శనివారం 28 నవంబర్ 2020
Peddapalli - Oct 15, 2020 , 02:00:37

నేలవాలిన వరి.. దెబ్బతిన్న పత్తి

నేలవాలిన వరి.. దెబ్బతిన్న పత్తి

  • n వర్షాలతో నీట మునిగిన పంటలు
  • n పరిశీలించిన అధికారులు

మంథని రూరల్‌/ మంథని టౌన్‌: వరుసగా కురుస్తున్న వర్షాలతో వరి నేలవాలగా, పత్తి దెబ్బతిన్నది. పలుచోట్ల వర్షం నీటిలో వరి మునిగింది. ఆయా గ్రామాల్లో పంట నష్టాన్ని అధికారులు పరిశీలించారు. మంథని మండలం కాకర్లపల్లి, గోపాల్‌పూర్‌, పుట్టపాక, నగరంపల్లి, గుంజపడుగు తదితర గ్రామాల్లో, మంథని మున్సిపల్‌ పరిధిలోని కూచిరాజ్‌పల్లి, పవర్‌హౌస్‌కాలనీల్లో వరి నేలకు ఒరిగింది. అలాగే పత్తి ప్రస్తుతం కాయాలు కాస్తున్న దశలో దెబ్బతింటున్నాయి. మంథని మండలం, మంథని మున్సిపల్‌ పరిధిలో మొత్తం 75 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు ఏవో అనూష తెలిపారు. రైతులు పొలాల్లో నుంచి నీటిని బయటికి పంపించాలని సూచించారు. 

పంట నష్టాలపై పరిశీలన

కమాన్‌పూర్‌: వర్షాలకు దెబ్బతిన్న పంటలను మండలంలోని పలు గ్రామాల్లో అధికారుల బృందం పరిశీలించింది. రాజాపూర్‌, నాగారం, జూలపల్లి, గుండారం గ్రామాల్లో వరి, పత్తి పరిశీలించి, నష్టం వివరాలను నమోదు చేసుకున్నారు. మరికొన్ని గ్రామాల్లో వరికి చీడ పీడలు వ్యాపించడంలాంటి సమస్యలను గుర్తించారు. నివారణ చర్యలు సూచించారు. కార్యక్రమంలో ఏవో  ప్రమోద్‌ కుమార్‌, ఏఈవోలు సురేశ్‌, శ్రీనివాస్‌ ఉన్నారు. 

నిండుగా మానేరు

ముత్తారం: మానేరు వాగు నిండుగా ప్రవహిస్తున్నది. భారీ వర్షాలతో వరద నీరు పొటెత్తుతున్నది. పెద్దపల్లి-భూపాలపల్లి జిల్లాల సరిహద్దులోని ఖమ్మంపల్లి, అడవిశ్రీరాంపూర్‌, ఓడేడు, పారుపల్లిలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బుధవారం మానేరు వాగు ఇరువైపులా నిండుకుండలా పవహిస్తున్నది. ఎడతెరిపి లేకుం డా కురుస్తున్న వర్షాలతో అన్నదాతలకు నష్టం జరుగుతున్నది. ముత్తారం, కేశనపల్లి, హరిపురం, ఓడేడు, అడవిశ్రీరాంపూర్‌, ఖమ్మంపల్లి, పారుపల్లి మైదంబండ, లక్కారం, మచ్చుపేటలో వర్షాలకు పొలాలు, పత్తి దెబ్బతింటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

ఓదెల: వర్షాలు, గాలుల కారణంగా వరికి పెద్ద మొత్తం లో నష్టం వాటిల్లింది. చెరువులు, కుంటల్లోకి మళ్లీ వరద నీరు వచ్చి మత్తడులు దుంకుతున్నాయి. ప్రస్తుతం ఏరే దశలో ఉన్న పత్తి తడిసి నల్లబడుతున్నదని రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో 717 ఎకరాల మేర వరి పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. కొలనూర్‌, గోపరపల్లి, కొమిర, అబ్బిడిపల్లె, నాంసానిపల్లి, లంబాడీతండా, పిట్టల ఎల్లయ్యపల్లె, కనగర్తి, పొత్కపల్లి, గూడెం, శానగొండ తదితర గ్రామాల్లో వరి నీట మునిగింది. కొందరు రైతులు నీళ్లలో ఉన్న వరిని కట్టలు కట్టుకోని రక్షించుకునేందుకు యత్నిస్తున్నారు.

ధర్మారం: రచ్చపల్లి, నర్సింహుపల్లి, నర్సింగాపూర్‌, కమ్మర్‌ఖాన్‌పేట, లంబాడీతండా(కె), పెర్కపల్లిలో వరి నేల వాలింది. రచ్చపల్లిలో జక్కుల దామోదర్‌ రావుతో పాటు పలువురు రైతులకు చెందిన వరి నేల వాలడంతో ఏఈవో ప్రశాంత్‌ గ్రామానికి వెళ్లి పరిశీలించారు. కానంపల్లి శివారులో చెక్‌ డ్యాం మీదుగా వరద నీరు ప్రవహించింది. గ్రామాల్లో నేల వాలిన పొలాల సమాచార సేకరణలో ఏఈవోలు నిమగ్నమయ్యారు.

ఎలిగేడు: వర్షాలతో మండలంలోని పలు గ్రామాల్లో చేతికొచ్చిన వరి నేలకొరిగింది. ధూళికట్టలో ఐలయ్యకు చెందిన మూడెకరాల వరి కురిసిన గాలివానకు నేలకొరిగింది. ఎలిగేడు మండలంలో గాలివానలకు నేలకొరిగి నష్టం జరిగిన పంటలను అంచనా వేస్తున్నామని, నివేదికను ఉన్నతాధికారులకు పంపుతున్నామని బుధవారం ఏవో ఉమాపతి చెప్పారు.

సుల్తానాబాద్‌రూరల్‌: మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం తడవగా, చేతికొచ్చిన పంటలు నేలవాలాయి. నీరుకుళ్ల సర్పంచ్‌ కోటగిరి విజేందర్‌కు చెందిన సుమారు నాలుగు ఎకరాల వరి నేలవాలిందని చెప్పారు. అధికారులు పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదించాలని సర్పంచ్‌ కోరారు. 

పాలకుర్తి: వర్షానికి వాగులు, చెరువుల మంతడ్లు పొంగి పొర్లుతున్నాయి. మరో పదిరోజుల్లో కోతకు వచ్చే వరి నేల కొరిగింది. మండలంలో 15వేల ఎకరాల్లో వరి వేయగా, సుమారు 800 ఎకరాల్లో తీవ్ర నష్టం జరిగింది. మరో 300 ఎకరాల్లో పాక్షికంగా నష్టం వాటిల్లింది. భారీ వర్షాలకు పంట నష్టపోతున్న రైతుల వివరాలను మండల వ్యవసాయశాఖ ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నది.  ఈసాలతక్కళ్లపల్లి, పాలకుర్తి, కొత్తపల్లి, రామారావుపల్లి, గుడిపల్లి, జయ్యారం, పుట్నూర్‌, కుక్కలగూడూర్‌, ముం జంపల్లి, మారేడుపల్లి, ఉండేడ గ్రామాల్లో చేతికొచ్చిన వరి, పత్తి నేలవాలాయి. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఎంపీపీ వ్యాళ్ల అనసూర్య రాంరెడ్డి కోరారు. బండలవాగు వంతెన నిర్మించిన గుత్తేదారు వంతెనకు ఇరువైపులా రోడ్డు పూర్తి చేయలేదు. గుంతలమయమైన రోడ్లతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.  

పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి మండలంలో1,350 రైతులకు సంబంధించిన 2,363 ఎకరాల్లో వరి నేల వాలింది. అలాగే 350 మంది రైతులకు సంబంధించిన 484 ఎకరాల్లో పత్తికి నష్టం వాటిల్లినట్లు అధికారులు నివేదికను సిద్ధం చేశారు. పొలాల్లోని నీటిని రైతులు బయటికి పంపించాలని ఏవో అలివేణి సూచించారు. పత్తిలో వర్షం నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని వివరించారు.