బుధవారం 02 డిసెంబర్ 2020
Peddapalli - Nov 04, 2020 , 01:51:29

ప్రతి గింజనూ కొనుగోలు చేయాలి

ప్రతి గింజనూ కొనుగోలు చేయాలి

జిల్లాలో 298 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం 

మంత్రి కొప్పుల ఈశ్వర్‌

పెద్దపల్లి జిల్లాలో ధాన్యం కొనుగోలు సన్నాహక సమావేశానికి హాజరు

పెద్దపల్లి, నమస్తే తెలంగాణ: ‘తెలంగాణ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్య రంగం వ్యవసాయం.. కాబట్టి రైతు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేయాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పం.. ఇందుకు అనుగుణంగా పనిచేద్దాం..’ అని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అమర్‌చంద్‌ కల్యాణ మండపంలో మంగళవారం అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ అధ్యక్షతన ‘ధాన్యం కొనుగోలు సన్నాహక సమావేశం’ జరిగింది. ఈ సమా వేశానికి మండలి విప్‌, ఎమ్మెల్సీ భాను ప్రసాదరావు, పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌నేతకాని, జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌, ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, కోరుకంటి చందర్‌తో కలిసి మంత్రి కొప్పుల ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, పీఏసీఎస్‌ చైర్మన్లు, రైస్‌ మిల్లర్లు ధాన్యం కొనుగోళ్లపై మాట్లాడారు. అనంతరం మంత్రి ప్రసంగిస్తూ.. రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని స్పష్టంచేశారు. ధాన్యం కొనుగోళ్ల కోసం అన్ని ఏర్పాట్లూ చేస్తున్నదని తెలిపారు. అయితే విధి నిర్వహణలో అధికారులు చేస్తున్న నిర్లక్ష్యం కారణంగానే అన్నదాతకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇకపై ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఎలాంటి నిర్లక్ష్యాన్ని కూడా సహించేది లేదని తేల్చిచెప్పారు. జిల్లాలో 298 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, ఇంకా ఏదైనా గ్రామంలో 5వేల నుంచి 10వేల క్వింటాళ్ల వరకు ధాన్యం వచ్చే అవకాశం ఉంటే అక్కడ కూడా కొనుగోళ్లు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. అయితే రైతులు తేమ శాతం లేని ధాన్యాన్ని తీసుకొచ్చి కొనుగోలు చేయాలని, ఇబ్బంది పెట్టవద్దన్నారు. అదేవిధంగా తాలు, మట్టి ఉన్న వడ్లను తీసుకురావద్దని కోరారు. జిల్లాలో 5లక్షల 500 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో గతేడాది ఏకంగా లక్షా 22వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి పెరుగగా.. ఈ ఏడాది మరో 22వేల మెట్రిక్‌ టన్నులు పెరిగిందని తెలిపారు. రైతులు సైతం సంయమనం పాటించాలన్నారు. వ్యవసాయ శాఖ ఏవోలు మాయిశ్చర్‌ వచ్చిన ధాన్యాన్నే కొనుగోలు కేంద్రాలకు చేరేలా చూస్తే చాలా వరకు సమస్యలు ఉత్పన్నం కావన్నారు. చిన్న చిన్న లోపాలే పెద్ద పెద్ద సమస్యలకు దారితీస్తాయన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో ఇప్పటికే 2ఎలక్ట్రానిక్‌ కాంటాలను ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యాన్ని విక్రయించి ప్రయోజనం పొందాలని సూచించారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో తెలంగాణ మాదిరిగా 100శాతం ధాన్యం కొనుగోళ్లు ఎక్కడా చేపట్టలేదని, ఆయా ప్రాంతాల్లో ఎక్కడా 30శాతానికి మించలేదని తెలిపారు. బీజేపీది రైతు వ్యతిరేక విధానమని విమర్శించారు. ప్రతిసారి తడిసిన పూర్తి ధాన్యాన్ని తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసిందని గుర్తుచేశారు. కానీ ఇట్ల తడవగానే ప్రతిపక్షాలు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తాయని, కొనేలోపే రాజకీయాలు చేయడం ఏం నీతని మంత్రి ప్రశ్నించారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ శశాంక, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రఘువీర్‌ సింగ్‌, డీసీఎమ్మెస్‌ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా చైర్మన్‌ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.