ఉపాధి ఆన్లైన్

- రంగంలోకి యంత్రాంగం
- క్షేత్రస్థాయిలో వివరాల నమోదు..ఫొటోల సేకరణ
- ప్రతి పని జియోట్యాగింగ్..
వెబ్సైట్లో నిక్షిప్తంపథకంలో పారదర్శకత పెంచాలని సర్కారు నిర్ణయం
పెద్దపల్లి, నమస్తే తెలంగాణ: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం(ఎంజీ ఎన్ఆర్ఈజీఎస్) పనులను అధికారులు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. పథకం అమలులో పారదర్శకత పెంచాలనే ఆదేశాలతో ప్రతి పనిని ఫొటోలు తీస్తూ వెబ్సైట్లో నిక్షిప్తం చేస్తున్నారు. ఓ వైపు పథకం అమలులో స్పీడు పెంచుతూనే, మరోవైపు కొత్త జీపీల్లో పనులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ప్రతి పని నిక్షిప్తం..
ఉపాధిహామీ పథకం ఓ వైపు గ్రామాల్లో మౌళిక వసతుల కల్పనకు ఊతమిస్తూనే, కూలీలకు చేతి నిండా పని కల్పిస్తున్నది. ప్రజలు, రైతుల కోసం అనేక పనులను చేపడుతున్నారు. పంట పొలాల్లో ఫాంపాండ్లు, మరుగుదొడ్లు, చెరువుల్లో పూడికతీత, హరితహారం కింద మొక్కల పెంపకం ఇలా అనేక రకాల పనులు చేపడుతున్నారు. అయితే, ఎక్కడా ఎలాంటి తేడాలు ఉండకుండా ప్రతి పనిని ఆన్లైన్లో నమోదు చేయాలని కేంద్రం ఆదేశించింది. ఇందుకోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను రూపొందించగా, జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగింది. చేసిన పనుల వివరాలు నమోదు చేయడంతోపాటు ఫొటోలను జియో ట్యాగింగ్ ద్వారా అనుసంధానం చేస్తూ ఇంటర్నెట్లో నమోదు చేస్తున్నారు. ఈ పనుల వివరాలను వెబ్సైట్ ద్వారా ఎక్కడి నుంచైనా చూసుకోవచ్చు.
ఉపాధి స్పీడప్..
‘ఉపాధి’ స్పీడందుకున్నది. పెద్దపల్లి జిల్లాలో 279 గ్రామ పంచాయతీలు ఉండగా, 1,12,952 జాబ్ కార్డులున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో 46,80,000 పని దినాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకోగా, గడిచిన పది నెలల్లోనే ఇప్పటి వరకు 22,95,390 పనిదినాలు పూర్తి చేశారు. 1,00,388 మంది కూలీలకు పని కల్పించారు. మొత్తం 62,36,73,000 చెల్లింపులు చేశారు. ఇందులో మెటీరియల్ కాంపోనెంట్ నిధులు 24,86,73,000 ఉండగా, కూలీలకు వేతనాల రూపంలో 37.50కోట్లు చెల్లించారు.
కొత్త జీపీల్లో ప్రణాళికలు..
అడిగినోళ్లందరికీ పనులు కల్పిస్తూ అండగా నిలుస్తున్న అధికారులు, అటు కొత్త గ్రామ పంచాయతీల్లో పెద్ద ఎత్తున పనులు చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో గతంలో 207 గ్రామ పంచాయతీలు ఉండేవి. ఇందులో మూడు నూతన మున్సిపాలిటీల్లో కలిశాయి. అయితే, కొత్త పంచాయతీ రాజ్ చట్టం వచ్చాక 500 జనాభా ఉన్న పల్లెలు, తండాలను రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలుగా మార్చడంతో జిల్లాలో కొత్తగా 69 జీపీలు ఏర్పడ్డాయి. అయితే, ఈ జీపీల్లో ఇప్పటిదాక మొక్కలు నాటడడం, తదితర పనులు మాత్రమే చేయడంతో ప్రజలు, రైతుల అవసరాలకు తగ్గట్టు పెద్ద పనులు చేసేందుకు అధికారులు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. గ్రామ సభలు ఏర్పాటు చేసి చేపట్టాల్సిన పనులపై పూర్తి స్థాయి నివేదికను రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. భూగర్భ జలాల పెంపునకు సమగ్ర వాటర్‌షెడ్ పనులు, చిన్నకారు రైతుల బంజరు భూముల అభివృద్ధి, చేపల ఉత్పత్తి కుంటల నిర్మాణం, మైనర్ ఇరిగేషన్ కాలువల్లో పూడికతీత, మంచినీటి చెరువులు, చెరువుల్లో పూడిక తీత పనులు చేపట్టనున్నారు. బంజరు భూముల్లో రోడ్డుకు ఇరువైపులా చెట్లు నాటడం వంటి పనులు చేపట్టేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నారు.
తాజావార్తలు
- సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ దళ సభ్యుడి అరెస్ట్
- రైతు నేత రాకేశ్ తికాయత్ నిరాహార దీక్ష
- కాశీ గంగా హారతిలో పాల్గొన్న సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు
- 'థ్యాంక్ యూ బ్రదర్' ట్రైలర్ రివ్యూ..!
- సీఎం కేసీఆర్ ప్రతి ఆలోచన ప్రజల అభివృద్ధి కోణంలోనే
- ఖమ్మం నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
- బ్రాండ్ బెస్ట్‌లో జియోకు ఐదో స్థానం.. కోకాకోలాకు ఫోర్త్ ర్యాంక్
- సూపర్‌స్టార్ జాకీచాన్ తో దిశాపటానీ
- ఏపీలో కొత్తగా 117 కరోనా పాజిటివ్ కేసులు
- నిజాంసాగర్‌కు పూర్వవైభవం తెస్తాం