బుధవారం 25 నవంబర్ 2020
Peddapalli - Oct 04, 2020 , 00:26:43

సర్కారు వైద్యంపై నమ్మకం కలిగిస్తున్నాం

సర్కారు వైద్యంపై నమ్మకం కలిగిస్తున్నాం

  • ఆదిశగా అభివృద్ధి పనులు చేస్తున్నాం
  • లిక్విడ్‌ ప్లాంట్‌తో ఆక్సిజన్‌ కొరతకు శాశ్వత పరిష్కారం
  • జిల్లాలో 99 శాతం కరోనా బాధితుల రికవరీ రేటు
  • త్వరలోనే సిటీస్కాన్‌ ఏర్పాటు చేస్తాం
  • మంత్రి గంగుల కమలాకర్‌
  • కరీంనగర్‌లో రూ.85 లక్షలతో లిక్విడ్‌ ఆక్సిజన్‌ ప్లాంట్‌ ప్రారంభం

కరీంనగర్‌ హెల్త్‌: ప్రభుత్వ దవాఖానకు వస్తే చికిత్స అందుతుందన్న నమ్మకం కలిగించేలా సీఎం కేసీఆర్‌ ఆలోచనలతో అభివృద్ధి పనులు చేస్తున్నామని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్‌ స్పష్టం చేశారు. శనివారం కరీంనగర్‌లోని ప్రభుత్వ దవాఖానలో 85 లక్షలతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్‌ లిక్విడ్‌ప్లాంట్‌ను కలెక్టర్‌ శశాం క, జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, నగర మేయర్‌ సునీల్‌రావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ ఏనుగు రవీందర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దవాఖానలో ఆక్సిజన్‌ కొరతకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. దవాఖానలో మొత్తం 400 పడకలకు నేరుగా ఆక్సిజన్‌ సరఫరా జరుగుతుందని చెప్పారు. 20 సంవత్సరాల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్‌, వైద్యం ఆరోగ్యశాఖ మంత్రి సహకారంతో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేశామని, హైదరాబాద్‌ తర్వాత కరీంనగర్‌లోనే ఉందని తెలిపారు. 

కరోనాపై అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లా లో రికవరీ రేటు 98 నుంచి 99 శాతం వరకు ఉందన్నారు. కేసీఆర్‌ కిట్లతో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందని చెప్పారు. త్వరలోనే కరీంనగర్‌ దవాఖానలో సిటీస్కాన్‌ను ఏర్పా టు చేస్తామన్నారు. కార్యక్రమంలో దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రత్నమాల, ఆర్‌ఎంవో డాక్టర్‌ శౌరయ్య, ఏవో నజీముల్లాఖాన్‌, ఎంసీహెచ్‌ ఏవో డాక్టర్‌ అలీం, ఆఫీస్‌ సూపరింటెండెంట్‌ పుల్లెల సుధీర్‌, నర్సింగ్‌ కళాశాల సూపరింటెండెంట్‌ సులోచన, ఫార్మసీ సూపర్‌వైజర్లు భారతి, శివకుమార్‌, ఆకుల ప్రభాకర్‌, కాంట్రాక్టర్‌ మధుసూదన్‌రాజు పాల్గొన్నారు.