శుక్రవారం 27 నవంబర్ 2020
Peddapalli - Nov 23, 2020 , 01:46:31

కాల్వశ్రీరాంపూర్‌ సక్సెస్‌..

కాల్వశ్రీరాంపూర్‌ సక్సెస్‌..

పెద్దపల్లి, నమస్తే తెలంగాణ: కాల్వశ్రీరాంపూర్‌ మండలంలో పైలెట్‌ ప్రాజెక్టు కింద దాదాపు రెండు నెలల కింద ఏర్పాటు చేసిన కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్‌ (సీహెచ్‌సీ) సక్సెస్‌ ఫుల్‌గా నడుస్తున్నది. కూలీల కొరతకు చెక్‌ పెట్టి.. చిన్న, కారు రైతుల అవసరాలు తీర్చడమే లక్ష్యంగా జిల్లా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) కాల్వశ్రీరాంపూర్‌ మండల కేంద్రంలో గత సెప్టెంబర్‌ 30న సీహెచ్‌సీని ప్రారంభించింది. క్రాంతి మండల సమాఖ్యకు నిర్వహణ బాధ్యతలు అప్పగించింది. 45 మంది సభ్యులతో ఉన్న ఈ సంఘానికి రూ.25లక్షల రుణం ఇప్పించి, సెంటర్‌ను ఏర్పాటు చేయించింది. ఇది కాల్వశ్రీరాంపూర్‌ మండల కేంద్రం నుంచి 15కిలోమీటర్ల పరిధిలోని గ్రామాల పరిధిలో సేవలందిస్తున్నది. ఈ వానకాలం పంట కోతల సమయంలో సేవలు విస్తృతం కావడంతో ఇప్పటి వరకు సమాఖ్యకు రూ.40వేల దాకా ఆదాయం సమకూరింది. ప్రత్యేకంగా ఒక ఖాతాను తెరిచి పారదర్శకంగా నిధులను జమ చేస్తున్నారు. సీహెచ్‌సీలో ప్రస్తుతం ట్రాక్టర్‌, ట్రాలీ, రొటావేటర్‌, కల్టివేటర్‌, ఫ్లవ్‌, పవర్‌ వీడర్‌, స్ప్రేయర్లు, బేలర్‌, పరదాలను అతి తక్కువకే అద్దెకు ఇస్తున్నారు. ట్రాక్టర్‌, రోటవేటర్‌తో పొలం దున్నితే బయటి వ్య క్తులు ఎకరాకు రూ.4వేల పైనే తీసుకుంటుండగా వీరు రూ.3,600 తీసుకుంటున్నారు. ఇక బేలర్‌ ద్వారా గడ్డి కట్టలుగా కట్టేందుకు బయట రూ.40తీసుకుంటే ఇక్కడ రూ. 35 అద్దె తీసుకుంటున్నారు.

మాకో కొత్త అనుభవం.. 

మహిళా సంఘాలు రైతులతో కలిసి పనిచేయడం అనేది కొత్త  అనుభవం. యంత్రాలకు రోజూ పనిదొరికే విధంగా అందరూ సహకరిస్తున్నరు. మొదట్లో చాలా భయమైంది. ఇప్పుడు సంతోషంగా ఉంది. ఇంకా కొన్ని పనిముట్ల అవసరం ఉంది. అవి కూడా తెచ్చుకుంటాం. పైలెట్‌ ప్రాజెక్టుగా మా మండల సమాఖ్యకు అవకాశం ఇచ్చిన అధికారులకు కృతజ్ఞతలు. 

- కనవేన శ్రీలత, క్రాంతి మండల సమాఖ్య అధ్యక్షురాలు, కాల్వశ్రీరాంపూర్‌ మండలం.

ఎంతో ఆసరైతున్నయ్‌.. 

ఉన్న నాలుగు ఎకరాలకు ట్రాక్టర్లు, రొటావేటర్లు, ఇంకా పనిముట్లు కొనుక్కోలేం. అట్లా అని బయటి వాళ్ల దగ్గర కిరాయికి తీసుకుంటే పూటకో రేటు ఉంటది అద్దె. అదే ఈ మహిళా సంఘాలోల్ల దగ్గర రేటు ఒక్క తీరుగనే ఉంటది. పనిముట్లు 24గంటలు అందుబాటులో ఉంటున్నై. 

- చీర్ల రాజకొమురయ్య, రైతు, పందిల్ల, కాల్వశ్రీరాంపూర్‌ మండలం. 

మరిన్ని తెప్పిస్తాం

కాల్వశ్రీరాంపూర్‌లోని వ్యవసాయ పనిముట్ల అద్దె కేంద్రంలో ఇంకా అవసరమైన అన్ని రకాల పనిముట్లను తెప్పిస్తాం. ఇప్పటికే మండల సమాఖ్య నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. మరో ట్రాక్టర్‌తో పాటుగా మరో సెట్‌ పనిముట్లు కావాలని అడుగుతున్నారు. ప్రభుత్వానికి నివేదిక పంపి, తెప్పించే ఏర్పాట్లు చేస్తున్నం. 

- వినోద్‌కుమార్‌, డీఆర్డీవో, పెద్దపల్లి.