మంగళవారం 01 డిసెంబర్ 2020
Peddapalli - Oct 27, 2020 , 05:15:22

పండుగ పూట.. గుండె కోత

పండుగ పూట.. గుండె కోత

  • ఆది, సోమవారాల్లో  ఏడుగురు మృత్యువాత
  • బతుకమ్మ పువ్వు కోసం వెళ్లి యువకుడు
  • ఆన్‌లైన్‌ క్లాసుల కోసం సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని బాలుడు 
  • ట్రాక్టర్‌ ఢీకొని ఒకరు.. ట్రాక్టర్‌ పై నుంచి పడి మరొకరు
  • స్నేహితులతో కలిసి వస్తుండగా వేర్వేరు చోట్ల ఇద్దరు 
  • విద్యుత్‌ షాక్‌తో మహిళ
  • అమ్మవారి నిమజ్జనానికి వెళ్లి మూడేళ్ల చిన్నారి గల్లంతు
  • బాధిత కుటుంబాల్లో విషాదం

పండుగ పూట అందరూ సంబురాల్లో మునిగిపోతుంటే ఆ కుటుంబాల్లో మాత్రం విషాదం నిండింది. ఆది, సోమవారాల్లో జరిగిన వేర్వేరు ఘటనల్లో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఏడుగురిని మృత్యువు కబళించింది. బతుకమ్మ పువ్వు కోసం వెళ్లి యువకుడు ప్రాణాలు కోల్పోవడం, ఆన్‌లైన్‌ క్లాసుల కోసం సెల్‌ఫోన్‌ కొనివ్వడం లేదని విద్యార్థి ఊపిరి తీసుకోవడం, తల్లిదండ్రులతో కలిసి అమ్మవారి నిమజ్జనానికి వెళ్లి కళ్లముందే చిన్నారి గల్లంతు కావడం బాధిత కుటుంబాలకు గుండె కోత మిగిల్చింది.  

  - నమస్తే నెట్‌వర్క్‌

నమస్తే నెట్‌వర్క్‌ : పండుగను సంబురంగా జరుపుకుందామనుకున్న ఆ కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆది, సోమవారాల్లో జరిగిన వేర్వేరు ఘటనల్లో ఏడుగు రి ప్రాణాలు గాల్లో కలువగా మూడేళ్ల చిన్నారి నీటిలో గల్లంతైంది. చందుర్తి మండలం లింగంపేటలో బైక్‌ అదుపుతప్పి మల్యాలకు చెందిన టేకుమల్ల తిరుపతి, మల్లాపూర్‌ మండలం వాల్గొండలో విద్యుత్‌షాక్‌ తగిలి ఎదులాపురం లక్ష్మి, మెట్‌పల్లి మండలం మెట్ల చిట్టాపూర్‌ శివారులో ట్రాక్టర్‌ ఢీకొని రాజేందర్‌, కోనరావుపేట మండలంలోని నాగారం లో ట్రాక్టర్‌లో గడ్డి మెలుపుతుండగా కింద పడి ఊరడి అంజయ్య మృత్యువాత పడ్డారు. మరోవైపు ఆన్‌లైన్‌ క్లాసులు వినేందుకు సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని కొడిమ్యాల మండ లం తిర్మలాపూర్‌లో విద్యార్థి రఘుప్రసాద్‌ ఉరేసుకొని బలవన్మరణం చెందాడు. ధర్మపురి మండ లం ఆరెపల్లి గ్రామానికి చెందిన దుర్గం అంజయ్య (24) బతుకమ్మ పువ్వు కోసమని వెళ్లి చెట్టు పైనుంచి పడి మరణించాడు. కాగా దుర్గామాత విగ్రహ నిమజ్జనానికి తండ్రితో వెళ్లిన చిన్నారి శ్రీవేణి సిరిసిల్ల మానేరువాగులో గల్లంతైంది.

ప్రాణం తీసిన కరెంట్‌

మల్లాపూర్‌: పండుగ పూట ఆ మహిళను మృత్యువు విద్యుత్‌ రూపంలో కబళించింది. ఎస్‌ఐ రవీందర్‌ వివరాల ప్రకారం.. వాల్గొండకు చెందిన ఎదులాపురం లక్ష్మి (50) అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ చిలివేరి లక్ష్మి ఇంట్లో చిన్న చిన్న పనులు చేస్తూ, జీవనం సాగిస్తున్నది. ఈ క్రమంలో ఆదివారం వేకువజామున లక్ష్మి కాలకృత్యాలను తీర్చుకునేందుకు ఆరుబయట ఉన్న నల్లా వద్దకు వెళ్లింది. అక్కడే పక్కకు విద్యుత్‌ తీగలకు ఆనుకొని సెంట్రింగ్‌ వైరు కిందికి వేలాడుతూ ఉన్నది. ఆ వైరును తొలగించే క్రమంలో విద్యుత్‌ షాక్‌ తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె కుమార్తె స్రవంతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. 

ఫోన్‌ కొనివ్వలేదని విద్యార్థి.. 

కొడిమ్యాల: ఆన్‌లైన్‌ క్లాసులకు సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని ఓ విద్యార్థి బలవనర్మణం చెందాడు. ఎస్‌ఐ శివకృష్ణ వివరాల ప్రకారం.. తిర్మలాపూర్‌ గ్రామానికి చెందిన మంకు స్వామి, సుజాత దంపతులకు కొడుకు రఘుప్రసాద్‌(14), కూతురు షర్మిల ఉన్నారు. స్వామి గ్రామంలో కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రఘుప్రసాద్‌ మోడల్‌ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. కొన్ని రోజులుగా ఆన్‌లైన్‌ క్లాస్‌లు వినాలని, సెల్‌ ఫోన్‌ కొనివ్వాలని ఇంట్లో గొడవ చేస్తున్నాడు. ఇప్పుడు పైసలు లేవని, తర్వాత కొనిస్తానని తండ్రి నచ్చజెప్పినా వినలేదు. బర్లకు గడ్డి కోసేందుకు స్వామి ఆదివారం తన భార్య, బిడ్డతో కలిసి పొలం వద్దకు వెళ్లాడు. ఈ సమయంలో రఘుప్రసాద్‌ రేకుల షెడ్డుకు ఉరేసుకొని, ఆత్మహత్య చేసుకున్నాడు. స్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. 

బతుకమ్మ పువ్వుకు వెళ్లి..

ధర్మపురి రూరల్‌: బతుకమ్మ పువ్వు కోసం వెళ్లిన ఓ యువకుడు చెట్టు మండ విరిగి కింద పడి మృతిచెందాడు. ఎస్‌ఐ శ్రీకాంత్‌ వివరాల ప్రకా రం.. ధర్మపురి మండలం ఆరెపల్లి గ్రామానికి చెం దిన దుర్గం అంజయ్య(24) వ్యవసాయ కూలీ. బతుకమ్మ పండుగ కోసమని సోమవారం పువ్వు సేకరించేందుకు వెళ్లాడు. అడవి తంగేడు చెట్టు ఎక్కి పూలు కోస్తుండగా మండ విరగడంతో జారి సీసీ రోడ్డుపై పడ్డాడు. తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. అంజయ్య సోదరుడు దుర్గం రాజమల్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

నిమజ్జనానికి వెళ్లి 

చిన్నారి గల్లంతు

సిరిసిల్ల క్రైం: తండ్రితో సంబురంగా అమ్మవారి విగ్రహ నిమజ్జనం చూద్దామని వెళ్లిన ఆ మూడేళ్ల చిన్నారి చూస్తుండగానే మాయమైం ది. ఆడుకుంటూ, అల్లరి చేస్తూ ఇంట్లో సందడి చేసిన ఆ పాప క్షణంలోనే కనిపించకుండా పోయింది. తండ్రి నిమజ్జన పనిలో ఉండగా చిన్నారి మానేరు వాగులో గల్లంతైంది. వివరాల ప్రకారం.. సిరిసిల్లలోని బీవైనగర్‌కు చెందిన కందుల లక్ష్మణ్‌ దేవీ నవరాత్రుల సందర్భంగా తన ఇంట్లో ఘటం ఏర్పాటు చేసుకున్నాడు. తొమ్మిది రోజుల పాటు పూజలు చేసిన ఆయన, సోమవారం మధ్యా హ్నం నిమజ్జనం చేసేందుకు భార్య, ఇద్దరు కూతుళ్లతో కలిసి సాయినగర్‌ వెళ్లాడు. సాయిబాబా ఆలయప్రాంతంలోని మానేరువాగులో అమ్మవారి ఘటాన్ని నిమజ్జనం చేశాడు. ఇదే సమయంలో చిన్న కూతురు శ్రీవేణి నీటిలో పడి గల్లంతైంది. కళ్లముందే కూతురు కనిపించకపోయేసరికి తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. ‘శ్రీవేణి, శ్రీవేణి’ అంటూ దిక్కులు పెక్కుటిల్లేలా కేకలు వేశారు. గుండెలు బాదుకుంటూ రోదించారు. గజ ఈతగాళ్లతో వెతికించినా ఆ పాప ఆచూకీ దొరకలేదు.  

బైక్‌ అదుపు తప్పి ఒకరు..

చందుర్తి: మండలంలోని లింగంపేట శివారులో బైక్‌ అదుపుతప్పి ఒకరు మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. మల్యాలకు చెందిన టేకుమల్ల తిరుపతి (33), తన స్నేహితులు పాటి ప్రశాంత్‌, నెదురి అరవింద్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై ఆదివారం ఉదయం 11గంటలకు రుద్రంగి గ్రామానికి వెళ్లి తిరిగివస్తున్నారు. ఈ సమయంలో లింగంపేట శివారులో బైక్‌ అదుపు తప్పి కింద పడ్డారు. తిరుపతికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. తిరుపతి తండ్రి టేకుమల్ల శంకర్‌ పాటి ప్రశాంత్‌పై ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ డీ సునీల్‌ తెలిపారు.

వాహనం ఢీకొని  యువకుడి మృతి

యైటింక్లయిన్‌ కాలనీ: యైటింక్లయిన్‌ కాలనీ సమీపంలోని పోతన కాలనీకి చెందిన ట్రాక్టర్‌ డ్రైవర్‌ పారుపెల్లి రాజు కుమారుడు పారుపెల్లి శరత్‌ (20) సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గోదావరిఖని టూ టౌన్‌ పోలీసుల వివరాల ప్రకారం. సోమవారం రాత్రి అల్లూరు నుంచి పోతన కాలనీకి ద్విచక్ర వాహనంపై పారుపెల్లి శరత్‌ తన మిత్రుడు అక్షయ్‌తో కలిసి వెళ్తున్నాడు. ఎదురుగా వచ్చిన బొలేరో వాహనం ఢీకొట్టడంతో తలకు బలమైన గాయాలై శరత్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంటి పెద్ద కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. 

ట్రాక్టర్‌ పై నుంచి పడి అన్నదాత.. 

కోనరావుపేట: మండలంలోని నాగారం గ్రామంలో ట్రాక్టర్‌ పైనుంచి కింద పడి ఊరడి అంజయ్య (55) మృతిచెందాడు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. అంజయ్య తనకున్న భూమిలో వ్యవసాయం చేసుకుంటూ, కూలి పనికి కూడా వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ నెల 21న గ్రామంలోని ఓ వ్యక్తికి చెందిన పశువులకు ఎండు గడ్డి తీసుకువచ్చేందుకు కూ లికి వెళ్లాడు. ట్రాక్టర్‌ పైన గడ్డి మెలుగుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు జారి కింద పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు కరీంనగర్‌లోని ఓ ్రప్రైవేటు దవాఖానకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి మృతి చెందాడు. మృతుడికి భార్య లస్మవ్వ, ముగ్గురు కుమారులు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సిరిసిల్ల ఏరియా దవాఖానకు తరలించినట్లు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. అంజయ్యకు రైతు బీమా వర్తిస్తుందని వ్యవసాయాధికారులు తెలిపారు. బాధిత కుటుంబాన్ని సర్పంచ్‌ బాస లావణ్య పరామర్శించారు.

ట్రాక్టర్‌ ఢీకొని ఒకరు.. 

మెట్‌పల్లి రూరల్‌: మెట్‌పల్లి మండలం మెట్లచిట్టాపూర్‌ శివారులో ట్రాక్టర్‌ ఢీకొని ఒకరు దుర్మరణం చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. మెట్‌పల్లి మండలం రంగారావుపేట గ్రామానికి చెందిన చొప్పరి శంకర్‌(55) కొడుకు రాజేందర్‌కు వరికోత యంత్రం ఉంది. మెట్లచిట్టాపూర్‌ శివారులో నడుస్తున్నది. సోమవారం పొలం కోస్తుండగా శంకర్‌ వరి కోత యంత్రం ఆపరేటర్లకు భోజనం ఇచ్చేందుకు వెళ్లాడు. పని ముగించుకొని తిరిగి వస్తుండగా, ధాన్యం లోడింగ్‌కు వచ్చిన ట్రాక్టర్‌ ప్రమాదవశాత్తు ఢీకొట్టింది. ఈ ఘటనలో తలకు దెబ్బలు తగిలి శంకర్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.