బుధవారం 21 అక్టోబర్ 2020
Peddapalli - Sep 20, 2020 , 03:00:30

‘ఆరోపణలు సరికాదు’

 ‘ఆరోపణలు సరికాదు’

కొత్తపల్లి: కొత్తపల్లి మున్సిపల్‌లో అదనంగా 9 మంది పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్నారని ఇటీవల కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ గున్నాల విజయ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు జెర్రిపోతుల మొండయ్య, మానుపాటి వేణుగోపాల్‌, గండు రాంబాబు పేర్కొన్నారు.  పట్టణంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కొత్తపల్లి గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడే 2011 జనాభా లెక్కల ప్రకారం 28 మంది పారిశుద్ధ్య సిబ్బంది పనిచేశారని, పని ఒత్తిడి కారణంగా అప్పటి పాలకవర్గం 42 మందికి పెంచి పారిశుద్ధ్య పనులకు వినియోగించారన్నారు. మున్సిపల్‌గా అప్‌గ్రేడ్‌ చేసిన సందర్భంలో సుమారు 20 వేల జనాభా అధికంగా పెరిగిన కారణంగా 42 మంది పారిశుద్ధ్య సిబ్బందితో పనుల నిర్వహణ సక్రమంగా జరుగడం లేదన్నారు. పట్టణం విస్తీర్ణం పెరుగడంతో ప్రస్తుత అవసరాలకు సుమారు 15 మంది పారిశుద్ధ్య సిబ్బందిని నియమించాలని కోరుతూ అధికారుల అనుమతి కోసం ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. పట్టణంలో కరోనా వైరస్‌ ఉధృతి నేపథ్యంలో 15 మంది యువకులు స్వచ్ఛందంగా పనిచేయడానికి ముందుకు వచ్చారని, వారికి ఇప్పటి వరకు మున్సిపల్‌ నుంచి ఎలాంటి జీతభత్యాలు చెల్లించడం లేదన్నారు. వారు స్వచ్ఛందంగా పనిచేస్తున్నారని, వారిని అభినందించాల్సింది పోయి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. పట్టణంలో పారిశుద్ధ్యం మెరుగునకు మున్సిపల్‌ పాలకవర్గం కృషి చేస్తుంటే కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ గున్నాల విజయ మరికొంత మందితో కలిసి కుటిల రాజకీయాలకు పాల్పడడం బాధాకరమని పేర్కొన్నారు. ఇప్పటికైనా రాజకీయాలను పక్కనపెట్టి తమతో కలిసి పట్టణాభివృద్ధికి సహకరించాలని కోరారు. 


logo