బుధవారం 02 డిసెంబర్ 2020
Peddapalli - Oct 07, 2020 , 02:27:54

కళ.. మనిషికి గొప్పవరం

కళ.. మనిషికి గొప్పవరం

కోల్‌సిటీ : కళలు..మనిషికి దేవుడిచ్చిన గొప్పవరమని, అలాంటి కళాకారులకు స్వరాష్ట్రంలో కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత పట్టాభిషేకం జరిగిందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ స్పష్టం చేశారు. రామగుండం సాంస్కృతిక సంక్షేమ కమిటీ ఆధ్వర్యంలో గోదావరిఖని మార్కండేయకాలనీలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో మంగళవారం జరిగిన ‘గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం స్మృతిలో స్వర నివాళి’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి, బాలు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తున్న ఎంతోమంది కళాకారులకు పుట్టినిల్లుగా రామగుండం పారిశ్రామిక ప్రాంతం నిలుస్తున్నదన్నారు. కోల్‌బెల్ట్‌ ప్రాంతంలోని కళాకారులను ఆదుకునేందుకే రామగుండం సాంస్కృతిక సంక్షేమ కమిటీని ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. రామగుండం కళాకారులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. గోదావరిఖనిలో ఆడిటోరియం కలను త్వరలోనే సాకారం చేయనున్నట్లు తెలిపారు. 

కోరుకంటి నోట..‘విధాత’ పాట

 ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ వేదికపై తనకు ఇష్టమైన ‘విధాత తలపున.. ప్రభవించినది అనాది జీవన వేదం..’ అంటూ ఎస్పీ బాలు ఆలపించిన పాటను పాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. తాను 7వ తరగతిలో ఉన్నప్పుడు ఈ పాటకు ఎంతో ఆకర్షితుడనయ్యానని, అప్పటి నుంచి తన మదిలో ఈ పాట ఎప్పుడూ మెదులుతూనే ఉంటుందని చందర్‌ పేర్కొన్నారు. తాను కూడా బాలు వీరాభిమానినని గుర్తు చేశారు. సినీ నటుడు శివారెడ్డి మాట్లాడుతూ కళలను, కళాకారులను ప్రోత్సహించే వ్యక్తి రామగుండం ఎమ్మెల్యేగా ఉండడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా తన మిమిక్రీ ప్రదర్శనతో అందరిని ఉత్తేజపరిచారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ అభిషేక్‌ రావు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆర్గనైజర్‌ మూల విజయారెడ్డి, కార్పొరేటర్‌ అడ్డాల స్వరూప, దాతు శ్రీనివాస్‌, కృష్ణవేణి, రాజ్‌కుమార్‌, సరోజన, కో-ఆప్షన్‌ సభ్యులు వంగ శ్రీనివాస్‌ గౌడ్‌, చెరుకు బుచ్చిరెడ్డి, మాజీ మేయర్‌ జాలి రాజమణి, ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు వంశీ, సినీ అభిమాన సంఘాల ఐక్యవేదిక జిల్లా చైర్మన్‌ గుండేటి రాజేశ్‌, నిర్వాహకులు తానిపర్తి గోపాల్‌ రావు, మేజిక్‌ రాజా, దయానంద్‌ గాంధీ, దామెర శంకర్‌, నాయకులు పాల్గొన్నారు.