గురువారం 03 డిసెంబర్ 2020
Peddapalli - Nov 22, 2020 , 02:00:41

‘కాళేశ్వరం’లోరొయ్యల సాగు

‘కాళేశ్వరం’లోరొయ్యల సాగు

  • 24 నుంచి బరాజ్‌లు, జలాశయల్లో విత్తన రొయ్యలు విడుదల
  • 19లక్షల ‘నీలకంఠ’ రకం పిల్లలు పోసేందుకు మత్స్యశాఖ ఏర్పాట్లు
  • ఇప్పటికే పూర్తికావచ్చిన చేపపిల్లల పంపిణీ

పెద్దపల్లి, నమస్తే తెలంగాణ: తెలంగాణ వరదాయినీ కాళేశ్వరం ప్రాజెక్టులో రొయ్యల పెంపకానికి మత్స్యశాఖ సిద్ధమవుతున్నది. భూపాలపల్లి జిల్లాలోని లక్ష్మీబరాజ్‌ నుంచి పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి బరాజ్‌ దాకా విస్తరించిన గోదావరిలో ఏడాదిగా నీలి విప్లవం కింద చేప, రొయ్య విత్తనాలు పోస్తూ మత్స్యకారులకు చేతి నిండా పని కల్పిస్తున్నది. 2020-21 సంవత్సరానికిగాను ఇప్పటికే చేప విత్తనాలు పోసిన సర్కారు, ఈ నెల 24 నుంచి ప్రత్యేకంగా నీలకంఠ రొయ్య పిల్లలు పోసేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. 

చేప పిల్లల పంపిణీ చివరి దశకు.. 

నీలి విప్లవం కింద జిల్లాలో కొన్నేండ్లు చేప పిల్లలు ఉచితంగా పంపిణీ చేస్తున్న మత్స్యశాఖ అధికారులు, కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌లు, రిజర్వాయర్లు అందుబాటులోకి వచ్చాక వాటి సంఖ్యను మరింత పెంచారు. జిల్లాలో గతేడాది 1076 చెరువులు, కుంటలు, కాళేశ్వరం బరాజ్‌లు, జలాశయాల్లో 1.13 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేశారు. సగటున 7240 టన్నుల చేపల పంట పండి, మత్స్యకారులకు 57.32కోట్ల ఆదాయం లభించింది. అయితే గతేడాదితో పోలిస్తే ఈ యేడాది చేప పిల్లల సంఖ్య మరో 40 లక్షలు పెరిగినందున మత్స్యకారుడికి మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో మొత్తం 1.53 కోట్ల పిల్లల లక్ష్యాన్ని నిర్దేశించుకొని గత ఆగస్టు, సెప్టెంబర్‌ నుంచే విడుదల చేస్తున్నారు. పంపిణీ ప్రక్రియ దాదాపుగా చివరి దశకు చేరగా, ఇంకా పలు బ్యారేజీల్లో కొన్నింటిని వదలాల్సి ఉంది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో నిర్మించిన సరస్వతీ బరాజ్‌ బ్యాక్‌ బాటర్‌ జిల్లాలో విస్తరించి ఉండగా, ఇందులో మొత్తం 8.79లక్షల చేప పిల్లల వేయాలని అనుకున్నారు. ఇప్పటికే 6లక్షల విత్తనాలు పోయగా, ఇంకా 2.79లక్షలు వేయాల్సి ఉంది. అలాగే పార్వతీ బరాజ్‌లో 11.41 లక్షల చేప పిల్లల్లో ఇంకా 5లక్షల పిల్లలు పోయాల్సి ఉంది. అంతర్గాం మండలం ఎల్లంపల్లి లక్ష్యానికి అనుగుణంగా 12.21లక్షలు, ధర్మారం మండలం నంది రిజర్వాయర్‌లో 6.09లక్షల చేప విత్తనాలు పోశారు. 

24 నుంచే 19లక్షల రొయ్య విత్తనాల విడుదల

కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌లు, జలాశయాల్లో 38లక్షల చేప పిల్లల విడుదల 90శాతం పూర్తి కాగా, ఈ నెల 24 నుంచి రొయ్య పిల్లలు పోసేందుకు మత్స్యశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. గతేడాది కూడా రొయ్య పిల్లలు పోసినప్పటికీ ఈ యేడు ప్రత్యేకంగా ‘నీలకంఠ’ రకం విత్తనాలు పోస్తున్నారు. సరస్వతీ బరాజ్‌ బ్యాక్‌ బాటర్‌లో 5 లక్షల రొయ్య పిల్లలు, మంథని మండలం సిరిపురంలోని పార్వతీ బరాజ్‌లో 5లక్షలు, అంతర్గాం మండలం ఎల్లంపల్లి డ్యాంలో 5 లక్షలు, ధర్మారం మండలం నంది రిజర్వాయర్‌లో 4లక్షల విత్తనాలు పోయనున్నట్లు మత్స్యశాఖ అధికారులు పేర్కొన్నారు. 

ఏర్పాట్లు చేస్తున్నాం.. 

జిల్లాలో మత్స్యశాఖ పరిధిలోని సరస్వతీ, పార్వతీ బరాజ్‌లు, ఎల్లంపల్లి, నందిమేడారం రిజర్వాయర్లు ఉన్నాయి. వాటిల్లో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నెల 24నుంచి నీలకంఠ రకం రొయ్య పిల్లలను వదులాలని నిర్ణయించాం. జిల్లా మంత్రి, ఇతర ప్రజా ప్రతినిధులను సంప్రదించి సమయాన్ని నిర్ణయించి కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. రొయ్య పిల్లలతో మత్స్యకారులకు మరింత ఆదాయం వస్తుంది. 

- మల్లేశం, మత్స్య అభివృద్ధి అధికారి (పెద్దపల్లి)