ఆదివారం 01 నవంబర్ 2020
Peddapalli - Oct 17, 2020 , 02:07:57

‘చితి’కిన బతుకులు

‘చితి’కిన బతుకులు

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ధర్మపురికి చెందిన నలుగురి దుర్మరణం

మృతుల్లో తండ్రీ కొడుకులు, బావబామ్మర్దులు

బాధిత కుటుంబాల్లో విషాదఛాయలు

ధర్మపురి: ఆంధ్రపదేశ్‌లోని గుంటూరు జిల్లా రొంపిచర్ల వద్ద గురువారం అర్ధరాత్రి కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మరణించారు. రొంపిచర్ల ఎస్‌ఐ హజ్రత్‌, మృతుల బంధువుల కథనం ప్రకారం..ప్రకాశం జిల్లా పామూరు మండలం రఘునాథపాలెం గ్రామానికి చెందిన తురుక మాధవ్‌ 15 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం ధర్మపురి మండలం తిమ్మాపూర్‌కు వచ్చి స్థిరపడ్డాడు. ఇటీవల తన సొంతూరులో ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇంటికి రంగులు వేసేబాధ్యతను ధర్మపురికి చెందిన పెయింటర్‌ జగదీశ్‌గౌడ్‌ భీరు(48)కి అప్పగించాడు. అయితే జగదీశ్‌గౌడ్‌ తన కొడుకు శివంగౌడ్‌ (13), మిత్రులు కట్కం మహేశ్‌ (38) పలాజి ఆనంద్‌ (35)ను కూడా వెంట రమ్మని కోరాడు. వీరు మాధవ్‌కు చెందిన కారులో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు రఘునాథంపాలెం గ్రామానికి బయల్దేరారు. ఈ క్రమంలో తెల్లవారుజామున 3 గంటలకు గుంటూరు జిల్లా అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిలోని సుబ్బాయపాలెం స్టేజీ వద్ద కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న తంగేడుమల్లి మేజర్‌ కాల్వ గట్టును బలంగా ఢీకొని పల్టీలు కొడుతూ కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. కారు నడుపుతున్న మాధవ్‌ ఎగిరిపడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న రొంపిచెర్ల ఎస్‌ఐ హజ్రత్‌, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. స్థానికుల సహకారంతో కాల్వలో పడ్డ కారు, మృత దేహాలను  వెలికితీయించి నర్సరావుపేట దవాఖానకు తరలించారు. మృతుల జేబుల్లో లభించిన ఐడీ కార్డుల ఆధారంగా జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన వారుగా గుర్తించి, ధర్మపురి పోలీసులకు సమాచారమందించారు. తీవ్రంగా గాయపడ్డ మాధవ్‌ నర్సరావుపేట దవాఖానలో చికిత్సపొందుతున్నాడు. 

పాపం పసివాడు..

ఈ ప్రమాదంలో 13ఏళ్ల శివంగౌడ్‌ మరణించడం ప్రతిఒక్కరినీ కలిచివేసింది. జగదీశ్‌గౌడ్‌ భీరు కొడుకైన శివంగౌడ్‌ మూడు నెలల క్రితమే ఉత్తరప్రదేశ్‌లో ఉంటున్న తన తల్లి దగ్గర నుంచి ధర్మపురిలో ఉంటున్న తండ్రి వద్దకు వచ్చాడు. ఈ క్రమంలో ఇంట్లో ఒంటరిగా ఉండలేక తండ్రి వెంట వెళ్లి మరణించాడు.  

బతుకుదెరువు కోసం వచ్చి..

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం మహారాజ్‌ గండ్‌ జిల్లా, ముజ్రి మండలం, బైదాబాజం గ్రామానికి చెందిన జగదీశ్‌గౌడ్‌ భీరు బతుకు దెరువు కోసం 10 ఏళ్ల కిత్రం ధర్మపురికి వచ్చాడు. రంగులు వేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో భవన నిర్మాణ కాంట్రాక్టర్‌ మాధవ్‌తో స్నేహం ఏర్పడింది. మాధవ్‌ సొంతూరైన రఘునాథపాలెం గ్రామానికి వెళ్తూ  రోడ్డు ప్రమాదంలో మరణించాడు. జగదీశ్‌గౌడ్‌కు భార్య సుమన్‌గౌడ్‌, కూతురు భుజాలగౌడ్‌ ఉన్నారు. 

స్నేహితుడితో వెళ్లి..అనంత లోకాలకు..  

ధర్మపురికి చెందిన కట్కం మహేశ్‌ ఇటీవలే దుబాయ్‌ నుంచి వచ్చాడు. ఊరిలోనే    ఓ షాపు పెట్టుకొని జీవిస్తున్నాడు. మహేశ్‌కు పెయింటర్‌ జగదీశ్‌గౌడ్‌ భీరు మంచి స్నేహితుడు.. అతడి కోరిక మేరకు మహేశ్‌ తన బావ ఆనంద్‌ను వెంట తీసుకొని కారులో బయలుదేరి మత్యువాత పడ్డారు. మహేశ్‌కు భార్య భవాని, కూతురు రేణుశ్రీ, కొడుకు ప్రీతమ్‌ ఉన్నారు. 

అయ్యో ఆనంద్‌..

ధర్మపురి మండలంలోని రాయపట్నం గ్రామానికి చెందిన పలాజి ఆనంద్‌ వడ్రంగి పనిచేసుకుంటూ బతుకుతున్నాడు. తన బావమరిది మహేశ్‌, స్నేహితులు మాధవ్‌, జగదీశ్‌గౌడ్‌ కోరిక మేరకు ఆంధ్రాకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. అందరితో కలివిడిగా ఉండే ఆనంద్‌ మృతిపట్ల ధర్మపురి, రాయపట్నం గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

భోరుమన్న భారాబిడ్డలు..

మహేశ్‌, ఆనంద్‌ రాత్రి 12గంటల ప్రాంతంలో ఇండ్లకు ఫోన్‌ చేశారు. మరికొద్దిసేపట్లో గమ్యస్థానానికి చేరుతామని తమ భార్యలకు చెప్పారు. పిల్లల క్షేమ సమాచారాన్ని తెలుసుకున్నారు. అయితే తెల్లారేసరికి తమ భర్తల మరణవార్త విని మహేశ్‌ భార్య భవాని, ఆనంద్‌ భార్య స్వాతి ఒక్కసారిగా కుప్పకూలారు. గుండెలు బాదుకుంటూ రోదించారు. రాత్రి ఫోన్లో మాట్లాడిన విషయాలను గుర్తుచేసుకుంటూ..‘ఆ మాటే చివరి మాట అయిందా..అయ్యా అంటూ..’గొల్లుమన్నారు. హృదయవిదారకంగా రోదించిన తీరు చుట్టుపక్కల వారిని కలిచివేసింది.   

ప్రముఖుల పరామర్శ..

మృతుల కుటుంబాలను ధర్మపురి డీసీఎమ్మెస్‌ చైర్మన్‌ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, జడ్పీటీసీ అరుణ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సంగి సత్తెమ్మ, ఏఎంసీ చైర్మన్‌ అయ్యోరి రాజేశ్‌కుమార్‌ తదితరులు పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.