మంగళవారం 24 నవంబర్ 2020
Peddapalli - Oct 16, 2020 , 02:15:04

పూల పండుగకు వేళాయె..

పూల పండుగకు వేళాయె..

  • నేటి నుంచి చిన్న బతుకమ్మ lవాడవాడలా సంబురాలు lతొమ్మిది రోజులపాటు వేడుకలు

కరీంనగర్‌కల్చరల్‌/పెద్దపల్లి కల్చరల్‌/సిరిసిల్ల కల్చరల్‌/ వేములవాడ కల్చరల్‌ : బతుకమ్మ.. బతుకునిచ్చే వేడుక.. చిన్నా, పెద్దా అందరూ సంతోషంగా ఉండాలని ఆశీర్వదించే అమ్మవారి దీవెన.  మహిళలందరూ ఒక చోట చేరి చేసుకొనే పండుగ. స్నేహితులందరినీ ఒక దగ్గరికి చేర్చే వేదిక. అత్తవారింటికి వెళ్లిన ఆడబిడ్డలను పుట్టింటికి చేర్చే తరుణమిది. పెరిగిపోతున్న అంతరాలను చెరిపివేసి అను బంధాలను పెంచే సందర్భమిది. ఈ పండుగ అన్ని వర్గాలను సంఘటితం చేయడంలో కీలక భూమిక పోషిస్తుంది. గ్రామంలో ఉన్న అన్ని కులాలు, వర్ణాలకు చెందిన మహిళలు, యువతులు బతుకమ్మలను అందంగా పేర్చుకొని ముందు తమ ఇండ్ల వద్ద, అనంతరం వీధుల  వద్ద, అనంతరం గ్రామ కూడలి వద్ద ఉంచి పాటలు పాడుతూ ఆడుతారు. తొమ్మిది రోజుల పాటుసాగే ఈ ఉత్సవం అందరి మధ్య కలుపుగోలుతనం, స్నేహబంధాన్ని పెంచుతున్నది. భిన్న కులాలుగా, వర్ణాలుగా, విడిపోయిన మహిళల మధ్య సామాజిక ఐక్యత కనిపిస్తుంది. ఇదే సమయంలో పల్లెపల్లెనా శ్రమైక జీవన సౌందర్యం ప్రతిబింబిస్తుంది. అయితే ఈ సారి కరోనా నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ ఆడుకుంటేనే మంచిది. 

ఆరోగ్య సూత్రాలకు వేదిక.. 

ఆరోగ్య సూత్రాలకు సైతం బతుకమ్మ పండుగ వేదికగా నిలుస్తుంది. వర్షరుతువు ముగిసి, శరత్‌ రుతువు ప్రారంభమయ్యే తరుణంలో ఈ వేడుక వస్తుంది. ఇందులో అత్యంత కీలకమైనవి పూలు. పూలల్లో ఆరోగ్యాన్ని పంచే ఆయుర్వేద విలువలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. రుతువులు మారే సమయంలో నీటిని శుద్ధి చేయాల్సిన అవసరం ఉంటుందని వైద్యశాస్త్రం చెబుతున్నది. ఈ నేపథ్యంలో తంగేడు, గునుగు, కలువ, అడవి చామంతి, గుమ్మడి, బీర, కట్ల, లాంటి పూలను దాదాపు ఎనిమిది రోజలుపాటు నీళ్లలో వేస్తారు. ఈ పూలలో ఉన్న ఆయుర్వేద గుణాలు చెరువుల్లోని నీటిని శుద్ధి చేసి, అందులోని మలినాలను తొలగిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బతుకమ్మ కోసం పూలను కోయడం, పేర్చడం, సాయంత్రం ఆడడం ఇలా తొమ్మిది రోజుల దినచర్యతో మహిళల ఆరోగ్యం సైతం మెరుగుపడుతుందని చెబుతున్నారు. అలాగే దేహానికి శక్తిని ఇచ్చే పప్పుధాన్యాలు ఈ సందర్భంలోనే ఇంటికి చేరుకుంటాయనీ, వాటిని ఆరగించడంతోశారీరక ఆరోగ్యం సమకూరుతుంది. 

నేటి నుంచి ప్రారంభం

ఆడబిడ్డలకు ఉత్సాహం, ఉల్లాసాన్ని పంచే బతుకమ్మ సంబురాలు శుక్రవారం నుంచి మొదలవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర పండుగగా  ఖ్యాతి గాంబతుకమ్మ సంబురాలు తొమ్మిది రోజులపాటు పిల్లా పాపలకు సంతోషాన్నిస్తాయి. ఈ నెల 24న సద్దుల బతుకమ్మతో సంబురాలు ముగుస్తాయి.