శనివారం 05 డిసెంబర్ 2020
Peddapalli - Oct 27, 2020 , 05:33:04

దుర్గాదేవీ శోభాయాత్రలు.. నిమజ్జనాలు

దుర్గాదేవీ శోభాయాత్రలు.. నిమజ్జనాలు

  • భక్తుల ప్రత్యేక పూజలు
  • కోలాటం ఆడిన మహిళలు, యువతులు

పెద్దపల్లి కల్చరల్‌: శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా దుర్గాదేవీకి తొమ్మిది రోజులు ప్రత్యేక పూ జలు చేసిన అనంతరం సోమవారం రాత్రి ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు నిమజ్జనానికి తరలిం చారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మడ్ల రామలింగేశ్వరాలయం (శివాలయం), సీతారామాలయం వీధిలో బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో, శాంతినగర్‌ కోదండ రామాలయం మండపంలో, తెనుగువాడలో బజరంగ్‌దళ్‌ ఆధ్వర్యంలో, తిలక్‌నగర్‌లో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవీ విగ్రహాలకు ఉదయం పూట ఉద్వాసన పూజలు చేశారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనాల్లో విగ్రహాలను పెట్టి, మహిళలు, యువతీ యువకులు, చిన్నారులు నృత్యాల మధ్య వాడవాడలా శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం రామగుండంలోని గోదావరి నదిలో విగ్రహాలను నిమజ్జనం చేశారు. వేడుకల్లో అర్చకులు మధు శ్రీనివాస శర్మ, ఈశ్వర ప్రసాద్‌ శర్మ, శ్రీనివాస స్వామి, జంబోజు శ్రీనివాస శర్మ, రామారావు, సంతోష్‌ శర్మ, ఆరుట్ల శ్రీధరాచార్యులు, భక్తులు బూతగడ్డ రాజ్‌కుమార్‌, అలువోజు రవితేజ, గణవేన నవీన్‌, దయ్యాల శ్రీనివాస్‌, బోయపోతుల నవీన్‌, చేని సాయి, బూతగడ్డ రవితేజ, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులున్నారు.

ధర్మారం: కటికెనపల్లిలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఆలయ శాశ్వత పూజారి కొమురవెల్లి శివశంకరాచార్యులు, నర్సింహులపల్లిలో యువకులు దుర్గాదేవీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం దుర్గాదేవీ విగ్రహాలను ఆయా గ్రామాల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా మహిళలు, యువతులు కోలాటం ఆడారు. అనంతరం దేవీ విగ్రహాలను చెరువుల్లో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో సర్పంచులు కారుపాకల రాజయ్య, అడువాల అరుణజ్యోతి, నర్సింహులపల్లి ఉప సర్పంచ్‌ కత్తెర్ల కోమలత, గ్రామ శాఖ అధ్యక్షుడు గాండ్ల నర్సయ్య, వార్డు సభ్యులు పాల్గొన్నారు. 

మంథనిటౌన్‌/మంథని రూరల్‌/ముత్తారం: మంథని పట్టణంతో పాటు మండలంలోని, ముత్తారం మండలాల్లోని పలు గ్రామాల్లో దుర్గామాత విగ్రహాల నిమజ్జనం వైభవంగా కొనసాగింది. దేవీ శరన్నవరాత్రోత్సవాల సందర్భంగా ప్రతిష్ఠించిన దుర్గామాత విగ్రహాలకు తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రద్ధలతో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రోజుకో రూపంలో అమ్మవారిని ఆలంకరించిన ప్రత్యేక పూజలు చేయడంతో పాటు భజన, అన్నదాన కార్యక్రమాలు చేశారు. మంథని పట్టణంలోని శ్రీలక్ష్మీనారాయణ స్వామి ఆలయంతో పాటు వాగుగడ్డ, పోచమ్మవాడ, గాంధీచౌక్‌తో పాటు పలు వార్డుల్లో ఏర్పాటు చేసిన దుర్గాదేవీ విగ్రహాలు, మంథని మండలంలోని గుంజపడుగుతో పాటు పలు గ్రామాల్లో, ముత్తారం మండలం ఖమ్మంపల్లి, అడవిశ్రీరాంపూర్‌, ఓడెడ్‌, ముత్తారం, కేశనపల్లి, లక్కారం, మైదంబండతో పాటు పలు గ్రామాల్లో దుర్గామాత విగ్రహాలను సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు భక్తులు నిమజ్జనం చేశారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనాల్లో అమ్మవారి విగ్రహాలను వీధుల గుండా ఊరేగిస్తూ డీజే సౌండ్స్‌ మధ్య నృత్యాలు చేస్తూ తరలించారు. 

కమాన్‌పూర్‌: మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ యువసేన, వేణుగోపాల స్వామి ఆలయ ఆవరణలో భక్త కమిటీ, బాపూజీనగర్‌లో, పేరపల్లి, నాగారం, జూలపల్లిలోని ఆదర్శనగర్‌లో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహాల శోభాయాత్ర వైభవంగా కొనసాగింది. దుర్గామాత విగ్రహాలను నిమజ్జనం కోసం గుండారం రిజర్వాయర్‌, మంథని, గోదావరిఖని ప్రాంతాల్లోని గోదావరి తీరంలో, ఆయా గ్రామాల్లోని చెరువులకు తరలించారు.