శుక్రవారం 27 నవంబర్ 2020
Peddapalli - Oct 23, 2020 , 04:58:41

నేడే లాభాల వాటా

నేడే లాభాల వాటా

  • పంపిణీకి అంతా రెడీ 
  • మొత్తం 278 కోట్ల సొమ్ము అందజేత 
  • మార్చిలో కోతపెట్టిన జీతం కూడా 
  • మస్టర్లు, ఇన్సెంటివ్‌ ఆధారంగా చెల్లింపులు
  • ఇన్సెంటివ్‌ కార్మికులకు 86శాతం వాటా 
  • ఒక్కొక్కరికి రూ.లక్షకు పైనే వచ్చే అవకాశం..
  • నేరుగా ఖాతాల్లోకే జమ
  • కార్మిక కుటుంబాల్లో హర్షం

గోదావరిఖని, నమస్తే తెలంగాణ: నల్లసూర్యుడి ఇంట లాభాల పంట పండబోతున్నది. భూగర్భంలో పగలనకా.. రాత్రనకా పనిచేసి సంస్థను ప్రగతి పథంలో నడిపిస్తున్న కార్మికుల శ్రమకు తగ్గ ప్రోత్సాహం దక్కబోతున్నది. కష్టకాలంలోనూ కార్మిక సంక్షేమ మే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ అందిస్తున్న లాభాల్లో వాటాల పం పిణీకి యాజమాన్యం అంతా రెడీ చేసింది. హాజర్లు, ఇన్సెంటివ్‌ల ఆధారంగా శుక్రవారం చెల్లింపులు చేయనుండగా, ఒక్కొక్కరికి రూ.లక్ష దాకా వచ్చే అవకాశం ఉంది. నేరుగా ఖాతాల్లోనే జమ చేయనుండగా, కార్మిక కుటుంబాల్లో హర్షం వ్యక్తమవుతున్నది. 

278కోట్ల పంపిణీ 

సింగరేణి సంస్థ గత ఆర్థిక సంవత్సర సాధించిన రూ.993 కోట్ల లాభాల్లో 28శాతం వాటాగా రూ.278 కోట్లు శుక్రవారం చెల్లించనున్నారు. అలాగే మార్చి నెలలో కోతపెట్టిన 15రోజుల జీతాన్ని ఇవ్వనున్నారు. ఈ లాభాల వాటాలో 82 శాతం మస్టర్లపై, 14 శాతం ఉత్పత్తి చెల్లిస్తారు. వీటితో పాటు వ్యక్తిగత ప్రతిభ, ప్రత్యేక ఇన్సెంటివ్‌ సాధించిన వారికి 4 శాతం అదనంగా వర్తింపచేస్తారు. భూగర్భ గనుల్లో పనిచేసే ఉద్యోగులకు మస్టరుకు రూ. 227.70, ఉపరితల గనుల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రతి మస్టరుపై రూ. 180.26, డిపార్ట్‌మెంట్లు, ఆఫీసుల్లో పనిచేసే వారికి మస్టర్‌కు రూ.166.39 చొప్పున పంపిణీ చేయాలని నిర్ణయించారు. అయితే గనులవారీగా ఉత్పత్తి ఆధారంగా చెల్లించనున్న మొత్తాలను నిర్ణయించారు. ఆర్జీ-1లోని జీడీకే-1,3లో కార్మికులకు మస్టర్‌కు రూ.31.41గా, జీడీకే-2,2ఏ రూ.36.19గా, జీడీకే-5లో రూ.12.07గా, జీడీకే-11 గనిలో రూ.33.98గా, మేడిపల్లి ఓసీపీ-4లో రూ.14.89గా, ఆర్జీ-1 డిపార్ట్‌మెంట్లలో రూ.18.76గా చెల్లిస్తారు. ఆర్జీ-2 డివిజన్‌లోని జీడీకే-7ఎల్‌ఈపీ గనిలో మస్టర్‌కు రూ.34.48గా, వకీల్‌పల్లిలో రూ.28.21గా, ఓసీపీ-3లో రూ.37.04గా, ఆర్జీ-2 డిపార్ట్‌మెంట్లలో రూ.35.83గా, ఏఎల్పీలో రూ.42.13గా, ఓసీపీ-1లో రూ.37.84గా, ఓసీపీ-2లో రూ.38.95గా, ఆర్జీ-3 డిపార్ట్‌మెంట్లలో రూ.39.67గా చెల్లిస్తారు. ఉత్పత్తి ఆధారంగా ఈ చెల్లింపులను ప్రతి ఒక్క కార్మికుడికి చెల్లిస్తారు.

ఇన్సెంటివ్‌ కార్మికులకు 4శాతం అదనం.. 

బొగ్గు ఉత్పత్తిలో ప్రతిభచూపే కార్మికులకు భారీ వాటా లభించనుంది. ప్రధానంగా ఓసీపీల్లో ఆపరేటర్లు, ఇతర కార్మికులు ఇన్సెంటివ్‌ పొందుతుంటారు. వీరికి 2019-20లో ఇన్సెంటివ్‌గా రూ.12.93కోట్లను చెల్లించారు. అయితే లాభాల్లో వాటాగా ఈ సారి 4శాతం (రూ.11.12కోట్లు)గా నిర్ణయించగా, మొత్తంగా 86శాతం దక్కనున్నది. ఈ లెక్కన ఒక్కో కార్మికుడు రూ.లక్షకు పైగానే వచ్చే అవకాశం ఉంది. 

మాట నిలబెట్టుకున్నాం.. 

దసరాకు ముందుగానే లాభాల్లో వాటా ఇప్పిస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. ముందు నుంచీ కార్మికులంటే సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక అభిమానం. అందుకే సంస్థ కష్టాల్లో ఉన్నా 28శాతం వాటా ప్రకటించి పెద్ద మనసును చాటుకున్నారు. వాటాతోపాటు మార్చి నెలలో కోతపెట్టిన జీతాలు ఇప్పిస్తున్నాం. కార్మికులు డబ్బులు పొదుపుగా వాడుకోవాలి.

- టీబీజీకేఎస్‌ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి