శుక్రవారం 04 డిసెంబర్ 2020
Peddapalli - Oct 25, 2020 , 04:38:28

జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ

జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ

పూలవనంలా పల్లె, పట్నం 

సంబురంగా ఆడిపాడిన ఆడబిడ్డలు 

పెద్దపల్లి కల్చరల్‌ : సద్దుల సంబురాలు శనివారం జిల్లాలో అంబరాన్నంటాయి. ఆడబిడ్డల ఆటపాటలతో ఊరూరూ పూలవనాల్లా మారాయి. ఉదయం నుంచే మహిళలు తీరొక్కపూలతో ఓర్పుగా, అందంగా బతుకమ్మలను పేర్చారు. సాయంత్రం కొత్త బట్టలు ధరించి, గౌరమ్మకు పూజలు చేశారు. ఆ తర్వాత కూడళ్ల వద్ద బతుకమ్మలను ఉంచి ఆటపాటలతో హోరెత్తించారు. వందలాది మంది ఒక్కచోట చేరి ఆడారు. అనంతరం బతుకమ్మలను చెరువులు, కుంటలు, కాలువలతోపాటు ఏర్పాటు చేసిన తెప్పల్లో నిమజ్జనం చేశారు. ‘పోయిరా గౌరమ్మ.. పోయిరావమ్మా’ అంటూ వీడ్కోలు పలికారు. ఒకరికొకరు వాయినాలు ఇచ్చుకున్నారు. ‘కొత్త సిబ్బి.. పాత సిబ్బి’ అంటూ సత్తులు పంచుకొని తిన్నారు. కాగా, కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌, జమ్మికుంటలో జరిగిన వేడుకల్లో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పాల్గొన్నారు. కరీంనగర్‌ శివారులోని మానేరు డ్యాం వద్ద జరిగిన వేడుకల్లో మంత్రి గంగుల కమలాకర్‌ హాజరై జిల్లా ప్రజలకు బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి కొప్పుల ఈశ్వర్‌ కరీంనగర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో కూతురు నందినికి సహాయంగా బతుకమ్మ పేర్చారు.