మంగళవారం 01 డిసెంబర్ 2020
Peddapalli - Sep 25, 2020 , 02:28:02

‘స్వచ్ఛ’ సేవలకు ‘కాయకల్ప’

‘స్వచ్ఛ’ సేవలకు ‘కాయకల్ప’

  • n దవాఖానలకు అవార్డులు
  • n పరిశుభ్రతకు ప్రోత్సాహకం
  • n సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల, ధర్మపురి, గోదావరిఖని, సుల్తానాబాద్‌ ఎంపిక

పెద్దపల్లి, నమస్తే తెలంగాణ/ ఫర్టిలైజర్‌సిటీ/ ధర్మపురి/ సిరిసిల్ల టౌన్‌: స్వచ్ఛత, పరిశుభ్రత, వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌, తదితర అంశాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని ఆరు దవాఖానలు కాయకల్ప అవార్డులు దక్కించుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన అంశాల ఆధారంగా సామాజిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరును ప్రత్యేక కమిటీ అధ్యయనం చేసింది. 70 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన దవాఖానలనే కాయకల్ప అవార్డుకు పరిగణలోకి తీసుకున్నారు. అవార్డుకు ఎంపికైన దవాఖానలకు ఐఎస్‌వో సర్టిఫికెట్‌తో పాటు ఏటా ప్రోత్సాహకాన్ని కేంద్రం అందించనున్నది. జిల్లా దవాఖానతో పాటు, సామాజిక ఆరోగ్య, ప్రాథమిక ఆరోగ్య, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక వసతులు, వైద్య సేవలు, వ్యర్థాల నిర్వహణ, పారిశుద్ధ్యం, మద్దతు సేవలు, వ్యాధుల సంక్రమణ, నియంత్రణ, పరిశుభ్రతలాంటి అంశాల్లో ఏ మేరకు సేవలు అందుతున్నాయనే విషయమై పీర్‌ కమిటీ బృందాలు గతేడాది డిసెంబర్‌ 19 తేదీ నుంచి 29వ తేదీ దాకా అధ్యయనం చేశాయి. కాగా, జగిత్యాల ప్రధాన దవాఖాన 70.3 శాతం, ధర్మపురి సీహెచ్‌సీ 71.2 శాతం మార్కులు సాధించాయి. నిర్దేశించిన అంశాల్లో జగిత్యాల దవాఖాన 500 మార్కులకు 352 మార్కులు సాధించింది. ధర్మపురి సీహెచ్‌సీ 500 మార్కులకు 356 మార్కులు సాధించింది. అవార్డు నిధుల్లో 25 శాతం దవాఖానలో పని చేసే సిబ్బందికి కేటాయించనుండగా, 75 శాతం దవాఖానలో పరికరాలు, ఇతర వైద్య సేవల్లో ఉపయోగించే యంత్రాలకు కేటాయించనున్నారు.

పీర్‌ కమిటీలతో అధ్యయనం

2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ దవాఖానల్లో అందుతున్న సేవలపై పీర్‌ కమిటీలతో కేంద్ర ప్రభుత్వం అధ్యయనం చేయించింది. జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో మౌలిక వసతుల కల్పనతోపాటు వైద్య సేవలు మెరుగు పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నది. సామాజిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అవసరమైన వసతులు కల్పించడమే కాకుండా ఆకుపచ్చ రంగులు వేయించి ఆకర్షణీయంగా కనిపించేలా చర్యలు చేపట్టింది. దవాఖానల్లో పరిశుభ్రతకు పెద్దపీట వేశారు. స్వచ్ఛభారత్‌ కింద దవాఖానల్లోనే కాకుండా ఆవరణ కూడా పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మ ఒడి, కేసీఆర్‌ కిట్‌ కార్యక్రమంలో భాగంగా దవాఖానలకు వచ్చే వారి సంఖ్య గతం కంటే బాగా పెరిగింది. మంత్రి కేటీఆర్‌తో పాటుగా రాజన్న సిరిసిల్ల జిల్లా దవాఖాన అభివృద్ధి కమిటీ చైర్మన్‌, సభ్యులు, వైద్యులు, వైద్య, శానిటేషన్‌ సిబ్బంది అందరి సహకారంతో అవార్డును సాధించుకున్నామని సిరిసిల్ల దవాఖాన సూపరింటెండెంట్‌ మురళీధర్‌రావు వెల్లడించారు.