శుక్రవారం 27 నవంబర్ 2020
Peddapalli - Sep 23, 2020 , 01:56:31

కేసీఆర్‌ దీవెనలతోనే రాజకీయ పునర్జన్మ

కేసీఆర్‌ దీవెనలతోనే రాజకీయ పునర్జన్మ

  • lకార్మికుడి బిడ్డగా పుట్టిన.. 
  • lరామగుండం అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తా 
  • lప్రజాసేవే పరమావధిగా ముందుకు సాగుతున్నా
  • lఈ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తా
  • l ‘నమస్తే’ ఇంటర్వ్యూలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌

‘ఇక్కడే పుట్టిన.. ఇక్కడే పెరిగిన.. కనిపెంచింది తల్లిదండ్రులైనా.. నాకు రాజకీయ జన్మనిచ్చింది మాత్రం సీఎం కేసీఆరే. అక్కున చేర్చుకొని అందలమెక్కించింది ఈ ప్రాంత కార్మికులు, ప్రజలే. వారి కష్టాలు, కన్నీళ్లను తుడిచి.. ప్రజాసేవే పరమావధిగా..   ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తా’ అని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ పునరుద్ఘాటించారు. బుధవారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. తన మనసులోని మాటలను ఇలా ఆవిష్కరించారు.. 

- పెద్దపల్లి, నమస్తే తెలంగాణ/గోదావరిఖని

 రాజకీయాల్లోకి ఎప్పుడు.. ఎలా వచ్చారు..   మీ ఎదుగుదలకు కారణం..?

చిన్ననాటి నుంచే రాజకీయాలంటే ఇష్టం. చదువుకునే రోజుల్లోనే విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్న. టీఆర్‌ఎస్‌ నేత, ప్రస్తుత మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ప్రోత్సాహం.. ఆయన చూపిన ఆదర్శాలతోనే రాజకీయాల్లోకి ప్రవేశించా. అనేక అవమానాలు, అవహేళనలు, ఆర్థిక ఇబ్బందులను అనుభవించిన. రాష్ట్ర సాధన కోసం సీఎం కేసీఆర్‌ చేపట్టిన ఉద్యమంలో గులాబీ జెండాను ఎత్తి పోరుబాటలో నడిచా. నా భార్య సహకారంతో మున్సిపల్‌ కౌన్సిలర్‌గా, ఫ్లోర్‌ లీడర్‌గా.. అంచెలంచెలుగా ఎమ్మెల్యే స్థాయికి ఎది గా. ప్రజా సేవకే నా జీవితాన్ని అంకితం చేస్తున్నా. 

రాజకీయ జీవితంలో మీరు ఎదుర్కొన్న మధురమైన, చేదు జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా..? 

ఒక సాధారణ కార్మికుడి బిడ్డగా పుట్టిన నాకు రాజకీయాల్లో అనేక సవాళ్లు ఎదురయ్యాయి. సామాన్య కార్యకర్త నుంచి ప్రయాణాన్ని మొదలు పెట్టి.. ఇవ్వాళ నేను ఒక ఎమ్మెల్యే కావడమే మధురమైన జ్ఞాపకం. ఇందుకు మొదటి నుంచి నాతో పాటు నా భార్య నిరంతరం శ్రమించింది. అనేక కష్టాల్లో తోడుగా నిలిచింది. నన్ను ఎమ్మెల్యేగా చూడాలని ఎన్నో కలలు కన్నది. నేను ఈ స్థాయికి వచ్చేనాటికే ఆమె నా కళ్ల ముందు లేకపోవడం నా జీవితంలో మరిచిపోలేని చేదు జ్ఞాపకం. ఇంతకంటే చేదు ఘటన నా జీవితంలో మరొకటి లేదు. 

ఎమ్మెల్యేగా మీ అనుభవాలు..? ఇప్పటివరకు ఏమేం పనులు చేశారు..? 

సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, కొప్పుల సహాయ, సహకారాలతో గతంలో ఏ ఎమ్మెల్యే చేయనన్నీ పనులు ఒక్క ఏడాదిలోనే చేశా.  కార్పొరేషన్‌లో విలీనమైన మూడు గ్రామాలను పంచాయతీలుగానే ఉంచాలనే సుదీర్ఘకాల సమస్యకు స్వయంగా ముఖ్యమంత్రిని కలిసి పరిష్కారం చూపా. పలు సందర్భాల్లో సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీలో మాట్లాడడంతో పాటు కేసీఆర్‌కు స్వయంగా వివరిస్తున్నా. రామగుండం కార్పొరేషన్‌ అభివృద్ధి కోసం పలు సమయాల్లో రాష్ట్ర, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసి నిధులు మంజూరు చేయించా.. అనేక పనులు చేయిస్తున్నా. 

మీకు ప్రజల నుంచి ఎలాంటి సహకారం లభిస్తున్నది..?

గతంలో పనిచేసిన అనేక మంది ఎమ్మెల్యేల పనితీరుకు భిన్నంగా ఉంటున్నా. నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ సమస్యల పరిష్కారం కోసం పని చేస్తున్నా. గతానికి భిన్నంగా ఇక్కడి ప్రజలు టీఆర్‌ఎస్‌కు పట్టంగడుతున్నారు. రామగుండం కార్పొరేషన్‌లో మెజారిటీ కార్పొరేటర్లను, నియోజకవర్గంలో అత్యధిక జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌లను గెలిపించి బహుమానంగా ఇచ్చారు. నా పనితీరుకు ప్రజలు ఇస్తున్న ఆదరణ ఫలితమే ఈ విజయాలు. 

రాబోయే రోజుల్లో మీ ముందున్న లక్ష్యం ఏంటి..? 

నియోజకవర్గ అభివృద్ధి విషయంలో నాకొక ప్రత్యేక విజన్‌ ఉంది. రాష్ట్రంలోనే ఇదో పెద్ద పారిశ్రామిక ప్రాంతం. సింగరేణి బిడ్డగా పుట్టిన నేను ప్రతి సింగరేణి కార్మికుడి బిడ్డకు ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం నా బాధ్యత. ఇందుకు గానూ పారిశ్రామిక ప్రాంతమైన రామగుండంలో ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఏర్పాటు చేయించడంతోపాటు ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అనేక ఉద్యమాలు సైతం చేస్తున్నా. గోదావరి జలాలతో కళకళలాడుతున్న ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఆకాంక్షిస్తున్నా. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ సహకారంతో బసంత్‌నగర్‌లో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కృషి చేస్తున్నా. ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి గోదావరిఖనిలో ఒక ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించా. రామగుండానికి నిధుల కొరత లేకుండా ఎప్పటికప్పుడు మంజూరు చేయిస్తున్నా. పారిశ్రామిక ప్రగతి కోసం మంత్రి కేటీఆర్‌ సహకారంతో ఐటీ టవర్స్‌, ఇండస్ట్రియల్‌ పార్కు కోసం ఇప్పటికే 102 ఎకరాల భూసేకరణ పూర్తి చేశాం. త్వరలోనే ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు అనేక ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. 

చివరగా టీఆర్‌ఎస్‌ నాయకులకు, కార్యకర్తలకు మీరిచ్చే సందేశం?

టీఆర్‌ఎస్‌ ఒక ఆకాంక్ష కోసం పుట్టిన పార్టీ.. అనేక ఉద్యమాలు.. త్యాగాలు చేసి ప్రజల కోరికను నెరవేర్చిన పార్టీ. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రంలో సుపరిపాలన కొనసాగుతున్నది. ఈ క్రమంలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనిని గడప గడపకూ తీసుకెళ్లేందుకు కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు. గతంలో అధికారంలో ఉన్న అనేక పార్టీలు ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తల జేబులు నింపితే టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఆకలిని ఓర్చుకొని కడుపు చేతబట్టుకొని పనిచేస్తున్నారు. ఇలా పని చేసే కార్యకర్తలు రాష్ట్రంలో ఏ పార్టీకి లేరు. టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తగా ఉన్నందుకు.. ఆ ప్రభుత్వంలో పని చేస్తున్నందుకు గర్వపడుతున్నా.