గురువారం 26 నవంబర్ 2020
Peddapalli - Sep 24, 2020 , 01:38:16

దశమారిన రచ్చపల్లి

దశమారిన రచ్చపల్లి

  • సమైక్య పాలనలో సమస్యలతో సతమతం lస్వరాష్ట్రంలో ప్రగతి పథంలో గ్రామం 
  • 5కోట్లతో అభివృద్ధి పనులు  lనేడు ప్రారంభించనున్న మంత్రి కొప్పుల 
  • మంత్రి సహకారంతో పనులు చేస్తున్నాం: సర్పంచ్‌ మోర సుధాకర్‌

నాడు సమైక్య రాష్ట్రంలో చీకట్లో మగ్గిన రచ్చపల్లి గ్రామం, నేడు ప్రగతి బాటలో పయనిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి.. అనేక పథకాల అమలుతో ఒక్కో సమస్యను దూరం చేసుకుంటూ వెలుగు నింపుకుంటున్నది. మంత్రి కొప్పుల సహకారంతో 5కోట్ల నిధులు రాగా, దశాబ్దాల నాటి సమస్యలకు పరిష్కారం దొరికింది. రెండు వంతెనలతోపాటు సబ్‌స్టేషన్‌ నిర్మాణం పూర్తి కాగా, నేడు అమాత్యుడి చేతులమీదుగా ప్రారంభించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. ఎన్నో ఏండ్ల కల నెరవేరుతుండడంతో గ్రామస్తుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. - ధర్మారం 

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని రచ్చపల్లి మారుమూల గ్రామం. నాడు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేది. ఎన్నో సమస్యలతో తల్లడిల్లేది. నేడు ప్రగతి బాట పట్టింది. మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సహకారంతో సర్పంచ్‌ మోర సుధాకర్‌ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. అందులో భాగంగా దశాబ్దాల నాటి సమస్యలు పరిష్కారమవుతున్నాయి. రచ్చపల్లి-చింతలపల్లి మధ్య ఉన్న ఆర్‌అండ్‌బీ రహదారిపై 2కోట్ల 34 లక్షల వ్యయంతో పెద్ద వంతెన నిర్మాణం కాగా, రెండు గ్రామాల రాకపోకల ఇబ్బందులు తొలిగిపోయాయి. అలాగే రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరే చింతలపల్లి-పైడిచింతలపల్లి శివారులో ఒర్రెపై పంచాయతీ రాజ్‌ నిధులు కోటి 4లక్షల నిధులతో వంతెన నిర్మాణమైంది. ఈ రెండు బ్రిడ్జిలు సకాలంలో నిర్మించడంతో రవాణా సౌకర్యం మెరుగుపడింది. దీంతోపాటు 2016 మార్చి 24న కొప్పుల ఈశ్వర్‌ ఆనాడు విప్‌ హోదాలో శంకుస్థాపన 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌, అదే యేడాది నిర్మాణం పూర్తయింది. కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. భూమి విక్రయించిన రైతుకు 3లక్షలు చెల్లించడంతోపాటు ఇతర చిన్న చిన్న సమస్యలను మంత్రి కొప్పులతోపాటు సర్పంచ్‌ సమష్టిగా పరిష్కరించారు. దీంతో 1.38 కోట్లతో చేపట్టిన సబ్‌స్టేషన్‌ ప్రారంభానికి మార్గం సుగమమైంది. అలాగే గ్రామంలోని 2, 6వ వార్డుల్లో 10 లక్షలతో సీసీ రోడ్లు వేయించారు. గ్రామ శివారులోని ఎస్సారెస్పీ కాల్వ పక్కన ఉన్న 147 సర్వే నంబర్‌ ప్రభుత్వ భూమిలో పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, కంపోస్ట్‌ షెడ్‌, డంప్‌ యార్డు నిర్మించారు. మొత్తంగా 5 కోట్లతో చేపట్టిన వివిధ పనులను గురువారం మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ప్రారంభించనుండగా, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల నాటి కష్టాలు తీరి తమకు మంచి రోజులు వచ్చాయని సంబురపడుతున్నారు.

ప్రధాన సమస్యలు పరిష్కరించిన..

మారుమూల ప్రాంతంలో రచ్చపల్లికి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించిన. ప్రధాన సమస్యలు పరిష్కరించిన. రచ్చపల్లి, చింతలపల్లికి ఉపయోగపడే రెండు ప్రధానమైన వంతెనలను నిర్మించినం. రచ్చపల్లిలో లోలెవల్‌ రోడ్డ్యాం ఉన్న సమయంలో ఏటా వానకాలంలో వరద నీరు ఉధృతంగా ప్రవహించేది. రాకపోకలకు అంతరాయం కలిగేది. చింతలపల్లి వంతెనతో పైడిచింతలపల్లికి మేలు జరుగుతుంది. దూరభారం తగ్గుతుంది. గ్రామంలో 33/11 కేవీ సబ్‌ స్టేషన్‌ ప్రారంభం కానుండడంతో ఈ ప్రాంతంలో లో వోల్టేజీ, విద్యుత్‌కు అంతరాయం సమస్య పరిష్కారమవుతుంది.

- కొప్పుల ఈశ్వర్‌, రాష్ట్ర మంత్రి 

మంత్రి సహకారం మరువలేనిది.. 

మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సహాయ సహకారాల వల్లే మా గ్రామం అభివృద్ధి పథంలో ముందుకు పోతున్నది. మా గ్రామ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న మంత్రికి గ్రామ ప్రజల నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నం. అలాగే ఉప సర్పంచ్‌ చిందం మల్లేశం, వార్డు సభ్యులు గుర్రం లలిత, ఎనగందుల శ్రీనివాస్‌, ఎనగందుల లావణ్య, భూరగడ్డ స్వరూప, వేముర్ల సంధ్యారాణి, సొల్లు అంజయ్య, బెల్లాల రమేశ్‌, మామిడి విజయ, బుర్ర అంజయ్య, జీపీ కో ఆప్షన్‌ సభ్యులు, ఎంపీటీసీ బెల్లాల రోజారాణి, ఎంపీపీ ముత్యాల కరుణ శ్రీ బలరాంరెడ్డి, జడ్పీటీసీ పూస్కూరు పద్మజ జితేందర్‌రావు, మండల అధికారులు తమవంతుగా సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నరు. అందరి తోడ్పాటుతో భవిష్యత్‌లో మరింత ముందుకెళ్తం. 

- మోర సుధాకర్‌, సర్పంచ్‌ (రచ్చపల్లి)