మంగళవారం 24 నవంబర్ 2020
Peddapalli - Nov 13, 2020 , 02:00:43

సృజన్‌, శ్రుతి చికిత్సకు భరోసా

సృజన్‌, శ్రుతి చికిత్సకు భరోసా

  • తక్షణ సాయంగా రూ. 20 వేలు అందజేసిన ఎమ్మెల్యే తనయుడు
  • ఎల్వోసీ మంజూరుకు కృషి చేస్తానని సంజయ్‌ హామీ
  • బాసటగా నిలుస్తున్న దాతలు 
  •  రూ. 2 లక్షల విరాళాలు  సేకరించిన విద్యార్థులు
  • ‘నమస్తే’ కథనానికి స్పందన

మల్లాపూర్‌: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఓ ప్రైవేట్‌ దవాఖానలో చికిత్స పొందుతున్న మండలకేంద్రానికి చెందిన సృజన్‌, శ్రుతికి దాతలు బాసటగా నిలుస్తున్నారు. ‘సేవ్‌ సృజన్‌, శ్రుతి’ పేరిట ‘నమస్తేతెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు తనయుడు స్పందించారు. తక్షణ సాయంగా రూ. 20 వేలు వితరణ చేశారు. ఇందుకు సంబంధించిన నగదును టీఆర్‌ఎస్‌ నాయకులు గురువారం సృజన్‌, శ్రుతి తండ్రి శ్రీనివాస్‌కు అందజేశారు. ఎల్వోసీ మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారని వారు తెలిపారు. అలాగే మేడిపల్లి మండలం మన్నెగూడెం గ్రామానికి చెందిన సర్పంచ్‌ నరేశ్‌రెడ్డి, విజయ్‌, రామ్‌, నరహరి  మల్లాపూర్‌కు వచ్చి రూ. 50 వేలను శ్రీనివాస్‌కు అందజేశారు. చిట్టాపూర్‌లో యువజన సంఘాల ఆధ్వర్యంలో రూ.20 వేలు, మండలకేంద్రానికి చెందిన క్యాతం జీవన్‌రెడ్డి రూ.10 వేలు, గుండంపల్లి గ్రామానికి చెందిన ర్యాపని మహేశ్‌ రూ.5 వేలను అందజేశారు. మరికొందరు తమ విరాళాలను 7337450080, 9100854627 ఫోన్‌ నంబర్లకు గూగుల్‌ పే, ఫోన్‌ పే ద్వారా అందజేశారని, ఇప్పటి వరకు రూ. 2 లక్షలకు పైగా విరాళాలు వచ్చినట్లు వీఎస్‌ఎస్‌ చైర్మన్‌ సిరిపురం రవీందర్‌ తెలిపారు. ఇదిలా ఉండగా విద్యార్థులు, మిత్రులు సేవ్‌ సృజన్‌, శ్రుతి పేరిట గురువారం సైతం ఇంటింటికీ తిరిగి విరాళాలు సేకరించారు.