శనివారం 28 నవంబర్ 2020
Peddapalli - Nov 02, 2020 , 01:29:30

సాయం చేయండి.. చదువుకుంటాం

సాయం చేయండి.. చదువుకుంటాం

అక్కా చెల్లెళ్ల వేడుకోలు 

పదేళ్ల క్రితం తండ్రి, ఎనిమిది రోజుల క్రితం తల్లి మృతి

పేదరికంలో బాలికలు 

దాతల కోసం ఎదురుచూపు

‘మేం చిన్నగున్నప్పుడే నాన్న సచ్చిపోయిండు.. గావురంగ పెంచిన అమ్మ వారం కిందటే మమ్మల్ని వదిలిపోయింది. ఇగ మాకెవరు దిక్కు..’ అంటూ కవలలైన ఈ అక్కాచెల్లెళ్లు కన్నీటి పర్యంతమైతున్నరు.. ‘తల్లి లేనిలోకంల బతుకుడెట్ల’ అంటూ కుమిలి పోతున్నరు.. అమ్మమ్మ ఉన్నా ఆమె బతుకుడే కష్టమని, ఎవరైనా దాతలు ముందుకువచ్చి ఆదుకోవాలని వేడుకుంటున్నరు. పదో తరగతి పూర్తి చేశామని, పై చదువులకు సాయం చేయాలని చేతులు జోడించి అర్థిస్తున్నరు పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం లింగాపూర్‌ గ్రామానికి చెందిన ధర్మారపు శివాని, శిల్పాని.

- పెద్దపల్లి, నమస్తే తెలంగాణ/అంతర్గాం

లింగాపూర్‌ గ్రామానికి చెందిన ధర్మారపు సత్తయ్య, వనిత దంపతులకు ఇద్దరు కూతుళ్లు శివాని, శిల్పాని. వీరిద్దరూ కవలలు. నిరుపేదలైన వీరి కుటుంబం రజక వృత్తిపై ఆధారపడేది. ఈ క్రమంలో పదేళ్ల క్రితం సత్తయ్య అనారోగ్యం బారినపడి చికిత్స చేయించుకొనే స్థోమత లేక కన్నుమూశాడు. నాటి నుంచి వనితే బిడ్డల ఆలనాపాలనా చూసేది. ఇండ్లల్లో బట్టలు ఉతుకుతూ సాదుకున్నది. మూడు నెలల కిందట వనిత తీవ్ర అనారోగ్యానికి గురై మంచం పట్టింది. చేతిలో చిల్లి గవ్వ లేక.. దవాఖానకు వెళ్లలేక ఎనిమిది రోజుల క్రితం తనువుచాలించింది. దీంతో శివాని, శిల్పాని రోడ్డున పడ్డారు. పదో తరగతి పూర్తి చేసి పై చదువులు చదువుదామని అనుకున్నా ఒక వైపు పేదరికం..మరోవైపు తల్లిదండ్రులను కోల్పోవడం వారిని మరింత కుంగదీసింది. తమకు చదువుకోవాలని ఉందని, ఎవరైనా దాతలు ముందుకు వస్తే కష్టపడి చదువుకుంటామని వేడుకుంటున్నారు. సాయం చేయదలిచిన వారు 8897891807 నంబర్‌కు ఫోన్‌ చేయాలని, లేదా 7337043278కు ఫోన్‌పే, గూగుల్‌ పే ద్వారా గాని సాయం చేయాలని కోరుతున్నారు.