ఆదివారం 06 డిసెంబర్ 2020
Peddapalli - Nov 12, 2020 , 01:12:21

తొలి కరోనా వారియర్‌ బీమా సింగరేణిలోనే వర్తింపు

తొలి కరోనా వారియర్‌ బీమా సింగరేణిలోనే వర్తింపు

సంస్థ డైరెక్టర్‌ (ఆపరేషన్స్‌) చంద్రశేఖర్‌

‘ఖని’ దవాఖానలో బాధిత కుటుంబానికి రూ.50లక్షల చెక్కు అందజేత

గోదావరిఖని: ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన కరోనా వారియర్‌ బీమా పథకం రాష్ట్రంలోనే తొలిసారిగా సింగరేణి సంస్థ ఉద్యోగికి వర్తించిందని ఆ సంస్థ డైరెక్టర్‌ (ఆపరేషన్స్‌) చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. ఈ మేరకు గోదావరిఖని నగరంలోని సింగరేణి ఆర్జీ-1 ఏరియా దవాఖానలో కరోనా వార్డులో విధులు నిర్వహిస్తూ అదే వైరస్‌ బారిన పడి జూలైలో మృతి చెందిన దవాఖాన స్వీపర్‌ గనిరెడ్డి గురుమూర్తికి ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద రూ.50లక్షలు మంజూరయ్యాయి. బుధవారం స్థానిక దవాఖాన ఆవరణలో జరిగిన కార్యక్రమానికి డైరెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై గురుమూర్తి భార్య లలితకు రూ.50లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా తో బాధపడుతున్న రోగులకు సేవలందించే క్రమంలో వారు కూడా వ్యాధి సోకి మరణించడం బాధాకరమన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే మొదటిసారిగా ఈ ఇన్సూరెన్స్‌ చెక్కు సింగరేణిలోనే వచ్చిందన్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబంలో ఒకరికి సింగరేణిలో ఉద్యోగం ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్‌ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, ఆర్జీ-1 జీఎం కే.నారాయణ, సింగరేణి కొవిడ్‌ ఇన్‌చార్జి బాల కోటయ్య, ఎస్‌వోటు డైరెక్టర్‌ దేవీకుమార్‌, సీఎంవోఏఐ అధ్యక్షుడు మనోహర్‌, ఎస్‌వోటు జీఎం త్యాగరాజు, ఏసీఎంవో వెంకటేశ్వరరావు, పీఎం రమేశ్‌, ఫిట్‌ సెక్రటరీ రత్నమాల, యాదవరెడ్డి, సీనియర్‌ పీవో సారంగపాణి, సంక్షేమాధికారి శ్రీనివాస్‌, డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.