మంగళవారం 24 నవంబర్ 2020
Peddapalli - Oct 29, 2020 , 00:24:56

‘ధరణి’ ప్రారంభానికి అంతా సిద్ధం

‘ధరణి’ ప్రారంభానికి అంతా సిద్ధం

తహసీల్‌ కార్యాలయాల్లో సీసీ టీవీలు, ప్రింటర్లు, కంప్యూటర్ల ఏర్పాటు

పెద్దపల్లి నమస్తే తెలంగాణ/ ఓదెల: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెడుతున్న రెవెన్యూ చట్టాన్ని అమలు చేసేందుకు ‘ధరణి పోర్టల్‌' ప్రారంభానికి అంతా సిద్ధమైంది. అవినీతి లేకుండా భూముల వ్యవహారాలన్నీ పారదర్శకంగా జరిగేందుకు ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను ఈనెల 29వ తేదీ నుంచి ప్రారంభించేందుకు తహసీల్‌ కార్యాలయాల్లో అన్ని సౌకర్యాలను కల్పించింది. దీంతో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లను ఈ పోర్టల్‌ ద్వారా చేయనున్నారు. కొత్త చట్టం అమలుకు ప్రభుత్వం ఇప్పటికే వీఆర్వోల వ్యవస్థను రద్దు చేసిన విషయం తెలిసిందే. అలాగే సాదాబైనామాలతో కొనుగోలు చేసిన భూముల క్రమబద్ధీకరణకు ఈనెల 31వ తేదీ వరకు మరోసారి అవకాశం ఇచ్చింది. దీంతో ధరణి పోర్టల్‌ అమలు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న రైతులు, ప్రజలకు ఊరట కలుగనుంది. ఇప్పటికే కార్యాలయాల్లో అన్ని ఏర్పాట్లతోపాటు జిల్లాలోని తహసీల్దార్లకు హైదరాబాద్‌లోని అనురాగ్‌ కళాశాలలో మంగళవారం ధరణి పోర్టల్‌పై శిక్షణ కూడా ఇచ్చారు. కార్యాలయాల్లో సీసీ టీవీలు, ప్రింటర్లు, కంప్యూటర్లు, ఇంటర్‌నెట్‌ కనెక్షన్‌, ఫర్నిచర్‌ మొదలైన సౌకర్యాలు కల్పించారు. 

పారదర్శక సేవలు..

కొత్త రెవెన్యూ చట్టం ధరణి పోర్టల్‌ ద్వారా ప్రజలు, రైతులకు పారదర్శకమైన సేవలు అందుతాయి. ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యలకు చెక్‌ పెట్టేందుకు ధరణి పోర్టల్‌ను ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ నెల 29వ తేదీ నుంచి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే మండలంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించేందుకు అంతా సిద్ధం చేసి ఉంచాం. మాకు కూడా హైదరాబాద్‌లో మంగళవారం శిక్షణ ఇచ్చారు.   

- సీ రాంమోహన్‌, తహసీల్దార్‌, ఓదెల