సోమవారం 30 నవంబర్ 2020
Peddapalli - Oct 17, 2020 , 01:29:06

రామగుండంలో విపత్తు ప్రతిస్పందన దళం

రామగుండంలో విపత్తు ప్రతిస్పందన దళం

మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో ఏర్పాటు

జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే కోరుకంటి

కోల్‌సిటీ: రాష్ట్రంలో ఎప్పుడు, ఎక్కడ ఎలాంటి ఆపద వచ్చినా ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం రక్షణ కవచంగా నిలుస్తున్నదని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ ఉద్ఘాటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు రామగుండం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో విపత్తు ప్రతిస్పందన దళాన్ని(డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌) ఏర్పాటు చేశారు. ఈ మేరకు స్థానిక నగర పాలక సంస్థ కార్యాలయం ఆవరణలో శుక్రవారం సాయంత్రం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వర్షకాలం వరదలు, విపత్తులు సంభవిస్తే ఈ ఫోర్సు ఆగమేఘాల మీద ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతుందన్నారు. రామగుండం కార్పొరేషన్‌ పరిధిలో ఏ సమయంలోనైనా వరద, విపత్తులు వస్తే బల్దియా కార్యాలయంలో కాల్‌ సెంటర్‌ 96036 66444కు సమాచారం అందిస్తే ఈ దళం వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపడుతుందన్నారు. కార్యక్రమంలో రామగుండం నగర పాలక సంస్థ మేయర్‌ డా.అనిల్‌కుమార్‌, డిప్యూటీ మేయర్‌ అభిషేక్‌రావు, కార్పొరేటర్‌ సాగంటి శంకర్‌, నాయకులు తానిపర్తి గోపాల్‌ రావు, గడ్డి కనుకయ్య తదితరులు పాల్గొన్నారు.