గురువారం 26 నవంబర్ 2020
Peddapalli - Oct 29, 2020 , 00:24:57

విదేశీ విద్యకు దరఖాస్తు చేసుకోవాలి

విదేశీ విద్యకు దరఖాస్తు చేసుకోవాలి

జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి సుధాకర్‌

పెద్దపల్లిరూరల్‌: విదేశీ విద్య అభ్యసించాలనే ఆసక్తి ఉన్న మైనార్టీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి సుధాకర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ‘సీఎం ఓవర్సీస్‌ పథకం’ కింద పేద మైనార్టీలకు విదేశాల్లో ఉన్నత విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. విదేశాల్లో పీజీ, డాక్టరేట్‌ చదివేందుకు 2020 జనవరి నుంచి డిసెంబర్‌ దాకా అడ్మిషన్‌ తీసుకున్న మైనార్టీ విద్యార్థులు నవంబర్‌ 30వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా తమ దరఖాస్తును http:// www.telanganaepass.cgg.gov.in అనే వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌, అగ్రికల్చర్‌, సైన్స్‌, మెడిసిన్‌, నర్సింగ్‌, సోషల్‌ సైన్స్‌, హ్యూమానిటీస్‌ కోర్సుల్లో ఉన్నత విద్యను అభ్యసించే వారికి ప్రభుత్వం రూ.20 లక్షలు రెండు విడుతలుగా అందిస్తున్నదని వెల్లడించారు. రూ.60 వేల దాకా విమాన చార్జీలు చెల్లిస్తున్నదని తెలిపారు. అభ్యర్థుల వార్షికాదాయం రూ.5 లక్షలలోపు ఉండాలని, స్థానికత, కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌కార్డు ఇతర సంబంధిత పత్రాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి కార్యాలయంలో సంప్రదించాలని పేర్కొన్నారు.

2న సివిల్స్‌ సర్వీసెస్‌ శిక్షణకు ప్రవేశ పరీక్ష 

సివిల్స్‌ సర్వీసెస్‌ శిక్షణ కోసం ప్రవేశ పరీక్ష నవంబర్‌2వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా సంక్షేమశాఖ అధికారి సుధాకర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సివిల్స్‌ సర్వీసెస్‌ శిక్షణ కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న వారికి 2న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల దాకా పెద్దపల్లి మున్సిపల్‌ పరిధిలోని రంగంపల్లి తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాలలో పరీక్ష చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులంతా కొవిడ్‌-19 నిబంధనలను పాటిస్తూ ఉదయం 8.30 గంటలకే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.