శుక్రవారం 27 నవంబర్ 2020
Peddapalli - Oct 06, 2020 , 02:10:04

తుది దశకు టీఎస్టీపీపీ

తుది దశకు టీఎస్టీపీపీ

పెద్దపల్లి నమస్తే తెలంగాణ/ జ్యోతినగర్‌: రామగుండంలోని ఎన్టీపీసీ ఆవరణలో 1,600 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌ను ఎన్టీపీసీ యాజమాన్యం నిర్మిస్తున్నది. 10,598. 98 కోట్ల భారీ వ్యయంతో నిర్మాణం చేపట్టింది. 2016 జనవరి 29న పనుల ప్రక్రియ ప్రారంభమైంది. అప్పటి నుంచి షెడ్యూల్‌ ప్రకారం పనులు నడుస్తున్నాయి. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా కాస్త నెమ్మదించగా, ప్రస్తుతం ఊపందుకున్నాయి. ఇదే సమయంలో ఎన్టీపీసీ యాజమాన్యం భద్రతా నియమాలపై ప్రత్యేక దృష్టిసారించింది. జీరో యాక్సిండెంట్‌ దిశగా పనులు చేయిస్తున్నది. ప్రాజెక్టులోని ఒక్కో పని ప్రాంతంలో ఒక సేఫ్టీ అధికారిని నియమించుకొని రక్షణ చర్యలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ.. కార్మికులకు సలహాలు, సూచనలు అందిస్తున్నది. 

 నాలుగేళ్లలోనే ఆశించిన ప్రగతి..

ప్లాంట్‌లో ప్రధాన అవార్డులో స్టీమ్‌ జనరేటర్‌ నిర్మాణ పనులను బీహెచ్‌ఈఎల్‌ కంపెనీ చేపడుతుండగా, టర్బన్‌ జనరేటర్‌ను ఆల్‌స్టోం(జీఈ)కంపెనీ, బీఓపీ (బ్యాలెన్స్‌ ఆఫ్‌ ప్లాంట్‌) పనులను టాటా కంపెనీ చేస్తున్నది. ఇక టర్బన్‌ జనరేటర్‌, బాయిలర్‌, కోల్‌ ఆయిలింగ్‌ ప్లాంట్‌ పనులు పూర్తికావచ్చాయి. ఇందులో యూనిట్‌-2లో బాక్సప్‌ పనులు గత మే నెలలో కంప్లీట్‌ అయ్యాయి. సీడబ్ల్యూ బాక్స్‌ పుష్‌ పనుల్లో చాలా పురోగతి కనిపిస్తున్నది. ఇంకా స్విచ్‌ యార్డు పనులు, 400కేవీ ట్రాన్స్‌మిషన్‌, 11కేవీ స్టేషన్‌ చార్జింగ్‌, యూనిట్‌-1తోపాటు యూనిట్‌-2 జనరేటర్స్‌ రోటర్‌ బిగింపు పనులు ఆరు నెలల కిందే పూర్తయ్యా యి. స్టేషన్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ చార్జింగ్‌ ప్రక్రియ పూర్తి కాగా, బాయిలర్‌ పనులు తుది దశలో ఉన్నాయి. బీఓపీ పనుల్లో సీహెచ్‌పీ, క్రషర్‌, వాటర్‌ ట్రీట్‌మెంట్‌ నిర్మాణ పనులు 50 శాతం పూర్తయ్యాయి. ఈ లెక్కన యూనిట్‌-1 పనులు 75 శాతం, యూనిట్‌-2 పనులు 65శాతం కాగా, ఓవరాల్‌గా మాత్రం ప్లాంట్‌ నిర్మాణం 75శాతానికిపైగా పూర్తయింది. 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు యూనిట్ల కోసం రెండు మార్గాలతో ఒకే చిమ్నీని 255 మీటర్ల ఎత్తుతో నిర్మించగా, లిప్ట్‌ పనులు ఆఖరి అంకానికి చేరుకున్నాయి. అనుకున్న లక్ష్యానికి ముందుగానే ఎన్టీపీసీ యాజమాన్యం బాయిలర్‌ ట్రయల్‌ రన్‌ను పూర్తి చేసింది. 

పర్యావరణ రక్షణకు సూపర్‌ క్రిటికల్‌ టెక్నాలజీ

పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాంట్‌ నిర్మాణంలో భారత దేశంలోనే తొలిసారిగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ఇందులో స్టీమ్‌ జనరేటర్‌ కోసం సూపర్‌ క్రిటికల్‌ టెక్నాలజీని వాడుతున్నారు. దీని సామర్థ్యం పారామీటర్స్‌ 603 డిగ్రీ, 281 కేజీ చదరపు సెంటీమీటర్లు. దీని వల్ల బొగ్గు వినియోగం, వాయు కాలు ష్యం భారీగా తగ్గడంతోపాటు గ్రీన్‌హౌస్‌ వాయువు విడుదల అతి తక్కువగా ఉంటుంది. ఇంకా భూమి వినియోగం తగ్గించేందుకు స్విచ్‌యార్డును సైతం జీఐఎస్‌ (గ్యాస్‌ ఇన్సులేటెడ్‌ స్విచ్‌గేర్‌) విధానంలో చేపట్టారు. 

 మార్చిలోగా ముహూర్తం.. 

ఈ ఆర్థిక సంవత్సరం 2020-21 చివరి నాటికి విద్యుదుత్పత్త్తిని టార్గెట్‌గా పెట్టుకున్న ఎన్టీపీసీ, ఈ విద్యుత్‌ ప్లాంట్‌ పనులను నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం చేస్తున్నది. వాస్తవానికి ఇప్పటికే ప్లాంట్‌ అందుబాటులోకి రావాల్సి ఉండగా, లాక్‌డౌన్‌, ఇతర సమస్యలతో ఆలస్యమైంది. మరో ఐదారు నెల ల్లో యూనిట్‌-1లో విద్యుత్‌ ఉత్పత్తిని మొదలు పెట్టేందుకు ప్రణాళికలు వేయగా, ఇది అందుబాటులోకి వస్తే రాష్ట్ర అవసరాలన్నీ తీరనున్నవి.