మంగళవారం 24 నవంబర్ 2020
Peddapalli - Nov 02, 2020 , 01:29:32

ప్రకృతి ఒడిలో ఆండాలమ్మ గుడి

ప్రకృతి ఒడిలో ఆండాలమ్మ గుడి

ధర్మాబాద్‌లోని పురాతన ఆలయానికి పర్యాటక సొబగులు 

నాడు కబ్జాలతో కాలగర్భంలోకి క్షేత్రం 

నేడు సర్కారు కృషితో కొత్త రూపు

పెద్దపల్లి, నమస్తే తెలంగాణ: పెద్దపల్లి మండలం ధర్మాబాద్‌(ముత్తారం)లోని ఆండాలమ్మ ఆలయానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. దాదాపు 200 ఏళ్ల క్రితం గ్రామానికి చెందిన ఎరబాటి మనోహర్‌రావు స్థానిక రంగనాయక స్వామి ఆలయ సమీపంలోని తన సొంత భూమిలో ఈ గుడిని నిర్మించినప్పటికీ ఏ కారణం చేతనో ఇక్కడ దేవతా మూర్తులను ప్రతిష్ఠించలేదు. అయినప్పటికీ చుట్టూ కొండలు, పచ్చని చెట్లు, నడుమ అద్భుత శిల్పకళా సంపదతో అలరారుతుండేది. రంగనాయక స్వామి ఆలయాన్ని సందర్శించే భక్తులు ఇక్కడికి వచ్చి ప్రకృతి అందాలను చూస్తూ పరవశించిపోయేవారు. కానీ, కాలక్రమేణా ఈ ప్రాంతం పిచ్చిమొక్కలతో నిండిపోయింది. ఆలయం చుట్టూ ఉన్న భూముల్లో కొందరు రైతులు పత్తి, ఇతరత్రా పంటలు పండించడం, మరి కొందరు కబ్జాకు దిగడంతో కాలగర్భంలో కలిసిపోయింది. 


పల్లె ప్రకృతి వనంతో శోభ.. 

చుట్టూ పిచ్చిమొక్కలతో.. భూముల కబ్జాలతో ఆనవాళ్లు కోల్పోయే స్థితికి చేరిన ఈ ప్రాంతానికి పూర్వవైభవం తేవాలని స్థానిక సర్పంచ్‌ ఎద్దు కుమారస్వామి సంకల్పించారు. పల్లెల్లో పచ్చదనాన్ని నింపేదుకు ప్రభుత్వం ప్రకృతి వనాలను నిర్మిస్తుండడంతో ఈ ఆలయ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. ఎమ్మెల్యే దాసరి, ఇతర ప్రజాప్రతినిధుల చొరవతో ఆలయం చుట్టూ చదును చేసి వివిధ రకాల మొక్కలు నాటడంతో ఈ ప్రాంతం ఆహ్లాదకరంగా మారింది. దీనికి తోడు చుట్టూ కొండలు, పచ్చని చెట్లు, నడుమ అద్భుతమైన శిల్పకళా సంపదకు నెలవుగా మారిన ఈ ఆలయ ప్రాంగణం ఇటీవల పెద్దపల్లి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులతో కళకళలాడుతున్నది. అనేక రకాల షార్ట్‌ ఫిలింలు, వీడియో సాంగ్‌లకు, ఫొటో షూట్లకు వేదికగా మారుతున్నది. నిత్యం వచ్చీ పోయే సందర్శకులతో ధర్మాబాద్‌ వీధులన్నీ రద్దీగా మారుతున్నాయి. కాలగర్భంలో కలిసిపోయే స్థితికి చేరిన ఆలయ ప్రాంతం రాష్ట్ర ప్రభుత్వ చొరవతో సరికొత్త శోభను సంతరించుకోవడంపై గ్రామస్తులు సంబురపడుతున్నారు.   


ఆహ్లాదానికి నెలవు మా గ్రామం.. 

చుట్టూ చెట్లు, గుట్టల మధ్య ఉన్న మా గ్రామంలో ఆహ్లాదం, ప్రశాంతతకు కొదువ లేదు. ఎప్పుడో రెండు వందల ఏండ్ల క్రితం కట్టిన ఆండాలమ్మ, రంగనాయక స్వామి ఆలయ ప్రాంతాల్లో పల్లె ప్రకృతి వనం కింద మొక్కలు పెట్టి తీర్చిదిద్దుతున్నం. అప్పుడే చాలా మంది సందర్శకులు వస్తున్నరు. జిల్లా కేంద్రమైన పెద్దపల్లికి కూతవేటు దూరంలోని ఆ గుడి ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తే ఇంకా మంచి ఆదరణ వస్తుంది. ఆలయ నిర్మాణ కర్త మనోహర్‌రావు వారసులు ఆలయానికి వైభవాన్ని తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. ప్రభుత్వం కూడా నిధులు ఇస్తే మరింత అభివృద్ధి చేస్తాం.       - ఎద్దు కుమారస్వామి, సర్పంచ్‌ (ముత్తారం) 


ఇలా వెళ్లాలి..

పెద్దపల్లి జిల్లా కేంద్రం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పెద్దపల్లి బస్టాండ్‌ నుంచి రైల్వే స్టేషన్‌ వెళ్లే మార్గం మధ్యలో గౌరెడ్డిపేటకు వెళ్లే ప్రధాన రోడ్డు వస్తుంది. దానిగుండా గౌరెడ్డిపేటకు, అక్కడి నుంచి ముత్తారం వెళ్లాలి. ఆగ్రామ శివారులోని అడవుల్లోనే ఉంటుంది ఆండాలమ్మ ఆలయం.


చాలా మంది వస్తున్నరు.. 

ముత్తారం పరిధిలోని ధర్మాబాద్‌ ఆండాలమ్మ ఆలయ ప్రాంతంలో మొక్కలు నాటి ఆహ్లాదకంగా మార్చిన్రు. చుట్టూ కొండలు, చెట్లతో ఎప్పటి నుంచో కనువిందు చేస్తుండడంతో ఫొటోలు దిగేందుకు చాలా మంది సందర్శకులు వస్తున్నరు. ఇంకా ప్రభుత్వం గానీ ప్రైవేటుగా ఎవరైనా స్పందించి ముందుకు వస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. 

-కీర్తి రాజయ్య, స్థానికుడు (ముత్తారం)