మంగళవారం 01 డిసెంబర్ 2020
Peddapalli - Nov 08, 2020 , 01:53:40

రాజీమార్గం ద్వారా కేసులు పరిష్కరించుకోవాలి

రాజీమార్గం ద్వారా కేసులు పరిష్కరించుకోవాలి

లోక్‌ అదాలత్‌లో న్యాయమూర్తులు

ఫర్టిలైజర్‌సిటీ: కక్షిదారులు రాజీమార్గం ద్వారా తమ కేసులను పరిష్కరించుకోవాలని గోదావరిఖని 6వ అదనపు జిల్లా న్యాయమూర్తి భారతీ లక్ష్మి, గోదావరిఖని ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి పర్వతపు రవి సూచించారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు గోదావరిఖనిలోని మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన లోక్‌ అదాలత్‌ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చిన్న చిన్న కేసుల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం, కాలాన్ని వృథా చేసుకోవద్దని సూచించారు. అనంతరం ఈ రెండు కోర్టుల్లో 47 కేసులను లోక్‌ అదాలత్‌ ద్వారా పరిష్కరించారు. ఇక్కడ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మేడ చక్రపాణి, ప్రధాన కార్యదర్శి సంజయ్‌కుమార్‌, సభ్యులు నుచ్చు శ్రీనివాస్‌, ఎండీ ఉమర్‌, పెంచాల నాగలక్ష్మి, న్యాయవాదులు భూమయ్య, శ్రీనివాస్‌, ప్రవీణ్‌కుమార్‌, గుర్రాల రాజేందర్‌ తదితరులు ఉన్నారు.

మంథనిటౌన్‌: మంథని ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు ఆవరణలో శనివారం వర్చువల్‌ లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. ఈ లోక్‌ అదాలత్‌ ద్వారా 145 క్రిమినల్‌ కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించినట్లు మంథని ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి నాగేశ్వర్‌రావు తెలిపారు. కక్షిదారులు లోక్‌ అదాలత్‌లో తమ కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. కార్యక్రమంలో లోక్‌అదాలత్‌ మెంబర్స్‌, న్యాయవాదులు రమణారెడ్డి, ఆంజనేయులు, ఎస్‌ఐ ఓంకార్‌, ఎక్సైజ్‌ ఎస్‌ఐ సాయిరాం, కక్షిదారులు, సిబ్బంది పాల్గొన్నారు.