మంగళవారం 01 డిసెంబర్ 2020
Peddapalli - Sep 25, 2020 , 02:27:57

రెండు రోజుల్లో బదిలీ కార్మికులకు తీపికబురు

రెండు రోజుల్లో బదిలీ కార్మికులకు తీపికబురు

  • టీబీజీకేఎస్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బీ వెంకట్రావ్‌, మిర్యాల రాజిరెడ్డి

గోదావరిఖని: సింగరేణిలో పని చేస్తున్న బదిలీ వర్కర్లకు మరో రెండురోజుల్లో తీపి కబురు అందుతుందని  అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బీ వెంకట్రావ్‌, మిర్యాల రాజిరెడ్డితెలిపారు. సింగరేణి వ్యాప్తంగా 2,400 మంది బదిలీ వర్కర్లను రెండు దఫాలుగా పర్మినెంట్‌ చేసేందుకు యాజమాన్యంతో గుర్తింపు సంఘం ఒప్పందం చేసుకుందని వెల్లడించారు. గురువారం ఆయన  స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. మొదటి దఫాలో 1,230 మంది బదిలీ వర్కర్లకు సీనియర్‌ ప్రాతిపదికన రెండురోజుల్లో ఆయా ఏరియాలకు ఉత్తర్వులు జారీ చేస్తారన్నారు. మరో 1,200 మంది బదిలీ వర్కర్లు 2019 డిసెంబర్‌ 31వ తేదీకి ముందు ఉద్యోగంలో చేరిన వారిలో అండర్‌గ్రౌండ్‌లో 190, ఉపరితల గనిలో 240 మస్టర్లు చేసిన వారికి మార్చి లోగా జనరల్‌ మజ్దూర్లుగా పదోన్నతులు కల్పించేలా యాజమాన్యంతో ఒప్పందం జరిగిందని వివరించారు. సింగరేణి చరిత్రలోనే ఎప్పుడూ లేనివిధంగా ఉద్యోగంలో చేరిన ఏడాది లోనే బదిలీ వర్కర్లకు జనరల్‌ మజ్దూర్లుగా పదోన్నతి కల్పిస్తున్న ఏకైక గుర్తింపు సంఘంగా టీబీజీకేఎస్‌ నిలిచిపోతుందని ఉద్ఘాటించారు. ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేని కొన్ని జాతీయ కార్మిక సంఘాలు ఇందులో టీబీజీకేఎస్‌ సాధించిందేమి టంటూ అవహేళనగా మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అదే జాతీయ కార్మిక సంఘా ల హయాంలో బదిలీ వర్కర్లుగా డ్యూటీలో చేరిన కార్మికులకు సుమారు 7 నుంచి 8 ఏండ్ల సర్వీసు గడిస్తే గానీ జనరల్‌ మజ్దూర్లుగా పదోన్నతులు వచ్చేవి కాదని గుర్తుచేశారు. సింగరేణిలో కారుణ్య నియామకాల అమలు జాతీయ సంఘాలకు మింగుడుపడడం లేదన్నారు. కోలిండియాలో మరెక్కడా లేనివిధంగా సింగరేణిలో అదనంగా అమలవుతున్న హక్కులను కాలరాసేందుకే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. సింగరేణి సంస్థలో ఏటా దసరా పండుగకు ముందు కార్మికులకు లాభాల వాటా చెల్లింపులు జరుగుతున్నాయని, అదే పద్ధతిలో గుర్తింపు సంఘంగా టీబీజీకేఎస్‌ ప్రభుత్వంతో మాట్లాడి యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేయించి లాభాల వాటా పెంచుకుంటూనే వస్తున్నామన్నారు. ఇవేమి పట్టని జాతీయ సంఘాలు లాభాల వాటా చెల్లించాలంటూ ప్రకటనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. దసరా పండుగకు ముందే కార్మికులకు మెరుగైన లాభాల వాటా చెల్లించేందుకు కృషి చేస్తామన్నారు. సమావేశంలో టీబీజీకేఎస్‌ నాయకులు జావిద్‌ పాషా, దేవ వెంకటేశం, మండ రమేశ్‌, పుట్ట రమేశ్‌తోపాటు తదితరులున్నారు.

జీడీకే-11వ గనిపై గేట్‌ మీటింగ్‌

ఆర్జీ-1 పరిధిలోని జీడీకే-11వ గనిపై గురువారం జరిగిన గేట్‌ మీటింగ్‌కు టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు వెంకట్రావ్‌ హాజరై మాట్లాడారు. గతంలో పని చేసిన కార్మిక సంఘాలు కాలరాసిన ఎన్నో కార్మిక హక్కులను టీబీజీకేఎస్‌ హయాంలో ఎలాంటి స మ్మెలు చేయకుండా సాధించామని వివరించారు.  కరోనా ప్రభావంతో ఆగిపోయిన మెడికల్‌ బోర్డు ను త్వరలోనే మళ్లీ ప్రారంభిస్తామని, సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలతో కలిసి సీఎం కేసీఆర్‌ను కలిసి లాభాల వాటా ఇప్పిస్తామన్నారు. ఇక్కడ నాయకులు దామోదర్‌రావు, జావెద్‌ పాషా, సత్యనారాయణ, వెంకటేశ్‌, శ్యాంసన్‌, కృష్ణ, నాయిని శంక ర్‌, రామస్వామి, దుర్గం తిరుపతి, సత్యనారాయణరెడ్డి, శ్రీనివాస్‌, రాములుతోపాటు పలువురు ఉన్నారు.