అంతర్గాంలో మరో సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. లక్ష్మీనగర్‌లో విద్యుత్ తీగలతో ప్రజలను ఇబ్బంది కలుగుతున్నదని, ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు వాటి స్థానంలో ఓవర్ హెడ్ కేబుల్స్‌ను అమర్చాలన్నారు. బ్రాహ్మణపల్లి సమీపంలోని ఎస్సీ కాలనీలో నూతన విద్యుత్ లైన్ నిర్మించాలన్నారు. అలాగే నగరంలో శిథిలావస్థలో ఉన్న విద్యుత్ స్తంభాలను గుర్తించి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో మేయర్ అనిల్‌కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు ఉన్నారు.