ఆదివారం 17 జనవరి 2021
Peddapalli - Dec 02, 2020 , 00:29:20

లాభాల పుట్ట

లాభాల పుట్ట

  • పుట్ట గొడుగుల సాగుతో రెట్టింపు ఆదాయం 
  • రాణిస్తున్న నాంసానిపల్లి యువకులు

ఆ ఇద్దరు యువకులూ ఎంబీఏ పూర్తి చేశారు. ఏదో ఒక ఉద్యోగం చేద్దామని పట్నం బాట పట్టారు. కరోనా ప్రభావం వారి కొలువులపైనా పడింది. దాంతో చేసేదేమీ లేక ఊరిబాట పట్టారు.. ఇక్కడే వారి మదిలో కొత్త ఆలోచనకు బీజం పడింది. సొంత వ్యాపారంతో ఉపాధి పొందాలన్న ఆలోచన వచ్చింది. అందరిలా కాకుండా పుట్టగొడుగుల సాగుపై దృష్టి సారించారు. తక్కువ పెట్టుబడితో పౌష్టికాహార పంట పండిస్తూ మెరుగైన లాభాలు సాధిస్తున్నారు. వినూత్న ఆలోచనలతో రాణిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. - ఓదెల

పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం నాంసానిపల్లికి చెందిన గంగిశెట్టి మహేశ్‌, చంచుల లక్ష్మణ్‌ ఇద్దరూ ఎంబీఏ పూర్తి చేశారు. హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ కంపెనీల్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేశారు. అయితే, కరోనా కాలంలో ఉద్యోగం పోయింది. దీంతో స్వగ్రామం చేరిన ఆ ఇద్దరు యువకులు స్వయం ఉపాధివైపు అడుగులు వేశారు. అనుకున్నదే తడవుగా పాల పుట్ట గొడుగుల పెంపకంపై దృష్టి సారించారు. ఇందుకు విశాఖపట్నం, హైదరాబాద్‌లో శిక్షణ తీసుకున్నారు. మొదట 15 వేల పెట్టుబడి పెట్టి సాగు చేశారు. రెట్టింపు ఆదాయం 30 వేల వరకు వచ్చింది. ఆ తర్వాత మళ్లీ 40 వేల పెట్టుబడి పెట్టి పాల పుట్ట గొడుగులను సాగు చేస్తున్నారు. వీటిని రాష్ట్రంలోని వివిధ పట్టణాలకు ఎగుమతి చేయనున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం పుట్ట గొడుగులకు కిలో 300 నుంచి 400 వరకు పలుతోందని, రెండు నెలల నుంచి దిగుబడి వస్తున్నట్లు తెలిపారు.

మెండుగా పౌష్టిక విలువలు

పాల పుట్ట గొడుగుల్లో రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్లు ఎక్కువగా ఉంటాయని, యాంటీ యాక్సిడెంట్లు మెండుగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇందులోని బీటా గ్లూకాన్‌ యాంటీ వైరల్‌ యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు కలిగి ఉంటుందని అంటున్నారు. ఊపిరితిత్తుల పని తీరు మెరుగు పర్చుతుందని తెలుపుతున్నారు. షుగర్‌, బీపీ, కొవ్వు తగ్గిస్తాయని, కాలేయానికి బలం చేకూరుస్తాయని, కీళ్ల నొప్పులు, చర్మ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయని, ముడతలు తొలగించడం, క్యాన్సర్‌ గడ్డలు, జలుబుల నివారణలో కీలకంగా పని చేస్తుందని, ఖనిజ లవణాలు అధికంగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా ఎండా కాలంలో చలువ చేస్తుందని అంటున్నారు. 

సాగు విధానం

వరిగడ్డిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. 200ల లీటర్ల డ్రమ్ములో 250 ఎంఎల్‌ ఫార్మాలిన్‌, రెండు చెంచాల బావిస్టిన్‌ను నీటిలో పోసుకుని కలపాలి. వరిగడ్డి ముక్కలను అందులో వేయాలి. వాటిపై గచ్చు బండలు పెట్టాలి. 100 ఎంఎల్‌ ఫార్మాలిన్‌, పావు చెంచా వావిస్టిన్‌ను 20 లీటర్ల నీటిలో కలిపి బండపై పోయాలి. కవర్‌ను డ్రమ్ముపై కప్పి, 24 గంటలు నానబెట్టాలి. గడ్డిని, కవర్‌ను ఉల్లార బెట్టుకోవాలి. గడ్డి ఎండే వరకు ఉంచాలి. బ్యాగ్‌లో విత్తనాలు, వరిగడ్డిని పొరలు, పొరలుగా వేయాలి. 21 రోజులు చీకటి గదిలో ఉంచాలి. 11 రోజులకు విత్తనాలు మొలకెత్తే దశకు వస్తాయి. రెండు నెలలకు క్రాప్‌ వస్తుంది.

సాగుకు కావాల్సినవి..

వరిగడ్డి, ఫార్మాలిన్‌, బావిస్టిన్‌, చెక్‌ పౌండర్‌, నల్ల మట్టి, డ్రమ్ము, 12x15 టార్పాలిన్‌ కవర్‌, 14 x 22 పీపీ కవర్లు, విత్తనాలు.

లాభాలు బాగున్నయ్‌

పాల పుట్టగొడుగుల సాగుతో మంచి లాభాలున్నయ్‌. కరోనా సమయంలో ప్రజలు ఎక్కువగా రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకుంటున్నరు. పాల పుట్ట గొడుగులలో పౌష్టికాహార విలువలు ఉన్నాయని గుర్తించి మేం వీటి సాగుకు శ్రీకారం చుట్టినం. మన ప్రాంతంలో ఇలాంటి సాగు ఎవరూ చేస్తలేరు. అందుకే మేం పాల పుట్ట గొడుగుల పెంపకంపై శిక్షణ తీసుకున్నం. మొదటి సారి సాగు చేసి సక్సెస్‌ అయినం. రెండోసారి కూడా మొదలు పెట్టినం. వీటికి మార్కెట్లలో మంచి డిమాండ్‌ ఉంది.

- గంగిశెట్టి మహేశ్‌, చుంచుల లక్ష్మణ్‌, నాంసానిపల్లి (ఓదెల)